నేడు బస్ ప్రమాద మృత దేహాలు అప్పగింత
x

నేడు బస్ ప్రమాద మృత దేహాలు అప్పగింత

మార్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైన 14 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు.


మార్కాపురం జిల్లా మేకలవానిపల్లె పలకల క్వారీల వద్ద శివారులో టిప్పర్ లారీ, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో సజీవ దహనమైన 14 మంది ప్రయాణికులను గుర్తించారు. మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో వాటిని మొదట గుర్తించడం కష్టమైంది. దీనితో మృతుల తోబుట్టువుల నుంచి రక్త నమూనాలు సేకరించి గుంటూరు రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.

శుక్రవారం రాత్రి డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా 14 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులతో అనుసంధానం చేసి గుర్తించారు. శనివారం ఉదయం నుంచి మృతుల తోబుట్టువులకు మృతదేహాలను అప్పగించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్సుల ద్వారా తగిన ఎస్కార్ట్‌తో వారి స్వస్థలాలకు తరలించనున్నారు. ఈ మృతదేహాలు కందుకూరు, కనిగిరి, ఒంగోలు, నెల్లూరు జిల్లా బుచ్చి వరకు తరలిస్తారు.

ప్రమాదంలో గాయపడిన 20 మంది వ్యక్తులు ఒంగోలు, మార్కాపురం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరికి శస్త్రచికిత్స చేయగా, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి, డీఎన్ఏ పరీక్షల నిర్వహణలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని, సమష్టి కృషి వల్ల ఫలితాలు త్వరగా వెలువడ్డాయని పేర్కొన్నారు.

“మృతుల కుటుంబాలకు ఈ కష్టకరమైన సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుంది. వారి ఆఖరి కర్తవ్యాలను మర్యాద పూర్వకంగా నిర్వర్తించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.” అని తెలిపారు.

Read More
Next Story