
ఏపీలో ఒకవైపు వడగాల్పులు..మరోవైపు పిడుగుల హెచ్చరికలు
ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్.. భారీ వర్ష సూచన.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం, రాయలసీమ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటమే దీనికి ప్రధాన కారణమని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్.. భారీ వర్ష సూచన
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు గంటల్లో ఇక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షంతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
జిల్లాల వారీగా వర్ష సూచన
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు పడొచ్చు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటుగా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉంది.
మరోవైపు సెగలు పుట్టిస్తున్న ఎండలు
వర్ష సూచన ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. సోమవారం పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండనుంది. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరులో 42.4 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటాయి.
ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎంఢీ (MD) ప్రఖర్ జైన్ ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు.
చెట్ల కింద వద్దు: పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండటం అత్యంత ప్రమాదకరం.
ఈదురు గాలులు: 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నప్పుడు పాత భవనాలు, హోర్డింగ్‌ల కింద నిలబడకూడదు.
ప్రయాణాలు: భారీ వర్షం, పిడుగుల సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం.
రైతులు: పొలాల్లో పనులు చేసే రైతులు, పశువుల కాపరులు పిడుగుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
Next Story

