బెండకాయలో ఇన్ని ఔషధగుణాలున్నాయా!!!
x

బెండకాయలో ఇన్ని ఔషధగుణాలున్నాయా!!!

బెండలో విటమిన్ ఎ, సి లతో పాటు మెగ్నీషియమ్, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే క్యాలరీలు తక్కువ, పోషక విలువలు ఎక్కువ.


“వంకాయవంటి కూరయు, పంకజముఖి సీతవంటి భామామణియున్…” అని కవి పద్యం రాస్తే రాసిఉండొచ్చుగాక. నిజానికి వంకాయ కూర తినటంవలన బాగా వాతం చేస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటారు. కానీ అటు రుచికి రుచి, ఇటు పోషక విలువలు, ఔషధగుణాలు పుష్కలంగా ఉన్న కూరలలో మునగ తర్వాత బెండకాయను ప్రముఖంగా చెప్పుకోవాలి. ఒట్టి కూరగా తిన్నా, వేరుశెనగపప్పో, జీడిపప్పో జోడించి ఫ్రై చేసినా, కొద్దిగా బెల్లంముక్క వేసి పులుసు పెట్టినా ఆ రుచి చెప్పనలవికాదు! అయితే రుచిమాత్రమేకాదు, ఎన్నో వ్యాధుల చికిత్సలో ఉపయోగపడే పోషక విలువలు, ఔషధగుణాలు బెండలో ఉన్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇంగ్లీషులో లేడీస్ ఫింగర్‌గా పిలవబడే బెండకాయకు శాస్త్రీయ నామం అబ్లెమోషుస్ ఎస్కులెంటుస్(Ablemoschus Esculentus). సాంకేతికంగా ఇది ఒక పండు. దీని మూలాలు ఇథియోపియాలో ఉన్నాయి. అక్కడ ఈజిప్టియన్‌లు 12వ శతాబ్దంలో దీనిని సాగుచేయటం ఆరంభించారు. ఇది అక్కడనుంచి మధ్య ఆసియాకు, ఉత్తర ఆఫ్రికాకు, దక్షిణ ఆసియాకు వ్యాపించింది. బెండకాయలను ప్రధానంగా ఆఫ్రికాలో, దక్షిణ ఆసియాలో ఆహారంగా తీసుకుంటారు.

పుష్కలమైన పోషక విలువలు

బెండలో ప్రత్యేకత ఏమిటంటే క్యాలరీలు తక్కువ, పోషక విలువలు ఎక్కువ. ముఖ్యంగా దీనిలోని విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తం గడ్డకట్టేటట్లు చేసే విటమిన్ కే కూడా దీనిలో పుష్కలంగా ఉంటుంది.

బెండలో విటమిన్ ఎ, సి లతో పాటు మెగ్నీషియమ్, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి. ఒక కప్పు ఉడకబెట్టిన బెండకాయలలో 35 క్యాలరీల శక్తి, 3 గ్రా. ప్రోటీన్, 0 గ్రా. కొవ్వు, 7 గ్రా. కార్బోహైడ్రేట్‌లు, 4 గ్రా. ఫైబర్, 4 గ్రా. చక్కెర ఉంటాయి.

లెక్కలేనన్ని ఔషధగుణాలు

మన శరీరంలోని కణాలకు నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్‌పై పోరాడేందుకు సహకరించేవి యాంటీ ఆక్సిడెంట్‌లు. బెండలో పోలీ ఫినాల్స్(Polyphenols) అనే యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సీలతో పాటు లెక్టిన్(Lectin) అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది మనుషులలో క్యాన్సర్ పెరుగుదలను అడ్డగిస్తుంది. రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను బెండ 63% దాకా అడ్డుకుంటుందని అధ్యయనాలలో తేలింది.

మరోవైపు బెండలోని పోలీ ఫినాల్స్ రక్తం గడ్డకట్టకుండా నివారిస్తూ గుండెజబ్బు అవకాశాలను, పక్షవాతం అవకాశాలను బాగా తగ్గిస్తుందని కూడా తెలుస్తోంది. బెండలోని యాంటీ ఆక్సిడెంట్‌లు మెదడులో ఇన్‌ఫ్లమేషన్‌ను బాగా తగ్గిస్తాయని కూడా పరిశోధనలలో తేలింది.

బెండలోని జిగురు(Mucilage) జీర్ణక్రియ సమయంలో కొలెస్టరాల్‌తో కలవటం వలన కొలెస్టరాల్ తగ్గుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరోవైపు రక్తంలో చక్కెర శాతాన్ని కూడా బెండ బాగా తగ్గిస్తుందని అంటున్నారు. జీర్ణక్రియ సమయంలో రక్తంలో చక్కెర కలవకుండా బెండ నివారిస్తుందని అధ్యయనాలు తెలిపాయి.

