పురందేశ్వరికి బిజెపి కలసిరావడం లేదా? ఎందుకు?
x

పురందేశ్వరికి బిజెపి కలసిరావడం లేదా? ఎందుకు?

పురందేశ్వరికి కాంగ్రెస్‌ కలిసొచ్చినట్లు బిజెపీ కలిసి రావడం లేదు. రెండు సార్లు పోటీ చేసినా ఒక్క సారి కూడా గెలవ లేదు. మూడో సారి ఏమవుతుందో?


కేంద్ర రాజకీయాల్లో చక్రం తప్పిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి ఆం«ధ్రప్రదేశ్‌లో గడ్డు కాలం వీస్తోంది. కాంగ్రెస్‌ కలిసొచ్చినట్లు బిజెపీ కలిసి రావడం లేదని ఆ పార్టీలో టాక్‌ వినిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి సునాయాసంగా విజయం సాధించిన దగ్గుబాటి పురందేశ్వరిని తాజాగా ఓటమి భయం వెంటాడుతోంది. బిజెపీ పార్టీలోకి వెళ్లిన తర్వాత ఇంత వరకు ఆమె ఖాతాలో గెలుపును నమోదు చేసుకోలేదు. బిజెపీ పార్టీ తరఫున ఇప్పటి వరకు రెండు సార్లు పోటీ చేసినా.. రెండు సార్లు ఓటమి పాలయ్యారు. తాజాగా రాజమండ్రి పార్లమెంట్‌ స్థానం నుంచి బిజెపీ అభ్యర్థిగా మరో సారి బరిలోకి దిగారు. ఈ సారి అయినా గెలుస్తారో లేదా ముచ్చటగా మూడో సారి ఓటమిని మూటగట్టుకుంటారో అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

కాంగ్రెస్‌ నుంచి రెండు సార్లు వరుసగా గెలుపు
దగ్గుబాటి పురందేశ్వరి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కుమార్తె. తన తండ్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనప్పటికీ ఆమె కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందడం విశేషం. ఎన్టీఆర్‌ మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడుతో నెలకొన్న విబేధాల నేపథ్యంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో పురందేశ్వరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగారు. బాపట్ల పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యరి,్థ టీడీపీ అభ్యర్థి అయిన దగ్గుబాటి రామానాయుడుపై దాదాపు 94వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. నాడు కేంద్రంలో ఏర్పడిన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మంత్రి వర్గంలో పురందేశ్వరికి చోటు దక్కింది. 2006లో ఆమె మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2009లో బాపట్ల ఎస్సీ రిజర్వుడు కావడంతో ఆమె అక్కడ నుంచి విశాఖకు మకాం మార్చారు. విశాఖపట్నం పార్లమెంట్‌ నుంచి రెండో సారి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన పురందేశ్వరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంవివిఎస్‌ మూర్తి, పీఆర్పీ అభ్యర్థి పైలా శ్రీనివాసరావుపైన 66వేలపైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. మానవ వనరుల శాఖ సహాయ మంత్రి బాధ్యతలతో పాటు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2004–05 ఏడాదికి గాను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురందేశ్వరి ఎంపికయ్యారు. ఎంపీగా ఉన్న సమయంలో గృహ హింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు బిల్లుపై జరిగిన చర్చలో పొల్గొని చేసిన ఆమె ప్రసంగం అందరి ప్రశంసలు అందుకుంది.
2014లో బిజెపీలోకి
రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో ఆమె కాంగ్రెస్‌ పార్టీని వీడారు. 2014లో ఆమె కాంగ్రెస్‌ నుంచి బిజెపీలో చేరారు. అదే ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఆమె ఈ సారి బిజెపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. రాజంపేట పార్లమెంట్‌ నుంచి బిజెపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత అక్కడ నుంచి మకారం మార్చారు. 2009లో గెలుపొందిన విశాఖపట్నానికి మారారు. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్‌ నుంచి బిజెపీ అభ్యర్థిగా పోటీ చేసి మరో సారి ఓటమి చెందారు. తర్వాత బిజెపీలో పలు పార్టీ బాధ్యతలు నిర్వహించిన పురందేశ్వరిని 2020లో ఒడిశా బిజెపీ ఇన్‌చార్చిగా నియమించారు. తర్వాత సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2023 జూలై 4న ఆంధ్రప్రదేశ్‌ బిజెపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించారు. ఎన్టీఆర్‌ రెండో కుమార్తె అయిన పురందేశ్వరి 1959 ఏప్రిల్‌ 22న జన్మించారు. ఆమె బాల్యం చెన్నైలో గడిచింది. అక్కడే బిఏ వరకు చదువు కూడా పూర్తి చేశారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషుతో పాటు విదీశీ భాషలైన ఫ్రెంచ్‌లో కూడా ఆమెకు ప్రావీణ్యముంది. పురందేశ్వరి కూచిపూడి నృత్యకారణి కూడా. 1996లో జెమాలిజీ(రత్న శాస్త్రం)లో ఆమె డిప్లోమా పూర్తి చేశారు.
రాజమండ్రి నుంచి బరిలోకి
ఆంధ్రప్రదేశ్‌ బిజెపీ అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి 2024 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్‌ నుంచి బిజెపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ గూడూరి శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్వపు అధ్యక్షులు గిడుకు రుద్రరాజు కూడా రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్‌ స్థానంలో తొలి సారి సోషలిస్టు పార్టీ గెలవగా తర్వాత సీపీఐ గెలిచింది. తర్వాత నుంచి కాంగ్రెస్‌ గెలిచి ఆ పార్టీకి కంచుకోటగా మారింది. తొమ్మిది సార్లు కాంగ్రెస్‌ గెలిచింది. మూడు సార్లు టీడీపీ గెలవగా, టీడీపీ మద్దతుతో బిజెపీ రెండు సార్లు గెలిచింది. ఈ సారి జనసేన, టీడీపీల మద్ధతుతో బిజెపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పురందేశ్వరి భవిష్యత్‌ ఎలా మారనుందో వేచి చూడాలి.
Read More
Next Story