ఈ ఎమ్మెల్యే మాకొద్దు!
x

ఈ ఎమ్మెల్యే మాకొద్దు!

ఏపీలో ఒక నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యే. ఆయన అరాచకాలు మేము భరించలేమంటూ సీఎంను ఆశ్రయించారు నియోజవర్గ టీడీపీ నాయకులు.


అధికారం రాగానే కొందరికి కన్నూ.. మిన్నూ కానరాదంటారు. అటువంటి జాబితాలోకి చేరారు ఈ ఎమ్మెల్యే. ఆయన అమరావతిలో తెలుగుదేశం పార్టీ తరపున అమరావతి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకునిగా గడిచిన ఐదేళ్లు ఉద్యమంలో పాల్గొన్నారు. ఎస్సీ కమ్యునిటీకి నాయకత్వం వహించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు అండగా నిలిచి పోరాటాల్లో పాల్గొన్నారు. అందుకు కృతజ్ఞతగా చంద్రబాబునాయుడు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించారు. 20 సంత్సరాల తరువాత మొదటి సారిగా టీడీపీ తిరువూరులో గెలిచింది. అందులోనూ ఆయన ఎవరో తెలియకుండా అక్కడి ప్రజలు గెలిపించారు. నిజానికి తిరువూరు సీటు ఆయనకు కేటాయించే వరకు ఆయన గురించి నియోజకవర్గ ప్రజలకు తెలియదు. జగన్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తిరువూరు నియోజకవర్గంలో టీడీపీకి బాగా కలిసొచ్చింది.

