కాదంబరి జత్వానీ కేసుపై ఎల్లో వర్సెస్ బ్లూ మీడియా: ఎవరిమాటలో నిజమెంత?
x

కాదంబరి జత్వానీ కేసుపై ఎల్లో వర్సెస్ బ్లూ మీడియా: ఎవరిమాటలో నిజమెంత?

సజ్జన్ జిందాల్‌పై ముంబైలో కాదంబరి పెట్టిన కేసులో తన ఆరోపణలను సమర్థించుకోవటానికి కోర్టుకు రుజువులు చూపాల్సిన సమయానికి ఆమె విజయవాడలో పోలీసుల అధీనంలో ఉన్నారు.


తెలుగుదేశం అనుకూల ప్రసార మాధ్యమాలలో గత మూడురోజులుగా వస్తున్న వార్తలు చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌ను రక్షించటంకోసం కాదంబరి జత్వానీపై కేసు బనాయించినట్లు అనిపిస్తుంది. మరోవైపు వైసీపీ పార్టీ సొంత మీడియా సాక్షిలోనేమో… ఈ కాదంబరి జత్వానీ పెద్ద కిలాడీ లేడీ అని, హనీట్రాప్‌తో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను వలలో వేసుకుని డబ్బులు గుంజుతుందని ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంలో ఎవరి వాదనను నమ్మాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అసలు దీనిలో నిజానిజాలు ఎంత ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

ఈ కేసును గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటానికి మూడు విషయాలు తెలుసుకోవాలి. 1. దేశంలో ప్రముఖ స్టీల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్‌కు, వైఎస్ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం. 2. సజ్జన్ జిందాల్‌కు, కాదంబరి జెత్వానికి మధ్య వివాదం. 3. కాదంబరి జెత్వానిపై జగ్గయ్యపేటలోని భూమి గురించిన వివాదం.

1. జిందాల్‌కు జగన్‌కు మధ్య సంబంధం

గత ఏడాది, 2023 ఫిబ్రవరి 15న కడప జిల్లా జమ్మలమడుగులో రు.8,800 కోట్లతో సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ సంస్థ నిర్మించే ఒక కొత్త స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది. ఈ ఫ్యాక్టరీకి రాష్ట్రప్రభుత్వం రు.700 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు కల్పించింది, 3,500 ఎకరాల భూమిని ప్లాంటుకు కేటాయించింది. ఈ కార్యక్రమంలో సజ్జన్ జిందాల్ హాజరయ్యారు. ఆయన ఆ నాటి సభలో మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఎప్పటినుంచో తెలుసని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన కుమారుడు జగన్‌కు వ్యాపార మెళుకువలు నేర్పించాలంటూ తనవద్దకు పంపించారని చెప్పారు. యువకుడైన జగన్ అప్పుడు ముంబాయిలో తనవద్దకు వచ్చారని తెలిపారు. ఆ అబ్బాయి ఇప్పుడు ముఖ్యమంత్రి కావటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. జగన్ నాయకత్వ లక్షణాలను బాగా పొగిడారు. యువకుడైన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండటంవల్ల ఏపీ అభివృద్ధిలో ముందుకు వెళ్ళగలుగుతోందని చెప్పారు. ఏపీకి వచ్చినప్పుడల్లా సొంత ఊరుకు వచ్చినట్లు ఉంటుందని అన్నారు. రాజశేఖరరెడ్డి తనకు మెంటార్ అని జిందాల్ స్వయంగా చెప్పారు.

మరోవైపు, శంకుస్థాపన జరిగిన స్టీల్ ఫ్యాక్టరీ గురించి పలు విమర్శలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీకి ఇప్పుడు మూడుసార్లు ప్రారంభోత్సవాలు చేశారని, తాజాగా చేసిన ప్రారంభోత్సవంకూడా ఒక డ్రామా అని, కేవలం ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ తంతు జరిపారు అనే విమర్శలు కూడా బాగా వినబడ్డాయి.

2. జిందాల్‌కు, జత్వానికి మధ్య ఉన్న సంబంధం

64 ఏళ్ళ సజ్జన్ జిందాల్ దేశంలోనే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. వీరి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఉక్కు, మైనింగ్, పవర్ ప్లాంట్‌లు, క్రీడలు, మౌలికసదుపాయాలు, సాఫ్ట్‌వేర్ రంగాలలో విస్తరించి ఉంది. ముంబాయి ప్రధాన కేంద్రంగా పలు దేశాలలో విస్తరించిఉన్న ఈ మల్టీనేషనల్ కంపెనీ విలువ రు.1,80,000 కోట్లు(22 బిలియన్ డాలర్లు). ఈ సజ్జన్ జిందాల్ సోదరుడు, రాజకీయ నాయకుడు నవీన్ జిందాల్‌. ఈయన గతంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. ఈ ఏడాది మార్చిలో బీజేపీలో చేరి హర్యానానుంచి ఎంపీగా నిలబడి విజయం సాధించారు. దాసరి నారాయణరావు నిందితుడుగా ఉన్న బొగ్గు కుంభకోణంలో నవీన్ జిందాల్‌ కూడా ఒక నిందితుడే.

