కేసుల్లోనూ పోటీ పడుతున్న చంద్రబాబు, జగన్‌
x

కేసుల్లోనూ పోటీ పడుతున్న చంద్రబాబు, జగన్‌

మరో సారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న ప్రస్తుత సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు పోలీసు కేసుల్లో కూడా పోటీ పడుతున్నారు.



ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడులు పోలీసు కేసుల్లో పోటీ పడుతున్నారు. మరో సారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఇద్దరు నేతల మీద పెద్ద సంఖ్యలోనే పోలీసు కేసులు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీదే ఎక్కువ సంఖ్యలో కేసులు ఉన్నాయి. చంద్రబాబుపైన 24 కేసులు ఉండగా వైఎస్‌ జగన్‌ మీద 26 కేసులు ఉన్నాయి. అంటే చంద్రబాబు కంటే జగన్‌పైనే రెండు కేసులు అధికంగా ఉండటం గమనార్హం. ఇరువురిపై ఉన్న కేసుల అంశం 2024 ఎన్నికల్లో రాజకీయ వర్గాల్లో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఎవరి మీద ఎన్ని కేసులున్నాయనే దానిపైనే చర్చించుకుంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే జగన్‌పై కేసులు నమోదు
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన గతంలోనే పలు కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 11 సీబీఐ కేసులు ఉండగా, మరో 9 ఎన్‌ఫోర్స్‌మంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కేసులు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో జగన్‌పై 6 కేసులు ఉన్నాయి. కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టడం, అనుచిత ప్రవర్తన, పరువు నష్టం కలిగించడం వంటి పలు అభియోగాలతో జగన్‌పై కేసులు నమోదు చేశారు. ఇలా మొత్తం 26 కేసుల్లో సీఎం జగన్‌ నిందితుడిగా ఉన్నారు.
జగన్‌పై సీబీఐ కేసులు ఇవే
హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌ ఫార్మా కంపెనీల కేసు, జగతి పెట్టుబడుల కేసు, రాంకీ ఫార్మా కేసు, వాన్‌పిక్‌ ప్రాజెక్టు కేసు, దాల్మియా సిమెంట్‌ కేసు, ఇండియా సిమెంట్‌ కేసు, రఘురాం, భారతీ సిమెంట్‌ కేసు, పెన్నా సిమెంటు కేసు, ఇందూ టెక్‌జోన్‌ కేసు, లేపాక్షి, నాలెడ్జ్‌ హబ్‌ కేసు, ఇందూ గృహనిర్మాణ మండలి సంయుక్త భాగస్వామ్య కేసులు వంటి సీబీఐ కేసులు ఉన్నాయి.
జగన్‌పై ఈడీ కేసుల జాబితా
జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడుల కేసు, రాంకీ పెట్టుబడుల కేసు, ఇండియా సిమెంట్స్‌ పెట్టుబడుల కేసు, ఇందూ టెక్‌జోన్‌ పెట్టుబడుల కేసు, పెన్నా గ్రూపు పెట్టుబడుల కేసు, హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీ పెట్టుబడుల కేసు వంటి ఈడీ కేసులు ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం, మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టం(ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌(పీఎంఎల్‌ఏ) కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటుగా మోసం, నేరపూరిత కుట్ర వంటి పలు అభియోగాలతో కేసులు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన కేసులు. సీబీఐ, ఈడీ కేసులన్నీ హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్‌ కోర్టులో విచారణలో ఉన్నాయి.
చంద్రబాబుపై 24 కేసులు
ఇక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపైన 24 కేసులు ఉన్నాయి. 2019 కంటే ముందు ఆయనపై రెండు కేసులు ఉండగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 22 కేసులు చంద్రబాబుపైన నమోదు చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో రెండు కేసులు నమోదయ్యాయి. మంగళగిరి సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో దాదాపు 8 కేసులు ఉన్నాయి. నాటి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ధర్మాబాద్‌ పోలీసులు 2010లో కేసు నమోదు చేశారు. తర్వాత ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలు ఉల్లంఘించారని 2012లో మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులు 2019కి ముందున్న పాత కేసులు.
గత ఐదేళ్లల్లో చంద్రబాబుపై 22 కేసులు
దాదాపు 22 కేసులు గత ఐదేళ్లలో చంద్రబాబుపై నమోదయ్యాయి. 2020లో ఐదు, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు చంద్రబాబుపై నమోదు చేశారు. అన్నమయ్య జిల్లాలో రెండు, తూర్పు గోదావరి జిల్లాలో రెండు, ఎన్టీఆర్‌ జిల్లాలో రెండు చొప్పున కేసులు నమోదు చేశారు. అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, నంద్యాల జిల్లాల్లో కేసులు నమోదు చేశారు. మహారాష్ట్రలో కూడా ఒక కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కురబలకోట మండలం అంగళ్లులో టీడీపీ శ్రేణులను రెచ్చ గొట్టారని కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో విజయసాయిరెడ్డి వాహనంపై టీడీపీ శ్రేణులు దాడికి, హత్యాయత్నానికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. ఏపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్, అసైన్డ్‌ భూములు, అధికార దుర్వినియోగం తదితర అంశాలపై చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేసింది. సీఆర్‌డిఏ, రాజధాని, ఇన్నర్‌ రింగు రోడ్డు మాస్టర్‌ ప్లాన్‌ అంశంలో తీసుకున్న నిర్ణయాల్లో చంద్రబాబు అవకతవలకు పాల్పడటంతో పాటు కొందరికి లబ్ధి చేకూర్చారని కేసులు నమోదు చేశారు. అందకు ముందు కోవిడ్‌ సమయంలో కూడా చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు. కోవిడ్‌ రెండో దశలో 440కే వేరియంట్‌ గురించి ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడి ప్రజలను భయాందోళనలకు గురి చేశారనే దానిపై గుంటూరు సిటీ అరండాల్‌పేటతో పాటు పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్టేషన్, కర్నూలులో ఒకటో పట్టణ పోలీస్టేషన్‌లలో చంద్రబాబుపై కేసులు పెట్టారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ల గురించి మాట్లాడినందుకు కూడా ఆయనపై కేసు నమోదు చేశారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉంచడంలో ఉంచడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాట్లాడినందుకు చంద్రబాబుపై విజయవాడ సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇటీవల దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలో జగన్, చంద్రబాబులు కేసుల వివరాలు వెల్లడించారు.
Read More
Next Story