జయ జయహే విశాఖ
x

జయ జయహే విశాఖ

విశాఖ తీరంలో విరగబూయనున్న డేటా పూదోటలు


తూర్పు తీరాన పచ్చని కొండలు, నీలి సముద్రపు అలల సవ్వడి మధ్య ఒదిగి ఉండే అందమైన నగరం విశాఖపట్నం. నిన్న మొన్నటి వరకు ప్రపంచానికి ఈ నగరం అంటే కేవలం డాల్ఫిన్ నోస్ అందాలు, ఓడరేవు ప్రశాంతత మాత్రమే తెలుసు. అయితే, ఇప్పుడు ఆ పాత చిత్రం చెరిగిపోయింది. ఆ నిశ్శబ్ద అలల లయ ఇప్పుడు ఆర్థిక శంఖారావాన్ని మోగించబోతుంది.

కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ప్రపంచ దృష్టి మొత్తం విశాఖ మీదికి మళ్లింది. అంతర్జాతీయ దిగ్గజాలైన గూగుల్ , మెటా సంస్థలు తమ భవిష్యత్ ప్రణాళికలను ఇక్కడే సిద్ధం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 6 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం, ఈ నగరం ఎంత వేగంగా దూసుకుపోతోందో తెలియజేస్తుంది. $26 బిలియన్ల పెట్టుబడులతో, విశాఖ ఇప్పుడు రాష్ట్రంలోని పాత రాజధాని చర్చలను దాటి, ఆర్థిక రాజధానిగా నిలబడుతోంది. కృత్రిమ మేధ, సాంకేతికత రంగంలో భారత భవిష్యత్తును నిర్ణయించే శక్తి కేంద్రంగా విశాఖ రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త శకం నిజంగా అద్భుతం.

1. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్ & డిజిటల్ రియల్టీ (డిజిటల్ కనెక్షన్)

భారతీయ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ బ్రూక్‌ఫీల్డ్ , డిజిటల్ రియల్టీ సంయుక్త సంస్థ డిజిటల్ కనెక్షన్ ఇక్కడ ఒక స్వతంత్ర కృత్రిమ మేధ డేటా సెంటర్ పార్కును స్థాపించనుంది. ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం ఏకంగా 1 గిగావాట్గా నిర్ణయించారు, దీని అంచనా పెట్టుబడి విలువ $11 బిలియన్లు (సుమారు రూ. 91,000 కోట్లు). నవంబర్‌లో ఒప్పందం కుదిరిన ఈ భారీ నిర్మాణం, రాబోయే ఐదేళ్లలో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్ట్, రిలయన్స్ జామ్‌నగర్ గిగావాట్ కేంద్రానికి సమాంతరంగా పనిచేసి, కృత్రిమ మేధ శిక్షణ కోసం ద్వంద్వ-కేంద్రాల నెట్‌వర్క్‌ను సృష్టిస్తుంది.

2. అదానీ కనెక్స్ &గూగుల్

గూగుల్ , అదానీ కనెక్స్ సంయుక్త సంస్థ కలిసి విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో ఒక సమీకృత డేటా సెంటర్ ను, సాంకేతిక వ్యాపార పార్కును అభివృద్ధి చేయనుంది. గూగుల్ ఐదేళ్లలో ప్రకటించిన $15 బిలియన్ల (రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడిలో ఇది భాగం.ఇది కూడా 1 గిగావాట్ సామర్థ్యంతో, ముఖ్యంగా అధిక సాంద్రత గల కృత్రిమ మేధ పనిభారాన్ని నిర్వహించడానికి రూపకల్పన చేయబడింది. అదానీ కనెక్స్ ఈ ప్రాజెక్టుకు ప్రధాన మౌలిక సదుపాయాల భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన ప్రాంతం అంతా పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడవబోవడం విశేషం.