ఇక కాదంబరి జత్వాని విషయానికొస్తే, ఆమె అహ్మదాబాద్‌లో పుట్టిన ఒక సింధి. తల్లి ఆశ జత్వాని రిజర్వ్ బ్యాంకులో ఆఫీసర్, తండ్రి మర్చంట్ నేవీ ఆఫీసర్. కాదంబరి ఒక మల్టీ టేలెంటెడ్ అమ్మాయి. ఆమె యాక్టర్‌గా మారిన డాక్టర్. తెలుగుతో సహా పలుభాషా చిత్రాలలో నటించారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో మేనేజిమెంట్‌లో ఒక కోర్స్ చేశారు.

సజ్జన్ జిందాల్‌పై గత ఏడాది డిసెంబర్ 13న ముంబాయిలోని బాంద్రా కర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో ఒక ఎఫ్ఐఆర్ నమోదయింది. ఈయన రెండేళ్ళుగా తనను లైంగికంగా వేధిస్తున్నారని, అత్యాచారాలు చేస్తున్నారని కాదంబరి జత్వానీ చేసిన ఫిర్యాదుపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదు వెనక కూడా ఒక తతంగం నడిచింది. జిందాల్‌పై 2023 ఫిబ్రవరి 13నే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు ఏ చర్యా తీసుకోకపోవటంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్ట్ దీనిపై స్పందించి ముంబై పోలీసులను ఆదేశించటంతో వారు డిసెంబర్ 13న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

జిందాల్‌తో తనకు 2021 అక్టోబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పరిచయం అయిందని, వీఐపీ బాక్స్‌లో తాను, తన సోదరుడు అంబరీష్ జత్వాని కూర్చుని ఉండగా జిందాల్‌ను కలవటం జరిగిందని కాదంబరి ఫిర్యాదులో పేర్కొన్నారు. తరచూ కలుస్తూ ఉండాలని తాము అనుకున్నామని, జిందాల్‌తో వ్యాపార సంబంధాలకోసం అతనిని కలుస్తూ ఉండమని తన సోదరుడు(అంబరీష్ జత్వాని దుబాయ్‌లో బిలియన్ బ్రిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు అధినేత) చెప్పారని తెలిపారు. ఇండియా వచ్చిన తర్వాత తాము కలుసుకుంటూ ఉండేవారమని, ఆయన తనతో ప్రేమ వ్యవహారం నడపటానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. 2021 డిసెంబర్ 23న జిందాల్ వాట్సప్‌లో తన క్రెడిట్ కార్డ్ వివరాలు షేర్ చేసి, వాడుకొమ్మని చెప్పినట్లు తెలిపారు. ఆయన ప్రోద్బలంతో ఆ మరుసటి రోజు తాను ఒక హోటల్‌లో రూమ్ బుక్ చేశానని, ఆ రూమ్‌లో తనతో ప్రణయం నడపటానికి సజ్జన్ ప్రయత్నించారని పేర్కొన్నారు. తనకు బంగళా, కారు ఇస్తానని, వ్యాపారం పెట్టిస్తానని సజ్జన్ చెప్పినట్లు తెలిపారు. అయితే వివాహం చేసుకోవాలని తాను అడిగితే అతను అది కుదరదని చెప్పినట్లు పేర్కొన్నారు. 2022 జనవరిలో తాను ఆయన పెంట్‌హౌస్‌కు వెళ్ళినప్పుడు తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు. ఆ తర్వాత అతను తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడని, కానీ కొన్నాళ్ళకు తనను బెదిరించటమే కాకుండా, తన ఫోన్ నంబర్‌ను పూర్తిగా బ్లాక్ చేశాడని తెలిపారు.

కాదంబరి ఎఫ్ఐఆర్‌లో అత్యాచారం, హింసాయుతంగా దాడిచేయటం, బెదిరించటానికి సంబంధించిన 376, 354, 506 సెక్షన్‌లను పెట్టారు. మరోవైపు దీనిపై 2023 డిసెంబర్ 17న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ పీఆర్ బృందం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. తనపై ఆరోపించబడిన తప్పుడు, నిరాధార ఆరోపణలను సజ్జన్ జిందాల్ ఖండించారని, కేసు దర్యాప్తుకు ఆయన పూర్తిగా సహకరిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

3. కాదంబరిపై జగ్గయ్యపేటలోని భూ వివాదం

కాదంబరి అనే మహిళ జగ్గయ్యపేటలో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తికి చెందిన ఐదు ఎకరాల భూమిని అక్రమంగా అమ్మటానికి ఇద్దరు వ్యక్తులనుంచి అడ్వాన్స్ తీసుకుంది అంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేశారు. ఈయన 2014 అసెంబ్లీ ఎన్నికలలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంనుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఈయన ఒక పారిశ్రామికవేత్త. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం ఈయన ఆస్తులు రు.1,700 కోట్లు. ఇతనికి, కాదంబరికి 2015లోనే పరిచయం ఉంది. అతను ఈమెను పెళ్ళి చేసుకుంటానని కూడా ప్రపోజ్ చేశారని కాదంబరి చెబుతున్నారు. అయితే అతనికి పెళ్ళి అయిన 14 నెలలకే భార్య వదిలివెళ్ళిపోయిందని, అతనికి చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసి తాను తిరస్కరించానని కాదంబరి చెప్పారు.

