ఎవరీ పిన్నెల్లి.. ఏమిటి ఆయన కథ..
x

ఎవరీ పిన్నెల్లి.. ఏమిటి ఆయన కథ..

పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఎవరు? ఎందుకు వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రమంతా ఆయన వైపు ఎందుకు చూస్తోంది. ఏమి జరిగింది?


ఆయనో ప్రజా ప్రతినిధి.. నాలుగు సార్లు ఎమ్మెల్యే..

20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారు. చట్టం ఏమిటో.. టెంపరితనం ఏమిటో తెలిసిన వారు.

ఐనా ఆయన సంయమనం కోల్పోయారు. చేయకూడని పనిచేసి చట్టానికి దొరక్కుండా ఉండటం కోసం నానా తంటాలు పడుతున్నారు.

ఒక్క క్షణం ఆయన తన విచక్షణను ఉపయోగించినా, లేదా తను చట్టాన్ని చేసే ఓ ప్రజాప్రతినిధినని గుర్తుకు తెచ్చుకున్నా ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టి ఉండేవారు కాదేమో..

ఆయనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ఘనుడు.

ఆయన పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్ల ప్రస్తుత ఎమ్మెల్యే. రాష్ట్ర అసెంబ్లీకి మే 13న జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి.

ఇంతకు ఆయన చేసిన తప్పేంటి? ఇప్పుడెందుకీ అగచాట్లు. ఒక్కసారి గతంలోకి తొంగిచూస్తే...