3. ఎయిర్‌టెల్ ‘నెక్స్‌ట్రా’ & గూగుల్ భాగస్వామ్యం

ఎయిర్‌టెల్ సంస్థ యొక్క నెక్స్‌ట్రా విభాగం, గూగుల్‌తో కలిసి విశాఖ తీరాన ఒక కీలకమైన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (సి.ఎల్.ఎస్.) ను , ఒక డేటా సెంటర్‌ను నిర్మిస్తోంది. ఈ భాగస్వామ్యం అక్టోబర్ 2025లో ప్రకటించబడింది.ఈ ప్రాజెక్టుకు అవసరమైన పెట్టుబడి మొత్తం $15 బిలియన్ల గూగుల్ విస్తృత భాగస్వామ్య నిధి నుంచే సమకూరుతుంది. గూగుల్ అంతర్జాతీయ సబ్‌సీ కేబుళ్లకు ఈ సి.ఎల్.ఎస్. ఆతిథ్యం ఇస్తుంది. ఇది గూగుల్ క్లౌడ్ ,కృత్రిమ మేధ అవసరాలకు ప్రత్యేకంగా మద్దతు ఇచ్చే విధంగా రూపొందించబడింది. ఈ భాగస్వామ్యం, విశాఖపట్నంను అంతర్జాతీయ డేటా హైవే మ్యాప్‌లో కీలక కేంద్రంగా మారుస్తుంది.

4. సిఫి టెక్నాలజీస్

సిఫి టెక్నాలజీస్ రెండు ప్రధాన ప్రాజెక్టులను చేపడుతోంది. ఒకటి, రుషికొండ వద్ద రూ. 1,500 కోట్లతో 50 మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ , ఓపెన్ సి.ఎల్.ఎస్. నిర్మాణం. రెండవది, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తో కలిసి పరదేశిపాలెం వద్ద 500 మెగావాట్ల భారీ హైపర్‌స్కేల్ క్యాంపస్ నిర్మాణం. దీని పెట్టుబడి విలువ సుమారు $1.8 బిలియన్లు (రూ. 15,266 కోట్లు). మెటా తన వాటర్‌వర్త్ సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టుకు మద్దతుగా ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తుంది.

డేటా సెంటర్‌లు భారీ నిర్మాణాలు. ఇవి తమ కార్యకలాపాల కోసం అధిక స్థాయిలో విద్యుత్ ని, నీటిని వినియోగిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా, పెద్ద డేటా సెంటర్‌లకు సమీపంలో నివసించే స్థానిక ప్రజలు, ఈ సదుపాయాల కారణంగా భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతున్నాయని , స్థానిక నీటి వనరులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ లాంటి తీర ప్రాంతంలో నీటి వినియోగంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, డేటా సెంటర్ల ద్వారా పెరుగుతున్న విద్యుత్ , నీటి డిమాండ్‌ ఎలా ఉంటుందో తాము పరిశీలిస్తున్నామని హామీ ఇచ్చారు. అలాగే, ఈ డిమాండ్‌ను తీర్చడంలో హైదరాబాద్ సాధించిన విజయాన్ని, విశాఖపట్నంలో తక్కువ కాలంలోనే పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. దీనికి పునరుత్పాదక శక్తి వినియోగం, మెరుగైన జల నిర్వహణ కీలకమని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా దాదాపు 2,00,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. విశాఖపట్నం ఇప్పుడు కేవలం తీర నగరం మాత్రమే కాదు, భారతదేశ కృత్రిమ మేధకు, డేటా భవిష్యత్తుకు మార్గదర్శిగా మారింది. రాబోయే రోజుల్లో లక్షలాది ఉద్యోగాల సృష్టికి, అపారమైన ఆర్థికాభివృద్ధికి పునాదిగా కూడా మారనుంది. ఈ ప్రాజక్టులు కార్యరూపం దాల్చడం మీద ఉన్న అన్ని అనుమానాలను పటాపంచలు చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక దార్శనికతకు , ఆర్థిక ఉజ్జ్వల భవిష్యత్తుకు బలమైన నిదర్శనంగా నిలబడుతుందని ఆశిద్దాం.

Read More
Next Story