Turmeric Board | పసుపుబోర్డు ఏర్పాటు సరే, మా సమస్యలు తీరేదెన్నడు?
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటైన నేపథ్యంలో తమ దీర్ఘకాల డిమాండ్లు తీర్చాలని పసుపు రైతులు కోరుతున్నారు.మద్ధతు ధర ప్రకటించాలని పసుపురైతులు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ పసుపు రైతుల సుదీర్ఘ పోరాటాల తర్వాత ఎట్టకేలకు పసుపు బోర్డు అయితే ఏర్పాటు అయింది. పసుపు రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ నగరంలోని స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలోనే జాతీయ పసుపు బోర్డు అంటూ సైన్ బోర్డు వేలాడదీసి ఆఘమేఘాల మీద ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించారు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైన నేపథ్యంలో పసుపు రైతులు తమ దశాబ్దాల నాటి సమస్యలు తీరుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.పసుపుబోర్డు ఏర్పాటు సరే, మా దీర్ఘకాల సమస్యలను తీర్చే దెన్నడని పసుపు రైతులు ప్రశ్నిస్తున్నారు.
- నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కార్యాలయం కోసం ప్రత్యేకంగా భవనం నిర్మించి, ఉద్యోగులు, అధికారులను నియమించాలని పసుపు రైతులు కోరుతున్నారు. పసుపు బోర్డుకు కావాల్సిన బడ్జెట్ ను వెంటనే కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేయాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు.
పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి : పసుపు రైతుల ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి
తాము పండించిన పసుపునకు గిట్టుబాటు అయ్యే మద్ధతు ధర ప్రకటించాలని పసుపు రైతుల ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. పసుపురైతుల ఐక్యవేదిక పక్షాన పసుపు బోర్డు కోసం పోరాడిన పన్నాల తిరుపతి రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడారు. పసుపు క్వింటాలు ధర తరచూ మారుతుంటుందని, అలా కాకుండా మద్ధతు ధరను ప్రకటించాలని తిరుపతి రెడ్డి కోరారు. పసుపు ధరను స్థిరీకరించేలా మద్ధతు ధర ప్రకటించి ఆదుకోవాలని కేంద్రానికి సూచించారు.
మా ఉద్యమాల ఫలితమే పసుపు బోర్డు వచ్చింది...
తాము పండించిన పసుపునకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ కొన్నేళ్లుగా పోరాడామని, ఇన్నేళ్లకు తమ కల ఫలించి బోర్డు నిజామాబాద్ కువచ్చిందని పన్నాల తిరుపతిరెడ్డి చెప్పారు. 2019 పార్లమెంట్ఎన్నికల్లో తనతో పాటు 178 మంది పసుపు రైతులు పోటీ చేశామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే తాము ఆ నాడు ఉద్యమం చేశామన్నారు.
కొత్త వంగడాలు రావాలి
పసుపులో తమ తాత ముత్తాతల కాలం నాటి నుంచి ఆర్మూరు, ఎర్ర గుంటూరు, తెల్ల గుంటూరు రకాల పసుపు వంగడాలు పండిస్తున్నామని తిరుపతి రెడ్డి చెప్పారు. అధిక దిగుబడినిచ్చే కొత్త పసుపు వంగడాలను శాస్త్రవేత్తలు పరిశోధించి విడుదల చేయాలని ఆయన కోరారు.జాతీయ పసుపు బోర్డు వ్యవసాయ శాస్త్రవేత్తలను నియమించి మేలైన నూతన పసుపు వంగడాలను అందుబాటులోకి తీసుకు రావాలని కోరుతున్నారు. పసుపులో కొత్త వెరైటీలు అందుబాటులోకి వస్తే దిగుబడి పెరిగితే రైతులకు మేలు జరుగుతుందన్నారు.
పసుపు సాగులో యాంత్రీకరణ కావాలి
పసుపు సాగులో యాంత్రీకరణ కావాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. గతంలో కడాయిల్లో పసుపును ఉడకబెట్టేవారమని, కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన బాయిలర్లను సబ్సిడీపై రైతులకు ఎక్కువగా అందించాలని సూచించారు. పసుపునకు గిట్టుబాటు ధర లభించకుంటే దాన్ని కోల్డ్ స్టోరేజీలు, గోదాముల్లో నిల్వ చేసేందుకు వీలుగా వాటిని నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
పసుపు బోర్డుపై పాలిటిక్స్ వద్దు : రైతు సంఘం నేత చెన్నమనేని శ్రీనివాసరావు
పసుపు బోర్డు కోసం పసుపురైతులే ఐక్యవేదికగా ఏర్పడి ఉద్యమం చేశారని, తమ రైతుల పోరాట ఫలితంగానే పసుపు బోర్డు నిజామాబాద్ కు వచ్చిందని రైతు సంఘం నాయకుడు చెన్నమనేని శ్రీనివాసరావు చెప్పారు. పసుపు బోర్డు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు తామంటే తామే సాధించామని చెప్పి పసుపు బోర్డును రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. పసుపు రైతుల సంక్షేమానికి, గిట్టుబాటు ధర అందించేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story