మే 13న రెంటచింతల మండలం పాల్వాయి రైల్వేగేట్‌ పోలింగ్‌ స్టేషన్‌. ఉన్నట్లుండి ఎమ్మెల్యే తన అనుచరులతో చకచకా లోపలికి వెళ్లారు. ఎమ్మెల్యే వచ్చారని వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది లేచి నిల్చున్నారు. వారు చూస్తుండగానే రెప్పపాటులో నేరుగా ఈవీఎం వద్దకు వెళ్లి చేతులతో ఈవిఎంను పట్టుకుని నేలకేసి కొట్టారు. దీంతో ఈవియం ముక్కలైంది. అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌ వెంటనే పైకి లేచి అడ్డుపడ్డాడు. ఎమ్మెల్యే అనుచరులు ఆయన్ను పక్కకు నెట్టారు. ఎమ్మెల్యే బయటకు వెళుతూ ఏజెంట్‌కు వేలుచూపించి బెదిరించారు. ఈ ఒక్క తప్పు ఇప్పుడు ఆయన్ను ముప్పు తిప్పలు పెడుతోంది.
ఇంతకు మునుపెన్నడూ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల చరిత్రలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోలేదు. ఎక్కడైనా అభ్యర్థుల అనుచరులు దాడులు చేసుకోవడం, పోలింగ్‌ బూత్‌ల్లో విధ్వసం సృష్టించడం వంటి సంఘటనలు జరిగాయి. నేరుగా ఎమ్మెల్యేనే ఈ విధంగా చేయడం దేశవ్యాప్తంగా సంచనలం రేకెత్తించింది. భారత ఎన్నికల కమిషన్‌ కూడా నివ్వెరపోయింది. ఒక్క రోజులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినా ఏపీ పోలీసులకు ఆయనను అరెస్ట్‌ చేయడం చేతకాలేదు.
రాజకీయాల్లోకి రాకముందు ఏమి చేసేవారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది వ్యవసాయ కుటుంబం. పెద్దగా స్థితిమంతులేమీ కాదు. మాచర్ల నియోకవర్గంలోని వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన వారు. 1970లో జన్మించారు. తండ్రిపేరు వెంకటేశ్వరెడ్డి. వీరు మొత్తం నలుగురు అన్నదమ్ములు. పెద్దాయన చనిపోగా రెండో వ్యక్తి పిన్నెల్లి లక్షా్మరెడ్డి, మూడో వ్యక్తి వెంకటేశ్వరెడ్డి, నాలుగో వ్యక్తి సుందరరామిరెడ్డి. నర్సరావుపేట, గుంటూరుల్లో విద్యాభ్యాసం జరిగింది. గుంటూరు ఏసీ కాలేజీలో చేరి బికాం డిస్‌కంటిన్యూ చేశారు. దుర్గి మండలం కోలగుట్ల గ్రామానికి చెందిన రమాదేవితో వివాహమైంది. కొడుకు పేరు వీరాంజనేయ గౌతమ్‌రెడ్డి. కుమార్తె సంయుక్తరెడ్డి. రామకృష్ణారెడ్డి చదువు ఆపేసిన తరువాత తన పెద్దనాన్న వద్దకు వచ్చాడు. లక్షా్మరెడ్డికి ఇద్దరు కుమారులు. ఒకరు మధుసూదన్‌రెడ్డి కాగా రెండో వాడు శ్రీనివాసరెడ్డి (వాసు) వాసుతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంచి స్నేహం ఉండేది. దాంతో పెద్దనాన్న వద్దనే ఉంటూ అన్నీ తానై ఇంట్లో పెద్దనాన్నకు రాజకీయాల్లో తోడుగా ఉంటూ వచ్చాడు. పిన్నెల్లి లక్ష్మారెడ్డి 2004లో కాంగ్రెస్‌–ఐ తరపున పోటీ చేసి గెలుపొందారు. లక్షా్మరెడ్డికి కూతురు కూడా ఉంది. అల్లుడి పేరు రామచంద్రారెడ్డి. మాచర్లలో చిన్నపిల్లల డాక్టర్‌. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాచర్ల నియోకవర్గం నుంచి పోటీ చేశారు. ఈయన ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు వైఎస్సార్‌సీపీ వారు కెపి గూడెంలో దాడి చేశారు. దీంతో దాడి చేసిన వైఎస్సార్‌సీపీ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎలా రాజకీయాల్లో ప్రవేశించారు
పెద్దనాన్నకు వయసు పైబడటంతో ఆయనతో తిరుగుతూ రాజకీయాలు చూసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. ముందుగా కాంగ్రెస్‌ పార్టీలో 1996లో చేరి గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షునిగా పనిచేశారు. 2004లో వెల్తుర్తి జెడ్పీటీసీగా గెలిచారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరపున మాచర్ల ఎమ్మెల్యే టిక్కెట్‌ సంపాదించాడు. ఆ ఎన్నికల్లో జూలకంటి బ్రహానందరెడ్డిపై గెలుపొందారు. అక్కడి నుంచి రాజకీయాల్లో జైత్ర యాత్ర కొనసాగించారు. వైఎస్సార్‌ మరణానంతరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తరువాత 2014, 2019 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో గెలిచిన తరువాత ప్రభుత్వ విప్‌గా జగన్‌ ప్రభుత్వం నియమించింది.
వివాదం ఏమిటి?
మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ వద్ద ఉన్న పోలింగ్‌ బూత్‌లోకి నేరుగా వెళ్లి ఈవీఎంలు నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఈ దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో ఆయనపై ఐపీసీలోని 143, 147, 448, 427, 353, 452, 120బితో పాటు ప్రజా ప్రాతినిద్య చట్టం, పిడి చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. ఎన్నిక రోజు నియోజవకర్గంలో అల్లర్లు చోటు చేసుకోగా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ఆయన పోలీసులకు తెలియకుండా బయటకు రావడంతో కారంపూడి మండలంలోని పలు చోట్ల వాహనాలను ఆయన అనుచరులు దగ్ధం చేశారు. ఊర్లల్లో దాడులు జరిగాయి. వందల మందికి గాయాలయ్యాయి. ఎన్నికల రోజు, తరువాత జరిగిన హింసలోనూ వందల కొద్ది ప్రజలు గాయాల పాలయ్యారు. ఇందుకు వైఎస్సార్‌సీపీతో పాటు తెలుగుదేశం పార్టీ వారు కూడా కారణమయ్యారు. ఈవీఎం ధ్వంసం చేసింది ఎమ్మెల్యేనేనని తెలుసుకునేలోపులో ఆయన పట్టణం వదిల వెళ్లిపోయారు. పోలీసులు పట్టకుని అరెస్ట్‌ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న పిన్నెల్లి ముందస్తు బెయిల్‌కు గురువారం హైకోర్టులో పిటీషన్‌ తన లాయర్ల ద్వారా దాఖలు చేశారు. పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు వచ్చేనెల 5వ తేదీ వరకు అరెస్ట్‌ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల్లో హింసపై హైకోర్టు న్యాయవాది, మానవ హక్కుల సంఘం నేత పిచ్చుక శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పాలంటే అక్కడ ఏమి జరుగుతుందోననే భయం వెంటాడేలా ఉందన్నారు. ఎన్నికల నిర్వహణ విధానం సరిగా లేదు. పోల్‌ పర్సెంటేజీ పెంచడం కోసం అనేక చర్యలు చేపట్టామని చెబుతున్నా, పోలింగ్‌ స్టేషన్‌ నిర్వాహకులకు ఉద్యోగులకు సరైన శిక్షణ కూడా ఇవ్వ లేదన్నారు. బ్యాలెట్‌ ఓటింగ్‌ వ్యవస్థ ఉన్నప్పుడు చాలా సంఘటనల్లో ఓట్లు చెల్లకుండా పోయాయని, ఇప్పుడు ఈవీఎంలు రావడం వల్ల ఓట్లు చెల్లకుండా చేసే అవకాశాలు తక్కువుగా ఉన్నందు వల్ల రీపోలింగ్‌ జరపడం లేదన్నారు. తప్పు జరిగిందని నిర్థారణ అయిన తర్వాత తప్పనిసరిగా ఆక్కడ రీపోలింగ్‌ పెట్టాలన్నారు. ఎన్నికల హింసపై సిట్‌ వేయడం అంటేనే పోలీసులు విఫలమయ్యారనే అర్థమన్నారు. సిస్టమ్‌ సరిగా లేనప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నారు. సరైన రిపోర్టులు సిబ్బంది నుంచి ఎన్నికల కమిషన్‌కు రాలేదు. వాలంటరీ వ్యవస్థ పెత్తనం చేసింది. రిపోర్టులు ఎందుకు సకాలంలో రాలేదు. రీపోలింగ్‌ ఎందుకు జరప లేదు. ఇప్పుడు కేసుల్లో బైండోవర్‌ చేస్తున్నారు. ముందస్తుగా ఎందుకు చేయలేదని అభిప్రాయపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన నిర్వాకం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు.
నేరచరిత్ర ఉందా..?
ఆయనకు నేర చరిత్ర ఉన్నా నేరుగా పలు నేరాలు చేసినట్లు ఇంతవరకు రుజువు కాలేదు. అయితే కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ కేసులు కోర్టుల్లో కొట్టివేశారు. అయితే హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వారికి వార్నింగ్‌ ఇచ్చిన కేసులో నిందితుడిగా ఉన్నారు. కండ్లకుంటలో టీడీపీ నాయకుడు అంజిరెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల్లో నుంచి కోర్టు విముక్తి చేసింది. తోట చంద్రయ్య అనే వ్యక్తిని హత్య చేసిన విషయంలో ఈయన ప్రమేయం ఉన్నందన్న ఆరోపణలు ఉన్నాయి. జంగమేశ్వరపురానికి చెందిన జల్లయ్య హత్య కేసులో పిన్నెల్లి ప్రేరణ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు తురకా కిశోర్‌ అనే వ్యక్తిని పిన్నెల్లి ఉసిగొలిపి టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిపైకి పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వారిని బెదిరించి నామినేషన్‌లు వేయకుండా తన మనుషులను ఏకగ్రీవం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. గురజాల డిఎస్‌పి నాగేశ్వరావును అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసినట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రింగ్‌రోడ్డు పక్కన ఒక సెటిల్‌మెంట్‌ చేసి 50 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నిమ్మగడ్డ వాసుబాబు అనే వ్యక్తిని బెదిరించి ఆయన పెట్రోల్‌ బంకును స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తన బార్‌లో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వెంచర్లు వేసుకునే