బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న భాయ్: వై+ క్యాటగరీ భద్రతకై విన్నపం
x

బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న భాయ్: వై+ క్యాటగరీ భద్రతకై విన్నపం

ఇప్పటికే ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీకి తోడుగా, ప్రభుత్వంనుంచి వై క్యాటగరీ భద్రత తీసుకున్నాడు. దుబాయ్ నుంచి ప్రత్యేకంగా రు. 2 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేశాడు.


టైగర్ భయంతో గజగజా వణుకుతోంది. అవును నిజమే. వెండితెరపై టైగర్‌(ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, టైగర్ 3 సినిమాలలో హీరోగా నటించారు) పాత్రలో గర్జించే సల్మాన్, సినిమా ఫంక్షన్‌లలో బోర విరుచుకుని నడిచే సల్మాన్ భయంతో వణికిపోతున్నాడు. ఇప్పటికే ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీకి తోడుగా, ప్రభుత్వంనుంచి వై క్యాటగరీ భద్రత తీసుకున్నాడు. దుబాయ్ నుంచి ప్రత్యేకంగా రు. 2 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేశాడు. అసలు ఈయన ప్రాణాలకు అంత ముప్పు ఉందా అనేది పరిశీలిద్దాం.

సల్మాన్ నేర చరిత్ర

సల్లూ భాయ్ నేర చరిత్ర చిన్నదేమీ కాదు. 2002లో ముంబాయి నగరంలో మందుకొట్టి కారు నడిపి ఫుట్ పాత్‌పైకి పోనిచ్చి ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలకు కారణమయ్యారు. ఆ సమయానికి అతనికి డ్రైవింగ్ లైసెన్సే లేదు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ప్రత్యక్ష సాక్షి అయిన ఒక కానిస్టేబుల్ సల్మాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకుగానూ ఎన్నో బాధలుపడి చివరికి చనిపోయాడు. తగిన సాక్ష్యాలు లేవనే కారణంతో 2015లో కేసును కొట్టివేశారు.

ఐశ్వర్య, వివేక్ ఒబెరాయ్‌లకు వేధింపులు

అప్పట్లో ప్రియురాలు ఐశ్వర్యా రాయ్‌కు, ఇతనికి మధ్య గొడవలపై పత్రికలలో ప్రముఖంగా వార్తలు వచ్చేవి. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని ఐశ్వర్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. మరోవైపు తనతో బ్రేకప్ తర్వాత వివేక్ ఒబెరాయ్‌తో ఎఫైర్‌లో ఉన్నందుకుగానూ అతనికి ఫోన్ చేసి బెదిరించాడని వార్తలు వచ్చాయి. వివేక్ ఒబెరాయ్ ఆ ఫోన్ కాల్ రికార్డింగ్‌ను పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు ఇచ్చారు.

కృష్ణ జింకల వేట

1998లో హమ్ సాథ్ సాథ్ హై అనే సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్ళిన సల్మాన్, కొందరు హీరోయిన్లను తీసుకుని జోధ్‌పూర్ సమీపంలో అడవుల్లో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక కృష్ణ జింకను చంపాడని ఆరోపణ. ఆ కృష్ణ జింక అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలోని వేటాడకూడని జంతువు. మరోవైపు అక్కడ ఉన్న బిష్ణోయ్ అనే తెగవారు ఆ జింకను పవిత్రంగా పరిగణిస్తారు. ఈ కారణంతోనే లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌పై పగబట్టి హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ జంతువును చంపిన కేసులో సల్మాన్ 2007లో జోధ్‌పూర్ జైలులో ఒక వారం గడిపాడు. తర్వాత బెయిలుపై బయటకు వచ్చాడు. ఈ కేసులో, అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలోని జంతువును చంపటం అనే ఆరోపణే కాకుండా, లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిపోయిన ఆయుధాలను వాడాడనే ఆరోపణ కూడా ఉంది. 2006లో రాజస్థాన్ స్థానిక కోర్ట్ సల్లూకు ఒక ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే ఇచ్చింది. 2016లో రాజస్థాన్ హైకోర్ట్ ఈ కేసులో సల్మాన్ నిర్దోషి అని తీర్పు ఇచ్చింది.

వివాదాస్పద వ్యాఖ్యలు

2008 నవంబర్‌లో ముంబాయిలో తాజ్ హోటల్‌పై తీవ్రవాదుల దాడి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఫైవ్ స్టార్ హోటల్‌పై దాడి జరిగింది కాబట్టి మాట్లాడుతున్నారని, గతంలో సామాన్యులు చనిపోయిన తీవ్రవాద దాడుల గురించి ఇంతగా ఎందుకు మాట్లాడలేదని అన్నారు. ఈ దాడికి పాకిస్తాన్‌ను నిందించకూడదని, భారత భద్రతా వైఫల్యమని వ్యాఖ్యానించారు.

