వెంకాయమ్మ.. వాట్ ఈజ్ దిస్?
వెంకాయమ్మ లకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య. ఈమే తన పుట్టిన రోజు ఏమి చేసిందో తెలిస్తే అవాక్కవాల్సిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్రానికి సుపరిచితులు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ పేరు చెబితే ఏమో కానీ భార్య ప్రత్తిపాటి వెంకాయమ్మ అంటే నియోజకవర్గంలో హడల్. ఎవరైతే లాఠీ, తుపాకీ చేతపట్టుకుని శాంతి భద్రతలు కాపాడుతారో వారు కూడా తల వంచాల్సిందే. పైగా ఆమె చెప్పే ప్రతి మాటకూ తలూపాల్సిందే. ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఆమె మాటను కాదనరు. ఎందుకో.. ఏమిటో తెలియదు కానీ.. ఆమంటే పుల్లారావుకు కూడా హడలే.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన విడదల రజనీకి కాస్త దగ్గరగానే ఉంటారు పుల్లారావు. మొదట రజినీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పుల్లారావు శిశ్యురాలుగా ఉన్నారని స్థానిక పార్టీ నాయకులు చెబుతుంటారు. అయితే వెంకాయమ్మ ఒక దశలో విడదల రజినిపై విరుచుకు పడ్డారు. నా భర్తతో రాసుకు పూసుకు ఎందుకు తిరుగుతున్నావంటూ కొట్టుకున్నారని కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ తరువాత ఆమె వైఎస్సార్‌సీపీలో చేరడం, మంత్రికావడం జరిగిపోయాయి.
పలు ఆరోపణలు
ప్రత్తిపాటి పుల్లరావుపై గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన భార్య పెత్తనం మరీ పెచ్చుమీరిందనే ఆరోపణలతో చిలకలూరిపేట అట్టుడికింది. చిలకలూరిపేట నుంచి విజయవాడ వస్తుండగా టోల్‌గేట్ వద్ద టోల్ ఫీజు కట్టించుకున్నారని భారీ గొడవ జరిగింది. మంత్రి కారుకే టోల్ ఫీజు కట్టించుకుంటారా? అంటూ ఆమె అక్కడి ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. ఆ విషయం అప్పట్లో చంద్రబాబు వద్దకు కూడా వెళ్లింది.
అసైన్‌ల్యాండ్ కొన్నారనే ఆరోపణలు
అసైన్‌ల్యాండ్స్ ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య వెంకాయమ్మ పేరుతో యడ్లపాడు వద్ద కొన్నారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. వాటిపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విచారణ జరిపింది. పుల్లరావు భార్యను అరెస్ట్ చేయాలనే స్టేజికి వచ్చాక ఎందుకో వెనక్కి తగ్గారు. టచ్‌చేసి వదిలారంటే ఏదో ఉందనే అనుమానం చంద్రబాబుకు కూడా వచ్చింది. వీరికి జిన్నింగ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల పేరుతో గుడ్డిపత్తి కొనుగోలు చేసి అమ్మి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తలవంచిన పోలీస్
మంగళవారం వెంకాయమ్మ పుట్టిన రోజు కావడంతో పోలీసులు ఆమెకు దాసోహం అన్నారు. వారే కేక్ తెచ్చి ఆమెతో కట్ చేయించి చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్‌డే అంటూ వెంకాయమ్మ నూరేళ్లు బతకాలని ఆకాంక్షించారు. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పట్టణంలోని పోలీసులంతా ఎందుకు తలవంచారనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ.
ఆమె అనుకున్నది జరగాల్సిందే..
గతంలో పుల్లరావు మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆమె అనుకున్నది జరగాల్సిందే. నియోజకవర్గంలోని పార్టీ నాయకులంతా వెంకాయమ్మ వద్దకు వస్తారు తప్ప పుల్లారావు వద్దకు వెళ్లరు. పోలీసులకు కానీ, ఇతర అధికారులకు కానీ ఆమె ఫోన్ చేసి ఏదైనా చెప్పారంటే చేయాల్సిందే. లేదంటే ఆ అధికారికి శంకరగిరి మాన్యాలేననేది అక్కడి వారి మాట. భర్త కూడా ఆమె మాటకు ఎదురు చెప్పకపోవడం, ఆమె చేసే ప్రతి దానినీ పట్టించుకోకపోవడంతో ఆమె ఏమి చేసినా సరిపోతుందని, అందుకే ఆమెను ప్రసన్నం చేసుకుంటే ఇక్కడే నాలుగు రోజులు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చనేది అధికారుల మాట.
వెంకాయమ్మకు కొడుకు, కుమార్తె ఉన్నారు. వారు మాత్రం రాజకీయ వివాదాల్లోకి ఇంతవరకు రాలేదు. కుమారుడు విదేశాల్లో చదువుకున్నారు. తండ్రి స్థాపించిన కంపెనీల్లో వ్యాపారం చేస్తున్నారు. కొడుకు కూడా సొంతగా కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. స్పిన్నింగ్ మిల్స్ కూడా వీరికి ఉన్నాయి.
Next Story