వారికి అనుమతులు మునిసిపాలిటీ నుంచి రాకుండా అడ్డుకుని పర్సెంటేజీలు తీసుకునే వారని, అపార్ట్‌మెంట్స్‌ నిర్మాణాలు చేపట్టే వారికి అనుమతులు ఇవ్వాలంటే ఎమ్మెల్యేకు రెండు ప్లాట్లు ఇవ్వాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. ఇరిగేషన్‌ కాలనీలో కండ్లగుంటకు చెందిన పలువురు అనుచరులకు మూడు సెంట్ల వంతున ఇంటి ప్లాట్లు ఇప్పించాడని, గొడవలకు వారిని ఉపయోగించుకునే వారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈయన అనుచరులు ఎంతో మంది బైకులు దొంగతనాలు చేసి మద్దిమడుగు వద్ద అమ్ముకునే వారిని పోలీసుల నుంచి వదిలిపెట్టించి తనకు అనుచరులుగా మలుచుకునే వారనే ఆరోపణలు వచ్చాయి. జూలకంటి వారే ముందుగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వారిని అణగదొక్కి ముందుకు సాగుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గత రెండు సార్లు దూరంగా ఉండి, 2024 ఎన్నికల్లో జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగటంతో అల్లర్లు భారీ స్థాయిలో చోటు చేసుకున్నాయి.
అఫిడవిట్స్‌లో ఉన్న కేసుల వివరాలు
1. హత్యాయత్నానికి సంబంధించిన అభియోగాలు (ఐపిసి సెక్షన్‌ 307).
2. ప్రమాదకరమైన ఆయుదాలతో కావాలని గాయపరచడానికి సంబంధించిన ఆరోపణలు (ఐపిసి సెక్షన్‌ 324).
3. నమ్రత అనే మహిళను కించపరిచే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి, నేరం చేశారనే ఆరోపణలు (ఐపిసి సెక్షన్‌ 354).
4. చట్ట విరుద్దమైన నేరాలు, అభియోగాలు ఉన్నాయి.(ఐపిసి సెక్షన్‌ 149)
5. ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన ఆర్డర్‌ను ధిక్కరించిన నేరారోపణలు (ఐపీసీ సెక్షన్‌ 188)
6. అల్లర్లకు సంబంధించిన ఆరోపణలు(ఐపిసి సెక్షన్‌ 147)
7. మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడ్డారనే ఆరోపణలు(ఐపిసి సెక్షన్‌ 148)
8. అల్లర్లు సృష్టించి 50 రూపాయల నష్టం కలిగించారానే ఆరోపణలు(ఐపిసి సెక్షన్‌ 427)
9. అసెంబ్లీలో చట్ట విరుద్ధంగా సభ్యడుగా ఉన్నందుకు శిక్షకు సంబంధించిన ఆరోపణలు(ఐపిసి సెక్షన్‌ 143)
10. పలువురు వ్యక్తులు కలిసి ఉమ్మడిగా దురుద్దేశంతో చేసిన చర్యలకు సంబంధించిన ఆరోపణలు(ఐపిసి సెక్షన్‌ 34)
11. తప్పుడు నిర్బంధానికి సంబంధించిన ఆరోపణలు(ఐపిసి సెక్షన్‌ 341)
వీటితో దాదాపు మాచర్లలో 2, గురజాలలో 1, మాచవరం పీఎస్‌ పరిధిలో 1 కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
ఇక అఫిడవిట్‌లో లేని కేసులు లెక్క లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఆస్తుల విలువ ఎంత?
ఎన్నికల అఫిడవిట్‌లో ఇచ్చిన లెక్కల ప్రకారం రూ. 38,35,22,602 విలువ కలిగిన ఆస్తులు ఉన్నాయి. ఇక అప్పులు రూ. 20,74,94,108 ఉన్నట్లు తెలిపారు.
ఇవి కేవలం కాగితాల్లో కనిపించేవేనని, కాగితాలపై కనిపించని ఆస్తులు చాలా ఉన్నాయని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో సితార హోటల్, బెంగళూరులో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పాట్లు, పొలాలు ఉన్నట్లు సమాచారం. సుమారు రూ. 700 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయని ప్రత్యర్థులు అంచనా వేస్తున్నారు.
సీఎం జగనే ఆయన ధైర్యం..
నియోజకవర్గంలో ఏమి జరిగినా వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పోలీసుల సహకారంతో దానిని వెనువెంటనే పరిష్కరించుకోవడం పిన్నెల్లికి పరిపాటిగా మారినట్లు సమాచారం. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో స్థానిక అధికారులు కూడా పిన్నెల్లికి దాసోహం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. చాలా కంపెనీల్లో పెట్టుబడులు వేరే వాళ్ల పేర్లతో పెట్టారని, ఆ కంపెనీలకు సంబంధించిన వివరాలు బయటకు పొక్కడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎటువంటి సమస్య వచ్చినా రాజకీయంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి అండ వుండటంతో ఎవ్వరూ ఆయన జోలికి వచ్చేందుకు సాహసించే వారు కాదని స్థానికుల్లో చర్చ ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలోనే నన్ను సీబీఐ వారు అరెస్ట్‌ చేస్తారట అని సభలో ప్రకటించారు. రెండో రోజు సీబీసీ జగన్‌ను అరెస్ట్‌ చేసింది.
Read More
Next Story