హేమ కమిటీ రిపోర్ట్‌కు మూలకారణమైన సంచలన కేరళ ఘటన గురించి తెలుసా?
మళయాళ సినిమాలేమో హైక్లాస్‌గా ఉంటున్నాయి, కానీ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితులు మాత్రం లోక్లాస్‌గా ఉన్నాయని జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ బయటకు రావటంతో తేలిపోయింది.
ఐదు సంవత్సరాల క్రితం, 2019లో ప్రభుత్వానికి సమర్పించబడిన “జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్” ఇప్పుడు మళయాళ సినిమా ఇండస్ట్రీనే కాదు యావత్ భారతీయ సినిమా పరిశ్రమను షేక్ చేయటం కొద్దిగా విచిత్రంగానే ఉంది. అసలు ఆ కమిటీ రిపోర్ట్‌లో ఏముంది, దాని పుట్టు పూర్వోత్తరాలేమిటో పరిశీలిద్దాం.
మళయాళ సినిమాలు హైక్లాస్ - మళయాళ సినీ ఇండస్ట్రీ లోక్లాస్
మళయాళం సినిమాలకు ఇప్పుడు ఓటీటీలో చాలా పెద్ద మార్కెట్ ఉంది. దేశ విదేశాలలో ఆ సినిమాలను అభిమానించే ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది. ఆ వర్గంలో ఉండేదంతా బాగా చదువుకున్న ఉన్నత విద్యావంతులు, మేధావులు. ఆలోచనలను రేకెత్తించేవిధంగా, హృదయాలకు హత్తుకునే విధంగా, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా ఆ సినిమాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశంలోని మిగిలిన భాషల్లోని సినిమాలన్నీ మాస్ కోసం సినిమాలు తీస్తుంటే, మళయాళంలో సినిమాలు మాత్రం ఆలోచనాపరులకు, ఉన్నతవిద్యావంతులకు నచ్చేవిధంగా రూపొందుతుంటాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చే సినిమాలేమో హైక్లాస్‌గా ఉంటున్నాయి, కానీ ఆ ఇండస్ట్రీ మాత్రం చాలా లో క్లాస్‌గా ఉందని ఈ జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ బయటకు రావటంతో తేలింది.
కమిటీ ఏర్పాటుకు మూలకారణమైన కిడ్నాప్, రేప్ ఘటన
మళయాళం సినిమా పరిశ్రమలో ఆడవారిపై లైంగిక వేధింపులమీద విచారణకై 2017లో నాటి కేరళ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటుచేసి విచారణ జరపాలని ఆదేశించింది. అయితే అసలు ఆ కమిటీ ఏర్పాటుకు దారి తీసిన సంఘటన గురించి ముందు చెప్పుకోవాలి. 2017లో భావన మీనన్ అనే ఒక ప్రముఖ మళయాళ హీరోయిన్‌ను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి, రేప్ చేసి, ఆ మొత్తం తతంగాన్ని వీడియో తీశారు. భావనపై కక్ష పెట్టుకున్న దిలీప్ అనే ప్రముఖ మళయాళ హీరో ఈ పని చేసినట్లు ఆరోపణ.
దిలీప్ అప్పట్లో మమ్మూట్టి, మోహన్‌లాల్ తర్వాత మూడో స్థానంలో ఉండేవాడు. విలక్షణ సబ్జెక్టులతో, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చేటట్లుగా అతని సినిమాలలో కథలు ఉండటంతో అతనికి అప్పట్లో బాగా ప్రజాదరణ ఉండేది. దానితోపాటు డిస్ట్రిబ్యూషన్, ధియేటర్లు, సినిమాల నిర్మాణం వంటి రంగాలలో కూడా విజయవంతంగా వ్యాపారాలు చేస్తుండేవాడు. అతనికి, అతని అప్పటి భార్య మంజు వారియర్(ప్రముఖ హీరోయిన్)కు మధ్య అప్పటికే విభేదాలు ఉన్నాయి. వారికి ఒక అమ్మాయి కూడా ఉంది.