1993 బాంబే పేలుళ్ళ కేసులో నిందితుడు యాకూబ్ మెమన్‌కు 2015లో ఉరిశిక్ష అమలు చేసే సమయంలో, అతనికి అనుకూలంగా కొన్ని ట్వీట్‌లు చేసి, తర్వాత తొలగించటం కూడా వివాదాస్పదమయింది.

2020లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు, గతంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన జియా ఖాన్ యొక్క తల్లి రబియా సల్మాన్‌పై కొన్ని ఆరోపణలు చేశారు. నటుడు సూరజ్ పంచోలికి అనుకూలంగా తన కుమార్తె జియా ఖాన్ ఆత్మ హత్యకేసును తారుమారు చేయాలని సల్మాన్ ప్రయత్నించాడని ఆరోపించారు.

బెదిరింపు హెచ్చరికలు

సల్మాన్ ఖాన్‌కు లేపేస్తామంటూ హెచ్చరికలు చాలా రోజులనుంచి, 2018 నుంచి వస్తున్నాయి. 2022నుంచి అవి తీవ్రతరమయ్యాయి. పంజాబ్‌లో సింగర్ మూసేవాలను హత్య చేసిన బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్‌కు ఒక బెదిరింపు లేఖ ఇచ్చారు. అతనిని, అతని కొడుకు సల్మాన్‌నూ లేపేస్తామని ఆ లేఖలో ఉంది. అదే సంవత్సరం పంజాబ్ పోలీస్ ప్రధాన కార్యాలయంవద్ద ఒక గ్రెనేడ్ పేల్చిన ఘటనకు సంబంధించి అరెస్ట్ చేసిన నిందితులలో ఒకరు బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడని, అతనికి సల్మాన్ ఖాన్ హత్య బాధ్యతను కూడా ఇచ్చారని బయటపడింది.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటివద్ద గుర్తు తెలియని ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఇది జరిపించింది లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అనుమోల్ బిష్ణోయ్ అని, ఆ కాల్పులు కేవలం ట్రైలర్ మాత్రమే అని అతను అన్నాడని తర్వాత తెలిసింది.

సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి పోలీసులు పట్టుకున్న నిందితులలో ఒకరైన అనూజ్ ఈ ఏడాది మే నెలలో లాకప్ డెత్‌లో చనిపోయాడు. అతని హత్యకు కూడా ప్రతీకారం తీర్చుకుంటామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.

తాజాగా ఈ నెల 12న మాజీ మంత్రి, ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్దిని కాల్పులతో హతమార్చిన తర్వాత, బిష్ణోయ్ గ్యాంగ్ అది తమ పనేనని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ, సల్మాన్‌కు సాయం చేసినవారికి, సల్మాన్‌కు కూడా త్వరలో ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

అత్యున్నత స్థాయి భద్రత

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అతని నివాసానికి వెళ్ళి పరామర్శించటమే కాకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా బాబా సిద్దికి హత్య తర్వాత అతనికి వై+ క్యాటగరీ భద్రత ఇవ్వటానికి అంగీకరించారు. దీనిలో భాగంగా పదకొండు మంది సిబ్బందిని సమకూరుస్తారు. వీరిలో ఆరుగురు కమాండోలు సల్మాన్ వెంటే ఉంటారు, నలుగురు పోలీసులు సల్మాన్ ఇంటివద్ద గస్తీ కాస్తారు. ఒకరు సల్మాన్ బయటకు వెళ్ళినప్పుడు భద్రతా సిబ్బందితో కూడిన వాహనాన్ని నడుపుతుంటారు. షారుక్ ఖాన్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, కంగనా రనౌట్, ముకేష్ అంబానీలకు కూడా ప్రభుత్వం భద్రత సమకూరుస్తోంది.

అయితే ఈ భద్రత అంతా ఉచితం కాదు. వై+ క్యాటగరీ భద్రతను తీసుకునేవారు ప్రభుత్వానికి నెలకు రు.12 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే జడ్ ప్లస్ క్యాటగరీ భద్రతకైతే నెలకు రు.33 లక్షలు చెల్లించాలి. ముకేష్ అంబానీ ప్రస్తుతం జడ్ ప్లస్ క్యాటగరీ భద్రత తీసుకుంటున్నారు.

