గత వైభవాన్ని చాటి చెప్పే త్రిపురాంతక క్షేత్రం
శివాలయాల్లో త్రిపురంతక క్షేత్రం ఎంతో గొప్ప చరిత్ర కలిగింది. ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా త్రిపురంతకంలో ఉంది. ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
దేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం కలిగి, గత వైభవాన్ని చాటిచెప్పే ప్రాచీన కట్టడాలు, అప్పటి తీపి గుర్తులు క్రమంగా కాల గర్భంలో కలిసిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అద్భుత కళారూపాలు శిథిలమౌతుంటే ఎవరి హృదయమైనా ద్రవించక మానదు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో పడమటి వైపున కుమారాద్రి గిరిపై ఉన్న త్రిపురాంతక క్షేత్రం ఇందుకు నిదర్శనం. గత వైభవాలకు ప్రతీకలుగా ఉన్న ఈ పురాతన కట్టడాలు భావితరాలు చూసే భాగ్యం లేకుండా కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. క్షేత్రంలో త్రిపురాంతకేశ్వర లింగం స్వయం భూలింగం. ఈ శివలింగానికి ఐదు ముఖాలతో పాటు శిరస్సున గంగ కూడా ఉంది.
క్షేత్రానికి తూర్పువైపున వినుకొండ మండలం శివాపురం వద్ద పాతపాటి దుర్గ, ఈశ్వరుడు, దక్షిణాన కొచ్చర్ల కోటలో రామలింగేశ్వరస్వామి, అంకాళ శక్తి, పటమట గడ్డమీదపల్లె వద్ద వీరభద్రుడు, ఉత్తరాన శతకోడు గ్రామంలో ఈశ్వరుడు, అంకాళశక్తి మొదలైన దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ పురాతన కట్టడాలు. గొప్ప కళారూపాలు. ఈ క్షేత్రంలో గంగావతి, పాప విమోచనం, పుష్పావతి, గండీ ప్రభ, దుర్వాస వనస్వతి, నేత్రావతి, మోక్షగుండం, తమ్ర జాహ్నవి, చిత్ర మహికర్ణిక, అనే తీర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అరుదైన కదంబ వృక్షం కూడా ఉంది. ఇంకా ఇక్కడ కేదారేశ్వర, ఉత్తరేశ్వర, మల్లికార్జున, కపిలేశ్వర, గౌరీశ్వర, అంగారేశ్వర, మూలస్థానేశ్వర, పాప విమోచన అనే స్వయం భూ లింగాలు కూడా ఉన్నాయి.
ఈ క్షేత్రంలో మొదట కులోత్తుంగ చోళుడు శిలా శాసనాన్ని వేయించారు. ఆలయం చుట్టూ వందల కొద్దీ శివలింగాలు పడి ఉన్నాయి. క్షేత్రం ఆవరణలో 250 శిలా శాసనాలు ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని కాకతీయ, రెడ్డి రాజులు వారి దండ నాయకులు, చాళుక్యులు, విజయనగర రాజులు పర్యవేక్షించినట్లు శాసనాల్లో పేర్కొన్నారు. ఈ దేవాలయాన్ని పదవ శతాబ్దానికి ముందే శైవులలోని చామండులు నిర్మించినట్లు ఇక్కడి శాసనాల వల్ల తెలుస్తుందని ప్రముఖ చరిత్ర కారుడు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పరిశోధకుడు వై బాలకోటయ్య తెలిపారు. ఆలయం కింద యాభై గ్రామాలు ఉండేవని, క్షత్ర ఆవరణలో 300 గృహాలు, 30 మంది అర్చకులు, 72 మంది పరిచారకులు ఉండే వారని 13 బస్తాల ధాన్యంతో నిత్యం దూపదీప నైవేద్యములు జరిగేవని శాసనాలు తెలుపుతున్నట్లు చరిత్ర కారులు చెబుతున్నారు.
అనేక మఠాలు, వేద పాఠశాలలు ఆలయ పోషణకు 1,170 ఆవులు ఉండేవి. ఆవు నేతితో అఖండ జ్యతి వెలిగించే వారని చరిత్ర తెలుపుతుంది. ఈ కట్టడాలన్నీ ప్రస్తుతం శిథిలావస్తకు చేరుకున్నాయి. నాటి అపురూప శిల్ప సంపద నేడు రాళ్ల గుట్టలుగా మారిపోతోంది. స్వయం భూలింగం దొంగల ధన దాహానికి ముక్క చెక్కలైంది. గుప్త నిధులుగా కోట్ల రూపాయల వజ్ర వైఢూర్యాలు కలవన్న చరిత్ర ఆధారంగా పలు మార్లు దేవాలయంపై దాడులు జరిగాయి. నందుల విగ్రహాల చెవులలో వజ్రాలు ఉన్నాయని, సుమారు 2 నందుల చెవులు దుండగులు పగుల గొట్టారు. మూడు దశాబ్ధాల క్రితం త్రిపురాంతకేశ్వర లింగాన్ని దుండగులు పగుల గొట్టగా కంచి కామకోటి పీఠాధిపతి తిరిగి ప్రతిష్ట చేశారు.