మట్టి, ఇసుక అమ్ముకుంటున్నాడు..
ఈ ఎమ్మెల్యే పేరు కొలికపూడి శ్రీనివాసరావు. మొదటి సారి తిరువూరు నుంచి విజయం సాధించారు. తిరువూరులో కమ్మ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు టిక్కెట్‌ వరించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇదే శాపమైందని తిరువూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఎమ్మెల్యే మట్టి, ఇసుక అమ్ముకుంటున్నాడని ఎ కొండూరు మండల ఆంధ్రజ్యోతి విలేకరి చెన్నారావు ఒక వార్త రాశారు. ఈ వార్త చూసిన ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోతూ రేయ్‌.. నేనంటే ఏమనుకుంటున్నావో.. గుడ్డలు ఊడదీసి కొడతా... ఇసుక, మట్టి తవ్వుకుంటే నీకేంట్రా బాధ అంటూ ఊగిపోయారు. దీంతో విలేకరి బెంబేలెత్తిపోయారు. ఈయనతో ఎప్పుడూ ఒక 20 మంది స్నేహితులు (హైదరాబాద్‌కు చెందిన వారు) ఉంటారు. ఎమ్మెల్యే మందీ మార్బలంతో వస్తున్నారని తెలియగానే స్థానికులు ఇండ్లలోకి వెళ్లి తలుపులు మూసుకునే పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
సీఎంను కలిసిన జర్నలిస్ట్‌ సంఘాలు
విలేకరిపై జరిగిన దౌర్జన్యాన్ని సీరియస్‌గా తీసుకున్న జర్నలిస్ట్‌ సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి అర్జీ ఇచ్చారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జర్నలిస్ట్‌ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ జరిగిన సంఘటన తన దృష్టిలో ఉందని, ఆలోచన చేస్తున్నామని, త్వరలో తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. జర్నలిస్టులకు అండగా తమ పార్టీ ఉంటుందని, విలేకరులు ఎవరూ అధైర్య పడొద్దన్నారు. సీఎంతో పాటు మిగిలిన నాయకులను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యజెఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, కె వెంకట్రావు, ఏపీఎంపీఏ ఎన్‌టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు బొడ్డు విజయ్‌బాబు, ఉపాధ్యక్షుడు మరకాల గోపిలు ఉన్నారు.
సర్పంచ్‌ భార్య ఆత్మహత్యయత్నం
తిరువూరు నియోజకవర్గంలోని చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్‌ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై మనస్థాపానికి గురైన తుమ్మలపల్లి శ్రీనివాసరావు భార్య కవిత ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మించి చనిపోవాలనుకుంది. సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రికి తరలించారు. దంతో ఆమె ప్రణాపాయం నుంచి బయటపడింది. దీంతో నియోజక వర్గంలో ఎమ్మెల్యే తీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. శాసన సభ ఎన్నికల సందర్బంగా సర్పంచ్‌ తుమ్మలపల్లి శ్రీనివాసరావు చిట్యాలలో తన శాయశక్తుల కృషిచేసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ తీసుకు రాగలిగారు. దీంతో తుమ్మలపల్లి ఎమ్యెల్యేకు మంచి అనుచరుడని అందరూ భావించారు. అయితే సర్పంచ్‌ను చిట్యాలలో పేకాట క్లబ్‌లు నిర్వహించేందుకు నేను అనుమతి ఇచ్చానని, నాకు డబ్బులు ఇవ్వకుండా ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యే అడ్డం తిరిగారు. పైగా సర్పంచ్‌ గ్రామమైన చిట్యాల వెళ్లి సర్పంచ్‌ శ్రీనివాసరావుకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. నువ్వు పేకాట నిర్వహించాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి. లేకుంటే నీ గుడ్డలు ఊడదీసి కొట్టడంతో పాటు కాళ్లు విరగ్గొడతానని తన అనుచరులతో కలిసి చిట్యాలలోని ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో సర్పంచ్‌ భార్య కవిత బిత్తరపోయింది. సర్పంచ్‌ ఇంటి ముందు ఎమ్మెల్యే చేసిన వీరంగం, ఆయన అనుచరులు సుమారు 20 అన్న మాటలు, చంపడం ఖాయమని సర్పంచ్‌ భార్య భావించారు. వారి చేతుల్లో చచ్చేకంటే తనకు తాను చావడం మంచిదని ఆమె భావించారు. సర్పంచ్‌ భార్య ఆత్మహత్యాయత్నం నియోజకవర్గంలోని పలువురి హృదయాలను కదిలించింది. ఆమెను వెంటనే విజయవాడలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు నిలబడ్డాయి. ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయి. అవి నిరూపణ కాలేదు.
టీడీపీ అధిష్టానం విచారణ
తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో చెడ్డపేరు తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయని భావించిన తెలుగుదేశం పార్టీ విచారణ చేపట్టింది. టీడీపీ కేంద్ర కార్యాలయ కాల్‌ సెంటర్‌ నుంచి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై ఫోన్‌కాల్స్‌ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులందరికీ వెళ్లాయి. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది. అందరినీ కలుపుకుని వెళుతున్నారా? లేదా అనే అంశంపై ప్రశ్నలు వేశారు. చిట్యాల సర్పంచ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? అంటూ ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. తిరువూరు, ఎ కొండూరు, విసన్నపేట, గుసలగూడెం మండలాలకు చెందిన ముఖ్యనాయకులకు ఫోన్‌లు చేసి ఎమ్మెల్యే పనితీరు గురించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే కొలికపూడి లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడా?
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గ ప్రజలు విజయవాడలోని ఆయుష్‌ వైద్యశాల ముందు ఆందోళన చేశారు. ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడిందంటే దాని వెనుక లైంగిక వేదింపులు కూడా ఉన్నాయని టీడీపీ నియోజకవర్గ నాయకులు చెప్పడం విశేషం. ఆయన ఎవరో మాకు తెలియదు. చంద్రబాబునాయుడు మీ నియోజకవర్గ అభ్యర్థి అన్నారు. ఆయనను ఎన్నికల్లో గెలిపించాము. ఇంత దుర్మార్గుడని ఇప్పుడు తెలిసిందంటూ ఆందోళనలో పొల్గొన్న మహిళలు, పురుషులు చెప్పడం విశేషం. కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తిరువూరు నియోకజవర్గానికి చెందిన 35 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. కొలికపూడి ఉంటే నియోజకవర్గంలో పార్టీ బతికే అవకాశం లేదని చెప్పారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌ను నియమించాలని కోరారు. ఆయన దోపిడీ, అరాచకాలను ప్రశ్నించినందుకు 30 ఏళ్లుగా పార్టీకోసం పనిచేసిన వారిని లక్ష్యంగా చేసుకుని వేదిస్తున్నారని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారిలో బోయపాటి సునీత, అనుమోలు వెంకటేశ్వరావులు ఉన్నారు. వీరు మీడియాతో మాట్లాడుతూ వెంటనే ఎమ్మెల్యేను నియోజకవర్గంలో ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆదేశించాలని టీడీపీ అధ్యక్షుడిని కోరినట్లు చెప్పారు.
మైలవరం ఎమ్మెల్యే వసంతకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు
తిరువూరులో జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న చంద్రబాబునాయుడు తిరువూరు ఎమ్మెల్యేను పక్కన బెట్టి ఇన్‌చార్జ్‌ను నియమించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ మేరకు వసంతకు ఆదివారం చెప్పారు. సోమవారం నుంచి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు కోరినట్లు సమాచారం. కొలికపూడి ఈ మూడు నెలల కాలంలో ఎటువంటి అరాచకాలు చేశాడో వాటిపై నివేదిక ఇవ్వాలని కూడా కృష్ణప్రసాద్‌ను పార్టీ ఆదేశించినట్లు తెలిసింది.
Read More
Next Story