పాలు అమ్మరాదు, పంచాలి అనే కర్నూల్ జిల్లా పల్లె కథ
x

'పాలు అమ్మరాదు, పంచాలి' అనే కర్నూల్ జిల్లా పల్లె కథ

“పాలు అమ్మితే పాడైపోతాం. ఆ డబ్బు మాకొద్దు!”


“పాలు అమ్మితే పాడైపోతాం. ఆ డబ్బు మాకొద్దు!” అని గట్టిగా చెబుతారు గంజిహళ్లి గ్రామస్థులు. పాలు కావాలని అడిగితే ప్రేమగా పోస్తారు. కానీ డబ్బు ఇవ్వబోతే మాత్రం చుక్క పాలు కూడా పోయ‌రు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం పరిధిలో ఉన్న ఈ చిన్న గ్రామం, ఎమ్మిగనూరు కు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేరుశనగ, వరి, పచ్చిమిరప పండించే ఈ వ్యవసాయ గ్రామంలో 1,200 ఇళ్లు… సుమారు 4,000 మంది నివాసితులున్నారు. గ్రామంలో ప్రస్తుతం 510 పాలిచ్చే పశువులు ఉన్నాయి. రోజుకు సుమారు 1,000 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, పాలు ఒక్క చుక్క కూడా అమ్మరు! “పాలు అవసరమైతే తీసుకోండి… కానీ డబ్బు వద్దు”. 400 ఏళ్ల నుంచి ఈ ఆచారం ఇప్ప‌ట్టికీ కొనసాగుతోంది.

400 ఏళ్ల క్రితం గ్రామంలో ఒక అనూహ్య ఘటన జరిగింది. పాడి పశువులకు అంటు వ్యాధి సోకి, గోవులు, గేదెలు చనిపోవడం మొదలైంది. ఆ సమయంలో గ్రామంలో రాజయోగి ముర్ము బడే సాహెబ్ తాతా నివసించేవారు. ఆయనకు పాలు తాగాలనిపించి, తన కొడుకు హుస్సేన్‌ సాహెబ్‌ను పాలు తీసుకురమ్మని ఊరిలోకి పంపించాడట. పశువులన్నింటికి జబ్బు చేయడంతో ఏ ఒక్కరూ పాలు పోయలేదట. చివరకు గ్రామ పెద్దయిన పెద్దనాగిరెడ్డి ఇంటికి వెళ్లగా తమ గోవు తీవ్రమైన వ్యాధితో ప్రాణం వదిలిందని, ఊరి చివరనున్న మారెమ్మవ్వ గుడి వద్ద ఆ కళేబరాన్ని పడేశామని చెప్పాడట.

అయితే పాలు కచ్చితంగా తీసుకెళ్లాలని హుస్సేన్‌ సాహెబ్‌ మారెమ్మవ్వ గుడి వద్దకు వెళ్ళాడట. పాలు తీసుకెళ్ళకపోతే తండ్రి కోప్పడతాడని హుస్సేన్‌ సాహెబ్‌ మారెమ్మవ్వను ప్రార్థించాడట. అతడి ప్రార్థనకు ప్రసన్నురాలైన ఆ దేవ‌త‌ ‘మీ తండ్రి నామాన్ని ఉచ్చరిస్తూ ఆవును లేపు’ అని చెప్పిందట. మారెమ్మవ్వ దేవత చెప్పిన ప్రకారమే తన తండ్రి పేరును ఉచ్చరిస్తూ.. ‘బాబా బోలే, దూద్‌ దేవ్‌’ అన్నాడట. ఆ మాటలకు ఆవు లేచి హుస్సేన్ సాహెబ్‌కు పాలు ఇచ్చిందట.