సల్మాన్ ప్రైవేట్ సెక్యూరిటీ

సల్మాన్ ఖాన్ వద్ద 25 ఏళ్ళుగా ఒక బాడీగార్డ్ షేరా(గుర్మీత్ సింగ్ జాలీ) పని చేస్తున్నాడు. ఇతనికి జీతం ఏడాదికి రు.2 కోట్లు(నెలకు సుమారు 16 లక్షలు). ఇది కాకుండా సల్మాన్ ఇతనికి రు.1.4 కోట్లతో రేంజ్ రోవర్ కొని ఇచ్చాడు. షేరాకు టైగర్ అనే సెక్యూరిటీ సేవలు అందించే సంస్థ ఉంది. ఇతను 1987లో మిస్టర్ ముంబాయి జూనియర్ టైటిల్ గెలుచుకున్నాడు. 2017లో ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ముంబాయిలో ప్రదర్శన ఇచ్చనప్పుడు భద్రతా ఏర్పాట్లను షేరాయే చూశాడు. షేరాతో సహా సల్మాన్‌కు మొత్తం 50 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.

బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేసిన భాయ్

ప్రాణాలకు ప్రమాదం పెరిగిపోవటంతో సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేశారు. నిస్సాన్ పెట్రోల్ అనే మోడల్ ఇండియాలో అందుబాటులో లేకపోవటంతో దుబాయ్‌లో కొని, దిగుమతి చేసుకుంటున్నారు. దీని అసలు ధర రు. 2 కోట్లు కాగా, ఇక్కడకు దిగుమతి చేసుకునేటప్పటికి సుంకాలతో కలిపి ధర మరింత పెరగనుంది. దీనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అనేక ఫీచర్లు ఉన్నాయి. అతి దగ్గరనుంచి కాల్పులు జరిపినా తట్టుకోగల గాజు, లోహాలతో ఇది తయారయింది.

బిగ్ బాస్ రియాలిటీ షోను గత 18 సంవత్సరాలుగా సల్మాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాబా సిద్దికి హత్య, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికల నేపథ్యంలో బిగ్ బాస్ షూటింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతోంది. షూటింగ్ బయట 60 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు బిగ్ బాస్ నిర్వాహకులు తెలిపారు. సెట్ లోకి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు. ఆధార్ కార్డులు ఉంటేనే లోపలకు అనుమతిస్తున్నారు.

క్షమాపణ చెబితే బిష్ణోయ్ తెగ వదిలేస్తుందా?

తమ జాతి పవిత్రంగా భావించే కృష్ణజింకను చంపినందుకుగానూ క్షమాపణ చెబితే వదిలేస్తానని లారెన్స్ బిష్ణోయ్ గతంలో ప్రకటించాడు. అయితే క్షమాపణ అంటే ఊరికే క్షమించమని అడగటం కాదు… దానికి పెద్ద తతంగం ఉంది. మొదట రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉన్న ముక్తి ధామ్ ముకమ్ అనే మందిరాన్ని సందర్శించాలి. ఆ మందిరంలోనే బిష్ణోయ్ తెగ పెద్ద గురు జంభేశ్వర్‌ను ఖననం చేశారు. సల్మాన్ ఖాన్ అక్కడికి వెళ్ళి నిజాయితీగా తాను చేసిన పనికి పశ్చాత్తాప పడుతూ, “బిష్ణోయ్ సమాజమా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి” అని అడగాలి. అంతటితో అయిపోలేదు. అప్పుడు బిష్ణోయ్ సమాజం ఆ క్షమాపణను అంగీకరించాలా, వద్దా అని ఆలోచిస్తుంది. ఈ బిష్ణోయ్ సమాజంలో ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలమంది ఉన్నారు. వారు దీనిపై నిర్ణయం తీసుకుంటారు.

అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. క్షమాపణ చెప్పాలంటే తాను నేరం చేసినట్లు అంగీకరించాలి. అలా అంగీకరిస్తే ఆ కేసును తిరగతోడినట్లవుతుంది, పోలీసులు తక్షణమే బొక్కలో తోస్తారు.

క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న సలీమ్ ఖాన్

బిష్ణోయ్ తెగకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం తమకు లేదని సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ తెగేసి చెప్పారు. అసలు తన కొడుకు ఏ జింకలనూ చంపలేదని అన్నారు. తన కొడుకుకు వస్తున్న బెదిరింపులు కేవలం డబ్బు కోసమేనని ఆరోపించారు. తాము కనీసం బొద్దింకను కూడా చంపబోమని చెప్పుకొచ్చారు. అతను జంతు ప్రేమికుడని చెప్పారు. అసలు సల్మాన్ చంపినట్లు ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు.

Read More
Next Story