ఫైటో థెరపీ

ఇటీవలి కాలంలో సంప్రదాయ చికిత్సా పద్ధతులనుంచి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులవైపుకు జనం మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులలో ఫైటో థెరపీ(Phytotherapy) ఒకటి. ఫైటో థెరపీ అంటే మరేమీ కాదు… మొక్కలు, మూలికల నుంచి తీసిన పదార్థాలను చికిత్సగా వాడటం. ఈ పదార్థాలనే న్యూట్రాస్యూటికల్స్(Nutraceuticals) అంటారు. చాలా దీర్ఘకాలిక మొండి వ్యాధులలో ఈ ఫైటో థెరపీ మంచి ఫలితాలను ఇస్తోంది.

బెండలో మంచి పోషక పదార్థాలతోబాటు, ఔషధగుణాలు కూడా ఉండటంతో దీనిని ఇప్పుడు అనేక రకాల న్యూట్రాస్యూటికల్స్‌(అల్లోపతి పద్ధతిలో వాడే మందులను ఫార్మాస్యూటికల్స్ అంటారు)లో వాడుతున్నారు. బెండకాయలో ఉండే బంక(Mucilage), విత్తనాలు(Seeds), గింజలు(Pods)ను వివిధ రకాల వ్యాధులకు విరుగుడుగా వాడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, గుండెజబ్బులు, జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. డయాబెటిస్ రోగులలో బెండకాయ హైపర్ గ్లైసిమిక్ స్థాయిలను తగ్గిస్తుంది. ఎండిన బెండ ఆకులనుంచి చైనావారు తయారు చేసిన ఒక ఔషధం మూత్రపిండాల వ్యాధిలో మంచి గుణాన్ని చూబెడుతోందని తేలింది. బెండకాయలో ఉండే జిగట/బంక(Mucilage) ప్లాస్మాకు ప్రత్యామ్నాయంగా బాగా ఉపయోగపడుతోంది.

మొత్తంమీద చూస్తే, బెండకాయను తేలిగ్గా, చౌకగా దొరుకుతూ అనేక పోషక విలువలు, ఔషధగుణాలు ఉన్న కూరగాయగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. అయితే బెండకాయ యొక్క ఫార్మకో కైనెటిక్స్‌(Pharmacokinetics), బయోఎవైలబిలిటీ(Bioavailability) తదితర విషయాలపై ఇంకా లోతుగా పరిశోధనలు జరిగితే దీనిని మరింత విస్తృతంగా వైద్య చికిత్సలో వాడవచ్చని అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న రెండో అతి పెద్ద వ్యాధి క్యాన్సర్. ఎన్ని కొత్త ఔషధాలు కనుగొంటున్నా క్యాన్సర్‌ను సమూలంగా తొలగించే ఔషధం కనుగొనబడలేదు. క్యాన్సర్ కణాలకు ప్రస్తుతం దొరుకుతున్న ఔషధాలను తట్టుకునే శక్తి పెరిగిపోతుండటంతో కొత్త యాంటీ క్యాన్సర్ ఔషధాలను అత్యవసరంగా కనుగొనాల్సిన అవసరం ఉంది.

గర్భిణి స్త్రీలు బెండకాయలను ఆహారంగా తీసుకోవటంవలన గర్భస్థ శిశువుకు కావలసిన ఫోలేట్(Folate) అందటమే కాకుండా, పిండానికి మెదడు, వెన్నుపూస సరిగ్గా అభివృద్ధి చెందేటట్లు చేస్తుంది.

మరికొన్ని ఉపయోగాలు

బెండలో ఉండే పోలీశాకరైడ్స్‌(Polysaccharides)కు ఔషధ గుణాలు, ఎక్కువకాలం నిల్వ ఉండే గుణం కారణంగా దీనిని ఐస్ క్రీములవంటి ఫ్రోజెన్ ఫుడ్స్‌లో, బేకరీ ఉత్పత్తులలలో విరివిగా వాడతారు. బెండ విత్తనాలనుంచి కొందరు నూనెను కూడా తీస్తున్నారు.

అయితే డయాబెటిస్ ఉన్నవారు బెండకాయను తినేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దానికి రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించే గుణం ఉన్నప్పటికీ, డయాబెటిస్ రోగులు తీసుకునే మెట్‌ఫోర్మిన్ మందుపై అది ప్రభావం చూపే అవకాశం ఉంటుందని శాస్త్రజ్ఞులు హెచ్చరించారు.

Read More
Next Story