ఆ వింతను చూసిన జనం పశువులు చనిపోకుండా మార్గం చూపండని బడేసాబ్‌ను అడగగా ఇకపై గ్రామస్తులెవరూ ఊళ్లో పాలు అమ్మరాదని, పశువులను చంపకూడదని, పశుగ్రాసాన్ని తగుల బెట్టకూడదని సూచించారట. ఈ కట్టుబాటుకు లోబడి ఉండాలని ఊరి జనంతో మాట కూడా తీసుకున్నారట. ఆ రోజు నుంచి పాడి పంటలతో గ్రామం వృద్ధి చెందుతూ వచ్చిందట. ఆ మాటను ధిక్కరించి పాలు అమ్మిని వారి ఇళ్లలో పాడి పశువులు లేకుండా పోయాయట. కొందరు అనారోగ్యం పాలయ్యారట. మరికొందరు బికారులయ్యారని చెబుతారు. అవన్నీ చూసిన గ్రామ ప్రజలు కట్టుబాటును విస్మరించే సాహసం చేయలేదట. ఇప్పటికీ ఈ కథను ఊళ్లలో చెప్పుకుంటూ ఉన్నారు.

స్థానిక కథనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆళ్లగడ్డ తాలూకాలోని పొదల కందుకూరు గ్రామానికి చెందిన మహాత్మా బడేసాహెబ్ కు ఓ రాత్రి దివ్య దర్శనం కలిగింది. కొండ మాధవ స్వామి ఆలయంలోని దేవుడు ఆయన కలలో ప్రత్యక్షమై, తనను దర్శించమని పిలిచారట‌. ఆ పిలుపును ఆజ్ఞగా స్వీకరించిన బడేసాహెబ్ తెర్నకల్ (తరుణీకల్లు) గ్రామానికి చేరుకుని, కొండ మాధవ స్వామి ఆలయంలోనే నివసించసాగారు. అక్కడ ఆయన జీవితం భక్తి, సేవలతో నిండిపోయింది.

కొన్ని రోజుల తర్వాత, మళ్లీ అదే దైవ దర్శనం. ఈసారి స్వామి గారు గంజిహళ్లి గ్రామానికి వెళ్లమని ఆదేశించారట‌. కొండ మాధ‌వ స్వామి ఆజ్ఞను అనుసరించి బడేసాహెబ్ గంజిహళ్లి చేరుకున్నారు. ఆ గ్రామ పట్వారీ నాగిరెడ్డి, “ఈ గ్రామంలో ముల్లా లేరు. మీరు ఇక్కడే ఉండండి,” అంటూ ఆశ్రయం ఇచ్చినట్టు గ్రామస్తులు తరతరాలుగా చెబుకుంటున్నారు.

ఒక హిందూ ఆలయ దేవుడి దర్శనంతో ప్రయాణం ప్రారంభించిన బడేసాహెబ్, ముస్లిం మతపెద్దగా గంజిహళ్లిలో స్థిరపడి, మత సామరస్యానికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన జీవితం భక్తి భేదాలను దాటి, మనుషుల మధ్య ప్రేమను, ఐక్యతను పెంపొందించింది.

గ్రామస్తులు ఈ ప్రాంతంలో ఒక దర్గాను నిర్మించారు, అక్కడ అన్ని మతాల ప్రజలు ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి వస్తారు. "పశువులకు ఆహారంగా ఉపయోగపడేందుకు దాదాపు 50 ఎకరాల్లో మేతను సాగు చేస్తున్నాం", అని బడేసాహెబ్ దర్గా గౌరవ అధ్యక్షుడు సద్గురు కుటుంబం యొక్క ఎనిమిదవ తరం వారసుడు సయ్యద్ చిన్న ముద్గోల్‌ ఫెడ‌ర‌ల్ ఆంధ్ర‌తో చెప్పారు.

“మేము మా ఆవులు, గేదెలు ఉత్పత్తి చేసే పాలను గృహ వినియోగం, సమాజ భాగస్వామ్యం కోసం మాత్రమే ఉపయోగిస్తాము. మిగులు పాలను తోటి గ్రామస్తులకు ఉచితంగా ఇస్తాం”, అని పీఠాధిపతి షేక్‌ మహాబాబ్‌బాషా తెలిపారు.

“పాలు, మజ్జిగ, పెరుగు ఎవరికైనా అవసరమైతే ఉచితంగా ఇస్తాం. అమ్మడం మాత్రం మా ఊరిలో పాపంగా భావిస్తాం.” అని మహేశ్వర్ రెడ్డి చెప్పారు.

