వరంగల్ జిల్లాలోని మామునూర్ విమానాశ్రయం పునరుద్ధరణ,విస్తరణకు తొలి అడుగు పడింది. ఈ నెల 4వతేదీన ఢిల్లీ నుంచి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ బృందం వచ్చి పాత మామునూర్ విమానాశ్రయాన్ని పరిశీలించింది. అనంతరం విమానాశ్రయం అథారిటీ ఇంజినీర్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను కలెక్టరేట్ లో సమావేశమై విమానాశ్రయం విస్తరణ పనుల గురించి చర్చించారు. విమానాశ్రయ పనులు వేగిరంగా చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పనులను వేగిరం చేసింది. మామునూర్ విమానాశ్రయం విస్తరణలో ఇళ్లు కోల్పోయిన గాడిపెల్లి గ్రామ నిర్వాసితులతో సెప్టెంబరు 13వతేదీన శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద సమావేశమయ్యారు. ఆర్ అండ్ ఆర్, భూమి, ఇళ్లకు నష్టపరిహారం చెల్లింపుపై కలెక్టర్ చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలోనే సాంస్కృతిక చారిత్రక నగరంగా పేరొందిన వరంగల్‌లో విమానాశ్రయం నిర్మాణ పనులకు అడుగు ముందుకు పడింది. ఈ విమానాశ్రయం నిర్మాణమైతే వ్యాపారంతోపాటు పర్యాటక రంగానికి మహర్దశ పట్టనుంది.ఉడాన్ పథకం కింద మామునూర్ విమానాశ్రయాన్ని పునర్ ప్రారంభించాలని నిర్ణయించారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించేలా మామునూర్ విమానాశ్రయాన్ని విస్తరించి ,ఆధునీకరించాలని భారత విమానాశ్రయాల అథారిటీ (AAI), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది.
పరిహారం కోసం రైతుల ఆందోళన
వరంగల్ కు ఉజ్వల భవిష్యత్తుకు ఉద్ధేశించిన మామునూర్ విమానాశ్రయం కోసం భూమి సేకరణలో భాగంగా ఎకరానికి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ముందుగా దీనిపై మంత్రులు హామీలు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత శ్రద్ధ చూపడం లేదని రైతులు ఆవేదనగా చెప్పారు. నష్టపరిహారంపై తమ డిమాండ్ నెరవేర్చకపోతే నిరసన ప్రదర్శన నిర్వహించి సచివాలయాన్ని ముట్టడిస్తామని నిర్వాసిత రైతులు హెచ్చరించారు.ఇటీవల గడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాలకు చెందిన 40 మంది రైతులు విమానాశ్రయం సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రైతులు కోరారు.జిల్లా కలెక్టర్ రైతులతో పలుసార్లు సమావేశాలు నిర్వహించి చదరపు గజానికి రూ.4,000 పరిహారం ఇస్తామని చెప్పారని, కానీ మార్కెట్ విలువతో పోలిస్తే ఈ మొత్తం సరిపోదని నిర్వాసిత కుటుంబాలు అంటున్నాయి.
భూసేకరణకు రూ.205 కోట్ల విడుదల
మామునూర్ విమానాశ్రయంలో ఇప్పటికే 696 ఎకరాలు అందుబాటులో ఉన్నందున, విమానాశ్రయం విస్తరించడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అదనంగా 253 ఎకరాలు అవసరం.
వరంగల్‌లోని మామునూర్ విమానాశ్రయం విస్తరణకు భూసేకరణ కోసం రూ.205 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు నక్కలపల్లి, నలకుంట, గుంటూరుపల్లి గ్రామాల రైతులకు పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించారు.
మామునూర్ విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం టేకాఫ్
మామునూర్ విమానాశ్రయానికి మంజూరు చేస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ ఝా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈ ఏడాది మార్చి నెలలో లేఖ రాశారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) సమీపంలో కొత్త విమానాశ్రయ అభివృద్ధికి 150 కిలోమీటర్ల పరిమితిని ఎత్తివేసింది.దీంతో కేంద్ర ప్రభుత్వం మామునూర్ విమానాశ్రయం కార్యకలాపాల కోసం ఆమోదించింది.మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు జీఎంఆర్ సంస్థ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ మామునూర్ విమానాశ్రయం అభివృద్ధికి టేకాఫ్ చెప్పింది.

1981లో మామునూరు మూసివేత
1930వ సంవత్సరంలోనే బ్రిటిష్ వారు మొదట నిర్మించిన ఈ విమానాశ్రయం ఒకప్పుడు ముఖ్యమైన విమానయాన కేంద్రంగా ఉండేది.అప్పటి హైదరాబాద్ నగరానికి చెందిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మామునూర్ విమానాశ్రయాన్ని వినియోగించేవారు. ఈ వాత విమానాశ్రయం నాడు వ్యాపారవేత్తలు, సందర్శకుల విమాన ప్రయాణానికి అనువుగా ఉండేది. నాడు నిజాం సైన్యం కూడా ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకుంది. రవాణ, ప్రయాణికుల అవసరాలు తగ్గడంతో మూమునూర్ పాత విమానాశ్రయంలో 1981వ సంవత్సరంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. 2020వ సంవత్సరంలో పాత విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని యోచించినా , అది ఆచరణ రూపం దాల్చలేదు.
రన్ వే విస్తరణ పనులు
మామునూర్ విమానాశ్రయ రన్ వే విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 6.6 కిలోమీటర్ల నుంచి 10.6 కిలోమీటర్ల దూరానికి రన్ వేను పొడిగించనున్నారు. రన్ వే విస్తరిస్తే ఎయిర్ బస్ 320, బోయింగ్ 737 విమానాలను ల్యాండ్ చేయవచ్చని ఏవియేషన్ నిపుణుడు నోముల శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.మామునూర్ విమానాశ్రయ రన్ వే విస్తరిస్తే ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ప్రయాణించడం సులభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయంలో అధునాతన భ ద్రత వ్యవస్థ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఔటర్ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారని ఆయన వివరించారు. వరంగల్ విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయితే దేశంలోని అన్నీ ప్రాంతాలతో అనుసంధానం కానుందని శ్రీనివాస్ చెప్పారు.
రూపురేఖలు మారనున్న వరంగల్
విమానాశ్రయం నిర్మాణం వల్ల వరంగల్ నగరం రూపురేఖలు మారనుంది. వరంగల్ నగరంలో హాస్పిటాలిటీ, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందనున్నాయి. దీనివల్ల స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.వరంగల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. విమానాశ్రయం రాకతో భూమి, గృహాలకు డిమాండ్ పెరుగుతుందని రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. విమానాశ్రయం నిర్మాణం వల్ల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం వల్ల తెలంగాణలోనే వరంగల్ కీలక నగరంగా రూపుదిద్దుకుంటుందని ఆయన వివరించారు.
చిరకాల కల నెరవేరనుంది : ఎంపీ కడియం కావ్య
కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ కోసం రూ.205 కోట్లను విడుదల చేయడం ద్వారా వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కలను నెరవేరుస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుంచి విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్రం అవసరమైన అనుమతులను పొందిందని చెప్పారు. విమానాశ్రయ పునరుద్ధరణను వేగవంతం చేసి, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ త్వరగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.