కొత్త పార్టీ ప్రారంభం: డీఎంకేపై విమర్శలు-పొత్తులకు సిద్ధమని ప్రకటన!
ప్రారంభోపన్యాసంలో తన పార్టీ సిద్ధాంతాలను, విధానాలను ప్రకటించారు. అధికార పార్టీ డీఎమ్‌కేపై, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎమ్‌జీఆర్, జయలలిత, విజయకాంత్, తాజాగా వచ్చిన కమలహాసన్‌ల మార్గంలోనే తమిళనాడులో ఇవాళ మరో కొత్త సినీ హీరో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బరిలో దిగటానికి తన కొత్త పార్టీ ‘తమిళగ వెట్రి కళగమ్’ను విజయ్ ఈ సాయంత్రం విల్లుపురం జిల్లా విక్రవాండిలో ప్రారంభించారు. ప్రారంభోపన్యాసంలో తన పార్టీ సిద్ధాంతాలను, విధానాలను ప్రకటించారు. అధికార పార్టీ డీఎమ్‌కేపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తమిళగ వెట్రి కళగమ్(టీవీకే) మొదటి రాష్ట్ర సదస్సులో సుమారు గంటసేపు విజయ్ ప్రసంగించారు. ముందు రాసుకున్న ప్రసంగం కాకుండా ఆశువుగా మాట్లాడారు. తిరుక్కురళ్‌లోని ‘అందరూ సమానం, ఎవరూ ఎక్కువకాదు, తక్కువకాదు’ అనేదే తమ సిద్ధాంతమని చెప్పారు. పెరియార్‌ను తాను అనుసరిస్తానని, సామాజిక న్యాయం, మహిళా సాధికారత వంటి ఆయన విధానాలన్నింటినీ అనుసరిస్తానుగానీ ఆయన నాస్తిక విధానాన్ని అనుసరించబోనని అన్నారు. కామరాజ్, అంబేద్కర్, వేలు నచియార్, అంజలి అమ్మాళ్ వంటి నేతలు తనకు మార్గదర్శకులని చెప్పారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మెజారిటీతో విజయం సాధించగలుగుతుందని విశ్వాసం వ్యక్తంచేస్తూనే, అవసరమైతే పొత్తులు పెట్టుకుంటామని అన్నారు.
తమిళనాడులో ఒకే కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందంటూ పరోక్షంగా డీఎమ్‌కేపై విమర్శలు గుప్పించారు. ద్రవిడ నమూనా అనే పేరుతో తమిళ ప్రజలను మోసం చేస్తున్నారని, వారిది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు. బీజేపీ ఒక ఛాందసవాద పార్టీ అని విమర్శించారు. తాను ఒక ధృడమైన మనస్సుతో రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. రాజకీయాలు చేయటం సినిమా రంగం అంత తేలిక కాదని తనకు తెలుసని అన్నారు. ఇది ఒక యుద్ధభూమిలాంటిదని, పెద్ద మనసుతో ఆలోచించాల్సివస్తుందని చెప్పారు. లౌకిక సామాజిక న్యాయం తమ పార్టీ సిద్ధాంతమని విజయ్ చెప్పారు. ద్రవిడ జాతీయవాదం, తమిళ జాతీయవాదం రెండింటికీ తాను ప్రాముఖ్యతను ఇస్తానని అన్నారు. నీట్ పరీక్షలకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. తాను రాజకీయాలలో పసివాడినేగానీ, పామును కూడా పట్టుకోగలిగే ఆత్మవిశ్వాసం ఉందని అన్నారు. నటులంటే చులకనభావం తగదని విజయ్ చెప్పారు. తమిళనాడులో ఎమ్‌జీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్ సినిమారంగంనుంచి వచ్చి మంచి పరిపాలన అందించారని గుర్తు చేశారు.
విజయ్ ఉపన్యాసంలో ముఖ్యాంశాలు
1. గవర్నర్ పోస్ట్ రద్దు చేయాలని విజయ్ అన్నారు.
2. పరిపాలనలో, న్యాయవ్యవస్థలో, మత సంస్థలలో తమిళానికి మరింత ప్రాధాన్యత ఇచ్చే రెండు భాషల విధానం ఉండాలి.
3. విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉండాలి.
4. పరిపాలన వికేంద్రీకరణకోసం మదురైలో రాష్ట్ర సచివాలయానికి కొత్త శాఖ ప్రారంభించాలి.
5. తమ పార్టీలో, అసెంబ్లీలోనూ మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించాలి.
6. విద్యా ప్రమాణాల పెంపుదలకు, మంచి విద్యను అందించటంకోసం కామరాజ్ మోడల్ పాఠశాలల ప్రారంభం.
7. ఐటీకోసం ప్రత్యేకమైన డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభం.
8. చెరువులు, నాలాల ఆక్రమణల నిరోధంకోసం ప్రత్యేక చర్యలు.
9. అక్రమ ఇసుక తవ్వకాల నిరోధంకోసం ప్రత్యేక చట్టం.
10. సంప్రదాయ రిజర్వేషన్ విధానానికి ప్రత్యామ్నాయంగా అందరికీ సమాన ప్రాతినిధ్యంకోసం కొత్త రిజర్వేషన్ విధానం.
చెన్నై దగ్గర మొదలుపెట్టి 100 కి.మీ. దూరంలోని విక్రవాండి వరకు రోడ్డు పొడవునా టీవీకే పార్టీ బ్యానర్‌లు, ఫ్లెక్సీలు నిండిపోయాయి. విక్రవాండిలో సభాస్థలి వద్ద పెరియార్ వంటి ద్రవిడ దిగ్గజాలు, బీఆర్ అంబేద్కర్ కటౌట్‌లను పెట్టారు. సభాస్థలిలో 60 వేల కుర్చీలను వేశారు. అయితే సభకు దాదాపు 3 లక్షలమంది హాజరైనట్లు ఒక అంచనా. ఇక సభ నిర్వహణకు సుమారు రు.50 కోట్లు ఖర్చయినట్లు చెబుతున్నారు.
50 ఏళ్ళ విజయ్ ఇప్పుడు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నారు. ఒక్కో సినిమాకు దాదాపు రు.150-200 కోట్లు పారితోషికం తీసుకుంటారని చెబుతారు. 1992లో సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన తండ్రి చంద్రశేఖర్ ప్రముఖ తమిళ సినీ దర్శకుడు. ఆయన తల్లి శోభ ఏపీకి చెందినవారని ఒక వాదన ఉంది. ప్రస్తుతం తన 69వ చివరి సినిమాలో నటిస్తున్నారు.