సివిల్ వివాదమైన ఈ జగ్గయ్యపేట భూవివాదం కేసులో ఏపీ పోలీసులు “ప్రత్యేక” శ్రద్ధ తీసుకుని మెరుపువేగంతో కదిలి ఫిబ్రవరి 3వ తేదీన ముంబై చేరుకుని కాదంబరిని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ, ఏసీపీలు రమణమూర్తి, హనుమంతరావు, సీఐ ముత్యాల సత్యనారాయణ, ఎస్ఐ షరీఫ్ ముంబై వెళ్ళి వాళ్ళను తీసుకొచ్చిన బృందంలో ఉన్నారు. ఈ కేసులో గమనించవలసిన విషయం ఏమిటంటే, తప్పుడు పత్రాల సృష్టి, మోసపూరిత అమ్మకాలు అనేవి సివిల్ దావాలకు చెందిన అంశాలు. సివిల్ తగాదాలలో పోలీసులు తల దూర్చకూడదు అనే అంశంలో పలు మార్లు సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. అటువంటప్పుడు ఒక పూర్తిగా రిజిస్టరు కాని లావాదేవీలో, కేవలం కోనుగోలు ఒప్పంద పత్రం అధారంగా ఒక వ్యక్తి చెందిన అస్తిని, సదరు నటి ఏరకంగా అమ్మకానికి పెట్టగలదు అనే కనీస న్యాయ పరమైన అంశం గురించిన అలోచన చేయకుండా కోర్ట్ రిమాండ్ ఉత్తర్వులు ఎలా జారీ చేసింది అనేది కూడా ఆలోచించాల్సిన అంశం.

యాదృచ్ఛికమా-కుట్రపూరితమా?

ఈ కేసులో అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఇది అర్థం చేసుకుంటే కేసు మొత్తం అర్థమవుతుంది. అది ఏమిటంటే, సజ్జన్ జిందాల్‌పై కాదంబరి పెట్టిన కేసులో తన ఆరోపణలను సమర్థించుకోవటానికి కోర్టుకు రుజువులు చూపాల్సిన సమయానికి ఆమె విజయవాడలో పోలీసుల అధీనంలో ఉన్నారు. ఫిబ్రవరి 5 - 9 మధ్య ఆమె కోర్టుకు వచ్చి తన ఆరోపణలకు సాక్ష్యాలు సమర్పించవలసి ఉండగా, ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఈమెయిల్స్ ఇచ్చినా స్పందించకపోవటంతో రుజువులు లేవనే కారణంతో దానిని తప్పుడు కేసుగా పేర్కొంటూ మూసివేస్తున్నామని ముంబై పోలీసులు చెప్పారు. ఫిర్యాదిదారు తప్పుడు ఆరోపణలతో తమ సమయాన్ని వృథా చేశారని పోలీసులు ఈ కేసు క్లోజర్ రిపోర్టులో ఆరోపించారు.

మరోవైపు, జమ్మలమడుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించటం ఫిబ్రవరి 15 న జరగటానికి వెనక కూడా ఒక మతలబు ఉందని, కేసు విషయంలో తన సహాయం పొందిన జిందాల్‌తో ఎన్నికలకోసం జగన్ ఈ డ్రామా ఆడించారని కూడా ఒక ఆరోపణ ఇప్పుడు వినబడుతోంది.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని కొరుకుడుపడని విషయాలు కూడా ఉన్నాయి. 60 ఏళ్ళ పైబడిన ఒక ధనవంతుడిని 30 ఏళ్ళ వయసున్న నటి పరిచయం పెంచుకోవటానికి, వివాహమాడటానికి ప్రయత్నించటం ఒకటి కాగా, విద్యాసాగర్‌కు, కాదంబరికి గతంలో ఉన్న పరిచయాన్ని ఈ కేసులో వాడుకోవచ్చని ఈ కేసు సూత్రధారులకు ఎలా తెలిసింది అనే విషయం రెండోది. ఏది ఏమైనా నిజం నిలకడమీద దర్యాప్తులో త్వరలోనే తెలుస్తుంది. అప్పటిదాకా ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్టులు రాబోతున్నాయో చూడాలి.

Read More
Next Story