దేవాలయ ఆవరణలోని పార్వతీదేవి విగ్రహాన్ని 1980వ సంవత్సరంలో పెకిలించగా 1981లో త్రిపురాంతకం చెరువులోని బాల త్రిపుర సుందరీ దేవి విగ్రహాన్ని నేలమట్టం చేశారు. 1984లో కుమారాద్రి గిరిపై ధ్వజస్థంభం మీద ఉన్న నందిని దొంగిలించి తీసుకెళ్లారు. 1986 నవంబరులో ధ్వజస్థంభం పెకిలించి గోతులు తీశారు. అదే సంవత్సరం అక్టోబరు నెలలో గణపతి విగ్రహం పెకిలించి కిందకు తవ్వారు. ఆలయానికి చెందిన సుమారు లక్షాయాభై వేల రూపాయల విలువైన వెండి పళ్లాలు, చెంబులు, గరిటెలు దొంగలించారు. ధ్వజస్థంభం రాగిరేకును టూబ్‌లైట్లను సైతం అప్పట్లో ఎత్తుకుపోయారు. 30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. నేటికీ పోలీసులు వాటి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దుండగులు అనేక మార్లు తవ్వకాలు జరిపి అనేక రకాల శిల్ప సంపదను ఇక్కడి నుంచి తరలించారు. అర్థశతాబ్ధి చరిత్ర గల ప్రాచీన వస్తువుల వివరాలు పురావస్తు శాఖ అధికారులు నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ ఇంతటి చరిత్రగల ప్రాచీన విగ్రహాలను నమోదు చేసుకోకపోవడం విచారం కలిగించే అంశం.
ఆలయానికి 400 ఎకరాల పైబడి భూమి ఉండగా 190 ఎకరాల భూమి ఒక మాజీ ధర్మకర్త సొంత ఆస్థిగా మార్చుకున్నారు. 1939లో వీర మేడపి గ్రామస్తులైన కంచుపాటి కోటయ్య, గుర్రం పేరయ్యలకు ఆ భూమి ఆయన అమ్మగా 1970 సంవత్సరంలో దేవదాయ, దర్మదాయ శాఖ అతనిపై కేసు పెట్టింది. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. ఇవి కాక మరో 190 ఎకరాల భూమి నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఉంది. 10 ఎకరాలు సాగర్ కాలువ తవ్వకాల్లో పోగా మిగతా భూమి ఒక్కచోట కాకుండా కొత్తపాలెం, కంకణాలపల్లె, మిట్టపాలెం, రాజుపాలెం, మేడపి గ్రామ ప్రాంతాల్లో ఉంది.
ప్రస్తుతం దేవస్థానానికి ఉన్న భూమిలో 16 ఎకరాలు మోత కాపుల కింద, 16 ఎకరాలు పూజారు కింద 10 ఎకరాలు రజకుల కింద, మిగతా భూమి కుమ్మరుల కింద ఉంది. భూములపై తక్కువ ఆదాయం రావటానికి భూముల వేలంపాటలో దేవదాయ ధర్మదాయ శాఖ ఉద్యోగుల అక్రమాలే కారణమని ఆయా గ్రామాల వారు తెలిపారు. దేవాలయంలో వార్శికంగా దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల వద్ద టిక్కెట్ల రూపంలో సుమారు కోటి రూపాయలయ వరకు ఆదాయం వస్తుంది. కార్తీక మాసం, మహా శివరాత్రికి దేవాలయ అలంకరణ, పరిశుభ్రతకు కొంత ఖర్చుచేస్తారు. ఇరవై లక్షల వరకు సిబ్బంది జీతాలు, ఉత్సవాలకు ఖర్చవుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, కళాబంధు టి సుబ్బరామిరెడ్డి దేవాలయంలో నీళ్ల ట్యాంకు నిర్మించి కింది భాగంలో తాగునీటి బోరు వేయించారు. మేనేజ్‌మెంట్ అలసత్వం వల్ల నీరు పైకి చేరని పరిస్థితి ఏర్పడింది. కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలో దేవాలయం వద్దకు చేరుకునేందుకు కొండపైకి రోడ్డు వేయించారు.