“ప్రత్యేకంగా చిన్న పిల్లలకు, అవసరంలో ఉన్నవారికి ఉచితంగా పంపిణీ చేస్తాం,” అని గ్రామ పెద్ద శ్రీనివాసులు చెప్పారు. మా ఇంట్లో వున్న గేదె రోజుకు మూడు లీటర్ల పాలు ఇస్తుంది. కానీ రెండు లీటర్లు మాత్రమే మేం ఉపయోగించుకుంటాం. మిగిలిన లీటర్ పాల‌ను ఉచితంగా పంచుతామ‌ని శ్రీనివాసులు ఫెడ‌ర‌ల్‌తో చెప్పారు.

ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం, లీటరు పాల ధర రూ. 80/-. అతని కుటుంబం నెలకు రూ. 2,400 విలువైన పాలను గ్రామంలో అవ‌స‌ర‌మైన వారికి అందజేస్తుంది.

"ఈ గ్రామంలో పాలు అమ్మడం లేదా కొనడం పాపంగా భావిస్తాం. గ్రామ ఇల‌వేల్పు అయిన మహాత్మా బడేసాహెబ్ శాపానికి గురవుతామనే నమ్మకంతోనే తాము పాలను కేవలం తమ సొంత అవసరాలకు మాత్రమే వాడుకుంటాం. అవ‌స‌ర‌మై ఎవ‌రైనా అడిగితే ఉచితంగా ఇస్తామ‌ని" చోడ‌మ్మ తెలిపారు.

"ఊరిలో ఎవరైనా మహిళకు ప్రసవం జరిగితే చుట్టుపక్కల ఇళ్ల నుంచి పాలు పంపడం ఆనవాయితీ" అని సులోచ‌న చెప్పారు.

మా గ్రామంలో పాలు అమ్మడం కొనడం నిషిద్ధం. ఇది మా పూర్వీకుల నుండి వస్తున్న నమ్మకం అని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసే యువ‌కుడు వెంక‌టేష్ చెప్పారు.

ముర్ము బ‌డే సాహెబ్ తాతా ఇస్లాం ధ‌ర్మాన్ని పాటిస్తూ, హిందూ సాంప్ర‌దాయాన్ని గౌర‌విస్తూ 1679 సంవ‌త్స‌రంలో జీవస‌మాధి అయ్యారు. గ్రామ ప్ర‌జ‌ల ఇల‌వేల్పుగా పూజ‌లందుకుంటున్నారు. అప్ప‌ట్లో ఆయ‌న చూపిన మార్గంలోనే గ్రామ‌స్థులు న‌డుస్తున్నారు", అని చిన్నముద్దుగోలు స్వామి చెప్పారు.

మా గ్రామంలో పాలు, పెరుగు అమ్మ‌రు. గోవ‌ధ నిషేదం అమ‌లులో వుంది. ఎవ‌రైనా అతిక్ర‌మించితే కుటుంబంలో కీడు జ‌రుగుతోంది. వారి వంశం ప‌త‌నం అవుతుంద‌నే శాపం వుంది. అలా కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్లు సయ్యద్ ముద్గోల్ చెప్పారు.

ఊళ్లో వాళ్లందరూ ఇలాగే కట్టుబడి ఉంటారు. గంజిహళ్లితో పాటు కడిమెట్ల గ్రామంలోనూ ఇదే ఆచారం కొనసాగుతోంది. ఈ గ్రామాల్లో హోటల్‌ నిర్వాహకులు కూడా పాలు అవసరమైతే పక్కనే ఉన్న గోనెగండ్ల, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి పాలు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటారు గాని, ఆ గ్రామంలో పాలు కొనరు. బడే సాహెబ్ తాతా చూపిన మార్గంలోనే గ్రామస్తులు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.

లాభం కోసం పరుగెత్తే ఈ కాలంలో, గంజిహళ్లి గ్రామం ఒక సందేశం ఇస్తోంది. “సమాజం బలంగా ఉండాలి అంటే పంచుకోవాలి. డబ్బు సంపాదించడం కంటే మనసు సంపాదించడం గొప్పది.”. నాలుగు శతాబ్దాలుగా మాట నిలబెట్టుకున్న ఈ గ్రామ‌ ప్రజలు, సంప్రదాయం అంటే కేవలం ఆచారం కాదు, ఆత్మగౌరవం అని నిరూపించారు. మనిషి గొప్పతనం సంపదలో కాదు, సత్సంకల్పంలో ఉందని శాశ్వత సందేశంగా నిలిచింది.

Read More
Next Story