ఈ ఘటన జరగటానికి ముందు జరిగిన విషయం చెప్పుకోవాలి. మంజు వారియర్, అత్యాచారానికి గురైన భావన మంచి స్నేహితురాళ్ళు. దిలీప్ స్త్రీలోలత్వం గురించి తెలిసిన మంజు వారియర్, అతనిపై కన్నేసి ఉంచమని భావనకు చెప్పిఉంది. దిలీప్, భావన ఒకసారి షూటింగుకోసం అమెరికా వెళ్ళినప్పుడు ఆమెను తన రూమ్‌కు రమ్మని ఫోనులో మెసేజ్‌ల ద్వారా ఆహ్వనించాడు. ఆ చాట్ మొత్తాన్నీ భావన మంజు వారియర్‌కు పంపింది. అప్పటికే ఉంటుందా, ఊడుతుందా అన్నట్టుగా ఉన్న దిలీప్, మంజు పెళ్ళి పెటాకులయింది. 2016లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దిలీప్ 2017లో కావ్య మాధవన్ అనే మరో హీరోయిన్‌ను పెళ్ళి చేసుకున్నాడు. అయితే భావన తన కాపురాన్ని చెడగొట్టింది అనే కక్షను పెంచుకున్న దిలీప్ తమిళ సినీ పరిశ్రమకు చెందిన పల్సర్ సుని అనే స్టంట్ మ్యాన్‌కు ఈ కిడ్నాప్, రేప్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. 2017 ఫిబ్రవరి 17న పల్సర్ సుని, అతని బృందం కొచ్చి నగరంలో ఆమెను వ్యాన్‌లో కిడ్నాప్ చేసి, ఆ వ్యాన్‌లోనే అత్యాచారం చేసి, అదంతా వీడియో తీసి ఆ వీడియోను దిలీప్‌కు పంపారు. తర్వాత ఆమెను రోడ్డుపై వదిలేశారు.
ఈ నేరం మొదట బయటపడినప్పుడు తనకు ఏమీ తెలియదని దిలీప్ బుకాయించాడు. అయితే తర్వాత రుజువులు దొరకటంతో అరెస్ట్ అయ్యాడు, 85 రోజులు జైలులో గడిపాడు. ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నాడు. సినిమాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ వ్యవహారం బయటపడినప్పుడు మళయాళ సినిమా పరిశ్రమలోని దిగ్గజాలైన మమ్మూట్టి, మోహన్‌లాల్ బాధితురాలికి మద్దతుగా నిలబడకుండా, పరోక్షంగా దిలీప్‌కు మద్దతుగా నిలవటంతో వారిపై సోషల్ మీడియాలో, బయట అప్పట్లో తీవ్రంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. పెద్ద ఎత్తున ర్యాలీలు, ఊరేగింపులు జరిగాయి. మళయాళ సినిమా పరిశ్రమలోని కొందరు ఆడవాళ్ళు కలిసి “వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్” అనే వేదికను స్థాపించారు. మళయాళ సినిమా పరిశ్రమలో ఆడవారు ఎదుర్కొంటున్న సవాళ్ళపై దర్యాప్తు జరపాలని వారు ఒక పిటిషన్ దాఖలు చేశారు.
హేమ కమిటీ నివేదికలో ఏముంది?
వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ వారి పిటిషన్‌కు స్పందించి కేరళ ప్రభుత్వం 2017లో, మళయాళ సినిమా పరిశ్రమలో ఆడవారిపై లైంగిక వేధింపులమీద విచారణకోసం ముగ్గురు సభ్యులతో జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ హేమ అనే న్యాయమూర్తితోపాటు, తెలుగు-మళయాళ సినిమాల సీనియర్ నటి శారద, ఐఏఎస్ అధికారిణి కేబీ వలసల కుమారి ఆ కమిటీలో సభ్యులు. అనేకమంది నటీమణులు, మేకప్ కళాకారిణులు, కాస్ట్యూమ్ డిజైనర్‌లు, హెయిర్ స్టైలిస్టులు, దర్శకురాళ్ళు వంటి టెక్నీషియన్లతో మాట్లాడి, లైంగిక వేధింపులకు సంబంధించిన అనేక రుజువులు, ఫిర్యాదులు, వాట్సప్ మెసేజిలు తీసుకుని 2019 డిసెంబర్ 31న ఈ కమిటీ 295 పేజీల తమ నివేదికను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సమర్పించింది.