30 ఏళ్ల క్రితం దేవదాయ శాఖ మంత్రిగా పనిచేసిన దామచర్ల ఆంజనేయులు నేతృత్వంలో దేవాలయాన్ని శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు పరిధిలోకి తీసుకొచ్చారు. కొంతకాలం వరకు బాగానే నడిచింది. శ్రీశైలం దేవస్థానం వారు త్రిపురాంతకేశ్వరునికి వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి శ్రీశైలం దేవస్థానం నుంచి వచ్చే ఆదాయంతోనే దేవాలయ అర్చకుల జీతాలు, ఇతర ఖర్చులు భరించారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు యాజమాన్యం నుంచి విడదీసి స్వతహాగా దేవాలయాన్ని తామే నిర్వహించుకుంటామని, ఒక బోర్డును ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలోనే ప్రస్తుతం నడుస్తోంది. బ్యాంకులో ఉన్న కోట్ల రూపాయల్లో కొంత మొత్తం డ్రాచేసి ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నారే తప్ప అక్కడ అభివృద్ధి అంటూ పెద్దగా కనిపించలేదు. ఇప్పటి రెండు బోర్డులు మారి మూడో బోర్డు సభ్యులు పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం అనేక మంది దాతలు దేవాలయం పైన బాగు చేయించారు. రోడ్డు కూడా దాతల సాయంలో మరింత బాగుపడింది. ముఖద్వారం కూడా పూర్తయింది.
త్రిపురంతకేశ్వరునికి కింది భాగంలో చెరువు ఉంది. ఆ చెరువులో బాలత్రిపుర సుందరీ ఆలయంలో అమ్మవారు నిర్గుణాకారంలో కొలువుదీరి ఉంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం వెనక్కి తిరిగి ఉన్నట్లుగా ఓ శిలా రూపంలో మాత్రమే కనిపిస్తుంది. అందుకే భక్తుల దర్శనార్థం మరో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించడంతో రెండు విగ్రహాలకూ భక్తులు పూజలు చేస్తారు. శ్రీశైలం కంటే అతి ప్రాచీనమైన ఆలయంగా భావించే ఈ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు వెలసిన పురాణ కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది.
పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను, రుషులను బాధించడంతో అంతా కలిసి పరమేశ్వరుడితో మొరపెట్టుకుంటారు. దాంతో కుమారస్వామి అసురుడిని సంహరించి అలసిపోయి ఈ పర్వతంపై విశ్రాంతి తీసుకున్నారట. అందుకే ఈ శిఖరానికి కుమారాద్రిగిరి అని పేరు వచ్చిందని చెబుతారు. అయితే తండ్రి మరణాన్ని తట్టుకోలేక తారకాసురుడి ముగ్గరు కుమార్తెలైన త్రిఇపురాసురులు (తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు దేవతలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశారు. చివరకు బ్రహ్మదేవుని అనుగ్రహంతో ఎవరిచేతిలోనూ మరణం లేకుండా వరం పొందుతారు. ఆ తరువాత ముల్లోకాల్లో దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. పరమేశ్వరుడు వారిని సంహరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చెబుతుంటారు. చివరకు స్వామి పరదేవతను ప్రార్థించడంతో అమ్మవారు బాలత్రిపుర సుందరిగా ఆవిర్భవించింది. అలా శివుడు అమ్మవారి సాయంతో త్రిపురాసురులను సంహరించారనేది కథ. అందుకే స్వామికి త్రిపుర హంతకుడు అనే పేరు వచ్చిందని, క్రమంగా త్రిపురాంతకుడిగా పేరు మారిందని కథ. స్వామి పేరునే ఈ ఊరిపేరు త్రిపురాంతకం అయిందని పూర్వీకులు చెబుతారు. అమ్మవారు కూడా స్వామివారితో పాటు ఇక్కడ బాల త్రిపుర సుందరిగా కొలువు దీరింది. ఒకప్పుడు ఈ ఆలయం నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు సొరంగ మార్గం ఉండటంతో మునులు ఆ మార్గానే ఉపయోగించుకునేవారనని ప్రతీతి.
త్రిపురాంతకానికి వచ్చే భక్తులు ముందుగా కొండపైనున్న పరమేశ్వరుడిని సందర్శించుకుంటారు. ఆ తరువాత కొండ దిగువన చెరువు మధ్యలో ఉన్న అమ్మవారిరి దేవస్థానికి వెళతారు. అమ్మవారి దర్శనం అయ్యక చిన్నమస్తాదేవిని, కదంబ వృక్షాన్నీ భక్తులు పూజిస్తారు. ఇక్కడికి వచ్చి పూజలు చేసి కదంబ వృక్షానికి ముడుపులు కడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి సోమ, శుక్రవారాల్లో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహా శివరాత్రిరోజు కళ్యానోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి జరిపే ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తులు చూసి తరిస్తారు. భక్తులు విజయవాడ వైపు నుంచి రైళ్ల ద్వారా రావొచ్చు. వినుకొండలో దిగి అక్కడి నుంచి బస్సుల్లో చేరుకోవచ్చు. కర్నూలు, హైదరాబాద్, అనంతపురం నుంచి వచ్చేవారికి రైళ్లు, బస్సుల ద్వారా చేరుకునే సౌకర్యం ఉంది. అమ్మవారికి పది నవరాత్రుల సందర్బంగా ప్రత్యేక అలంకరణలు ఉంటాయి.
Next Story