సుప్రీమ్ మొట్టికాయలతో డిఫెన్స్‌లో పడ్డ బాబు: ఎలా సమర్థించుకుంటారో!
x

సుప్రీమ్ మొట్టికాయలతో డిఫెన్స్‌లో పడ్డ బాబు: ఎలా సమర్థించుకుంటారో!

సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యలతో వైసీపీకి నెత్తిన పాలు పోసినట్లుగా అయింది. ఆ పార్టీ నేతలకు కోర్టు వ్యాఖ్యలు తప్పకుండా ఎంతో ఉపశమనం కలిగిస్తాయి.


తిరుమల లడ్డు వ్యవహారంపై ఇవాళ సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యలు పది రోజులక్రితం ఏపీలో ఉన్న పరిస్థితిని ఒక్కసారిగా తారుమారు చేశాయి. ఆ సంచలన ఆరోపణతో నాడు జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్‌లో పడగా, ఇవాళ సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యలతో చంద్రబాబు శిబిరానికి పట్టపగలే చుక్కలు కనిపించేటట్లుగా ఉన్నాయి. అందులోనూ అత్యున్నత న్యాయస్థానం ఆయనను చాలా పరుషంగా విమర్శించింది. ముఖ్యమంత్రి లాంటి ఒక అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించింది. అసలు ఏ ఆధారంతో కల్తీ నెయ్యి వాడారని నిర్ధారణకు వచ్చారని అడిగింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిఉన్న ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రిలాంటి వ్యక్తి ఇలా బాధ్యతారహితంగా మాట్లాడటం అనుచితమని పేర్కొంది. చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్… దర్యాప్తును నిలిపివేయాలని సూచించింది.

సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యలతో వైసీపీకి నెత్తిన పాలు పోసినట్లుగా అయింది. ఇప్పటిదాకా తిరుపతి లడ్డు రూపంలో తమ నెత్తిపై పడిన కొండంత అభాండంనుంచి ఎలా బయటపడాలో తెలియక గిలగిలలాడుతున్న ఆ పార్టీ నేతలకు కోర్టు వ్యాఖ్యలు తప్పకుండా ఎంతో ఉపశమనం కలిగిస్తాయి. ఇక వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా వచ్చి, కోర్ట్ వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు.

మరోవైపు, సుప్రీమ్ కోర్ట్ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు ఎలా జవాబు చెప్పుకుంటారు, కోర్ట్ లేవనెత్తిన అంశాల విషయంలో ఎలా సమర్థించుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద చంద్రబాబుకు ఇది పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యానించినట్లుగా, లడ్డూ తయారీలో కొద్దో, గొప్పో కల్తీ జరిగితే, దానిని తండ్రీ కొడుకులు గోరంతలు కొండంతలుగా చూపించి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించటమే దీనికి కారణమని, పైగా ఈ ఆరోపణలతో తిరుమల వంటి ఒక ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రానికి ఉన్న పేరు ప్రఖ్యాతులకు మచ్చ పడుతుందన్న విషయాన్ని కూడా తండ్రీ కొడుకులు పట్టించుకోలేదని ఇప్పుడు విమర్శలు వినబడుతున్నాయి. గురువారంనాడు సుప్రీమ్ కోర్ట్ ఏమంటుందో చూడాల్సి ఉంది.

Read More
Next Story