అయితే ఐదు సంవత్సరాలనుంచి మరుగున పడి ఉన్న హేమ కమిటీ నివేదిక ఒక ఆర్‌టీఐ దరఖాస్తు పుణ్యమా అని గత నెల 19న బయటకు వచ్చింది. అది కూడా హైకోర్ట్ జోక్యం చేసుకుని ఆ నివేదికను బహిర్గతం చేయాలని ఆదేశాలు ఇవ్వటంవలన. ఆ నివేదికలో దిగ్భ్రాంతి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశ్రమలో ఆడవారిని అవకాశాలకోసం లోబరుచుకోవటం, కాస్టింగ్ కౌచ్ వంటివి ఖచ్చితంగా ఉన్నాయని రాశారు. మళయాళ సినీ పరిశ్రమలో కొందరు శక్తిమంతమైన వ్యక్తుల మాఫియా ఉందని, ఆడవారిని లోబరుచుకోవటం బాగా జరుగుతోందని, పనిచేసేచోట ఆడవారికి టాయిలెట్‌లు, రవాణా సౌకర్యాలు, సరైన ఆహారం వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలోని మగవారు శృంగారంకోసం ఆడవారిని తమ జన్మహక్కులాగా నిస్సిగ్గుగా అడుగుతున్నారని, అవకాశాలకోసం మరో మార్గం లేక లొంగిపోయేలా చేస్తున్నారని నివేదికలో రాశారు. తమను వ్యతిరేకించినవారిపై కక్షకట్టి వారికి అవకాశాలు లేకుండా చేయటం, నిషేధం విదించటంతో సినిమా పరిశ్రమపై తపనతో వచ్చిన అనేకమంది ఆడవారు వదిలేసి వెళ్ళిపోతున్నారని పేర్కొన్నారు. కొందరు ఆడవారు తమకు చెప్పిన అనుభవాలు షాకింగ్‌గా ఉన్నాయని, అయితే వీటిని చెప్పినవారు తమ పేర్లు వెల్లడించవద్దని, వెల్లడిస్తే తమ జీవితాలు నాశనమవుతాయని భయపడుతున్నారని రాశారు. సినిమా పరిశ్రమలోని 30 విభాగాలలో ఆడవారు 17 రకాలుగా లైంగికమైన వేధింపులకు గురవుతున్నారని, పరిశ్రమలో కొనసాగాలంటే “కాంప్రమైజ్”, “ఎడ్జస్ట్‌మెంట్” అనేవి ప్రతి అమ్మాయికీ తప్పనిసరిగా మారిపోయాయని పేర్కొన్నారు. మళయాళ సినిమా పరిశ్రమ మొత్తం కొందరు శక్తిమంతులైన పురుష దర్శక నిర్మాతలు, నటుల అధీనంలో ఉందని రాశారు.
నివేదికలో 63 పేజీలు మాయం
నివేదికకు సంబంధించి మరో దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే, నివేదికలో కీలకమైన 63 పేజీలు మాయమవటం. కొందరు ముఖ్యమైన మళయాళ నటుల గురించి నివేదికలో వ్యతిరేకంగా ప్రస్తావన ఉండటంతో, వారిని కాపాడటంకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణలు వినబడుతున్నాయి.
హేమ కమిటీ నివేదికపై కేరళ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతంగా చర్చ జరుగుతుండటంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించక తప్పలేదు. మళయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తుకోసం ఒక సిట్‌ను ఏర్పాటుచేసింది. మరోవైపు నివేదిక పూర్తి పాఠాన్ని తమకు సమర్పించాలని కేరళ హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదిక బయటకు వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి ప్రముఖ నటుడు జయసూర్య, నటుడు-ఎమ్మెల్యే ముకేష్‌లతో సహా 17 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఈ మొత్తం వ్యవహారంపై మౌనంగా ఉండటంపై మమ్మూట్టి, మోహన్‌లాల్‌లను కేరళ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తుండటంతో వారు మెల్లగా బయటకు వచ్చి కమిటీ రిపోర్ట్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు.
దేశవ్యాప్తంగా ప్రకంపనలు
హేమ రిపోర్ట్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అన్ని సినిమా పరిశ్రమలలోనూ ఈ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆడవారు బయటకు వస్తున్నారు. తమిళనాడులో రాధిక, రేవతి, కుష్‌బూ వంటివారు గళమెత్తగా, తెలుగు ఇండస్ట్రీ గురించి సమంత ప్రకటన విడుదల చేశారు. అటు హిందీ ఇండస్ట్రీలోని సమస్య గురించి సోమీ అలీ వంటివారు మాట్లాడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ నిన్న హేమ కమిటీ నివేదిక పూర్తి పాఠాన్ని విడదల చేయాలని కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మొత్తంమీద హేమ కమిటీ రిపోర్ట్ ఒక పాజిటివ్ ఛేంజ్ తీసుకొచ్చేటట్లుగా కనబడుతోంది.