హైదరాబాద్ మేయర్‌పై కేసు.. డీజేలే కారణం..
x

హైదరాబాద్ మేయర్‌పై కేసు.. డీజేలే కారణం..

బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ అంతటా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో హైదరాబాద్ మేయర్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. తాజాగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.


బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ అంతటా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కీలక నేతలు, అధికారులు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా పాల్గొన్నారు. కాగా తాజాగా ఆమెపై హైదరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అందుకు ఈ వేడుకల్లో వినియోగించిన డీజేనే కారణం. అనుమతించిన టైమ్ ముగిసినప్పటికీ డీజే ఆపకుండా కొనసాగించారు అక్కడి కార్యక్రమ నిర్వాహకులు. శబ్ధ కాలుష్యం గురించి పట్టించుకోకుండా నిబంధనలను ఉల్లంఘించిన వారి తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకులతో పాటు, డీజే నిర్వాహకులు, మేయర్ విజయలక్ష్మీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతించిన సమయంకన్నా ఎక్కువసేపు డీజే పెట్టడమే కాకుండా.. అనుమతించిన దానికన్నా ఎక్కువ డెసిబిల్స్‌లో మ్యూజిక్ పెట్టారన్న ఆరోపణలకు సంబంధించి మేయర్ విజయలక్ష్మీపై కేసు నమోదు చేశారు పోలీసులు.

పోలీసులను ప్రశ్నించిన మేయర్

అక్టోబర్ 10న బంజారాహిల్స్‌లో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రోడ్ నెంబర్ 12లో నిర్వహించిన ఈ వేడుకల్లో డీజే దంచికొట్టారు నిర్వాహకులు. రాత్రి 11:45 గంటల సమయమైనా డీజే ఆగకపోవడంతో పోలీసులు అక్కడకు చేరకుని.. కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. డీజే ఆపేయాలని అన్నారు. దీంతో మహిళలు బతుకమ్మ ఆడుతుంటే కార్యక్రమాన్ని ఎలా ఆపుతారంటూ మేయర్ విజయలక్ష్మీ.. పోలీసులను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పలు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా డీజే నిర్వాహకులు, కార్యక్రమ నిర్వాహకులు సహా మేయర్‌పై కూడా కేసు నమోదు చేశారు. డీజే వినియోగం వల్ల తీవ్ర శబ్ధ కాలుష్యం జరుగుతుందని, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల డీజే వినియోగంపై సీపీ సీవీ ఆనంద్ కీలక సమావేశం కూడా నిర్వహించారు. ఆ తర్వాత డీజే, బాణాసంచాపై నివేధం విధిస్తున్నట్లు సీవీ ఆనంద్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

ఉత్తర్వుల్లో ఏముందంటే..

ఊరేగింపుల సందర్భంగా వేలాదిమంది ప్రజల మధ్య పెద్ద సంఖ్యలో బాణసంచాను కాలుష్తున్నారు. దీనివల్ల ఊరేగింపులు మంటలు అంటుకొని పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు.గత నెల 19వతేదీన మిలాద్ ఉన్ నబీ పండుగ ఊరేగింపు సందర్భంగా బాణసంచాను కాల్చడం వల్ల ఆ నిప్పు రవ్వలు డీజే సిస్టం జనరేటరుపై పడి మంటలు అంటుకున్నాయి. రూమర్ల ప్రచారం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు కూడా ఏర్పడే పరిస్థితి ఏర్పడితే పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి అసలు వాస్తవాన్ని చెప్పారు.ఊరేగింపుల్లో మాత్రం బాణసంచా కాల్చవద్దని పోలీసు కమిసనర్ నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో పెచ్చు పెరిగిన శబ్ధకాలుష్యం నేపథ్యంలో గత నెల 26వతేదీన పోలీసు అధికారులు అన్ని మతాల ప్రతినిధులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.ఊరేగింపుల్లో డీజేల వినియోగం, బాణసంచా కాల్చడంపై ఆంక్షలు విధించాలని సమావేశంలో నిర్ణయించారు.డీజేలు,ఊరేగింపుల్లో బాణసంచాను కాల్చవద్దని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

హైదరాబాద్ సిటీ పోలీసు యాక్ట్ సెక్షన్ 21,22, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 సెక్షన్ 163 ప్రకారం హైదరాబాద్ నగరంలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్, డీజే సౌండ్ మిక్సర్స్ , సౌండ్ యాంప్లిఫైర్స్, హైసౌండ్ వెలువరించే పరికరాలను వాడవద్దని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో శబ్ధకాలుష్యం నివారణకు అప్పటి పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంటు 172 నంబరుతో జీఓ జారీ చేసింది. అదే విధంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు, డీజే సిస్టమ్ వినియోగించరాదు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోర్టులు ఉన్న ప్రాంతాలను సుప్రీంకోర్టు సైలెన్స్ జోన్ గా నిర్ణయించింది. ఈ సైలెన్స్ జోన్లలోని ఆసుపత్రులు, కోర్టులు, విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి సౌండ్ పెట్టరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు పేర్కొంటున్నాయి.

డీజే నిబంధనలు ఇలా..

అయితే గతంలో కూడా డీజేలపై దృష్టి సారించిన ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. వాటి ప్రకారం నివాసం ప్రాంతాల్లో డీజే పెట్టేటప్పుడు వాటి శబ్దం ఉదయం 55 డెసిబిల్స్, రాత్రి 45 డెసిబిల్స్‌కు మించరాదు. అదే విధంగా కమర్షిల్ ప్రాంతాల్లో అయితే ఉదయం 65 డెసిబిల్స్, రాత్రి 55 డెసిబిల్స్‌ను దాటకూడదు. పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా పగలు 75 డెసిబిల్స్, రాత్రి 70 డెసిబిల్స్‌గానే ఉండాలన్న నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. ఇక స్కూళ్లు, ఆసుపత్రులు, కాలేజీలు ఉన్న ప్రాంతాలైతే సైలెంట్ జోన్స్‌గా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో అసలు డీజే పెట్టనే పెట్టకూడదు.

Read More
Next Story