కష్టాల్లో  అనంతపురం వేరుశెనగ రైతు, కారణమెవరు?
x

కష్టాల్లో అనంతపురం వేరుశెనగ రైతు, కారణమెవరు?

20 ఏళ్ళలో ఎనిమిది లక్షల హెక్టార్ల నుండి 1.9 లక్షల హెక్టార్లకు పడిపోయిన అనంత వేరుశెనగ పంట


అనంతపురం జిల్లాలో వేరు శనగ రైతు సంక్షోభంలో పడ్డాడు. పంట దిగుబడి తగ్గింది. రాబడి తగ్గింది. మార్కెట్ పడిపోయింది. దీనికి తోడు విదేశాలనుంచి చౌకగా దిగుమతి అవుతున్న వంటనూనెలతో ఖరీదైన దేశీయ వేరు శనగ నూనె మార్కట్ కుదేలయింది. ఇవన్నీ కలసి అనంతపురం జిల్లా రైతుల మీద చావు దెబ్బవేశాయి. దీనితో బతుకు దెరువు కోసం ఇతర పంటలకు మారాల్సి వస్తున్నది. అయితే, ఇతర పంటల పరిస్థితి అంతే దారుణంగా ఉంది. ఒకపుడు వేరుశనగ పంటకు అనంతపురం జిల్లామారుపేరు. వర్షాధార పంట అయిన వేరుశనగ ఆరోజుల్లో కొద్ది పాటివర్షంతో కూడా పండి రైతులను ఆదుకుంది. ఇపుడు జిల్లా వేరుశనగ రైతులు ఈ అండకోల్పోయిన ఆర్థిక సంక్షోభంలో పడిపోతున్నారు.

ను హర్టీకల్చర్ హబ్ చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతోంది. అందుకు రు. 40,000 కోట్లు ఖర్చు చేస్తామని అంటోంది. మరో వైపు వున్న అరటి, చీనీ తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. కరువుకు మారుపేరుగా వున్న జిల్లా వేరుశెనగ పంటకు కేంద్రంగా వుంది. అయితే ఇటీవలి కాలంలో ఆ పంటకు అన్నీ ప్రతికూల పరిస్థితులే.ఫలితంగా పంట విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2005, 2007 సంవత్సరాలలో 8.75 లక్షల హెక్టార్లలో సాగు అయిన పంట 2024-25 కు 1,94,461 ఎకరాలకు చేరింది. 2021 లో జిల్లాలో 63 మండలాలకు గాను, 62 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వచ్చినా అనంత రైతులు 1,50,000 ఎకరాలలో క్రాప్ హాలిడే ప్రకటించారు. అయితే ఆ నిరసనకు కోనసీమ లో జరిగిన క్రాప్ హాలిడే కి వచ్చిన ప్రాచుర్యం రాలేదు. ఈ పరిస్థితి కి అనేక కారణాలు వున్నాయని రైతు సంఘాలు అంటున్నాయి. నేడు పంట ప్రధానంగా వర్షాధారoగా కంటే బోరు బావుల క్రింద నీటి వసతి వున్న రైతులు పండిస్తున్నారు. వేరుశెనగ తగ్గిపోవడానికి విదేశాల నుండి యితర నూనెలు దిగుమతి కూడా కారణమే.

రైతులు చెప్తున్న కారణాలు:

పంట పెట్టుబడి విపరీతంగా పెరగడం, దిగుబడి తగ్గడం, పంటనష్టం, విత్తనాల లోపం, కనీస మద్దతు ధర లాంటి సమస్యలతో పాటు డీజల్, పెట్రోలు పెరుగుదల, రావాణా ఖర్చులు, వ్యవసాయ యాంత్రిక ఖర్చులు, పంట భీమా పూర్తిగా చెల్లించకపోవడం, ఇన్పుట్సబ్సిడీలు ఇవ్వకపోవడం, మార్కెటింగ్ సమస్యలు గుదిబండగా మారాయని రైతులు చెప్తున్నారు. యాంత్రీకరణ వల్ల పశుగ్రాసం రైతుకు అందుబాటులో వుండడంలేదని, దీనివల్ల పశువులను అమ్మివేయాల్సి వస్తుందని తెలియచెప్పారు. గతంలో ప్రభుత్వం ఇన్పుట్సబ్సిడీ ఎకరాకు రూ.12,000లు ఇచ్చేది కాని, 2018 నుండి ఇవ్వడం ఆపేసినతర్వాత రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌలురైతులు గుత్తకట్టిన తర్వాత ఏమి మిగలక పోగా అప్పులు చేయాల్సి వస్తుంది.

బోరు క్రింద 2.5 ఎకరాలలో వేరుశెనగ వేశానని చెప్తున్న నార్పాల మండలం, బండ్లపల్లి గ్రామ రైతు సి. రామకృష్ణ, “గత కొన్ని ఏళ్లుగా వర్షాలు పడటంతో మా ఊరి రైతులు ఎక్కువ మంది కూరగాయలు, పళ్ళ సాగువైపు మారారు. ఊరిలో యిప్పుడు కేవలం ¼ వ వంతు మాత్రమే వేరుశెనగ వేస్తున్నారు. కరువు పనులు కల్పించి మెరుగైన వర్షాలు పడటం వలన యివి సాధ్యపడింది. ఒకప్పుడు మా దళిత వాడ లో 80 శాతం వలసలు వెళ్లారు. ఇప్పుడు అన్ని కుటుంబాలు ఊరిలోనే వున్నాయి. వేరుశెనగ విత్తనాల కోసం మేము రాత్రి నుండి క్యూ లో నిలబడే వాళ్ళం. రైతులు లావు వేరుశెనగ రకం నీరు వుంటే పండిస్తున్నారు వాటికి రేట్ వుంది,” అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం, నీలారెడ్డిపల్లి రైతు వెంకట కొండ (60), “వంశపారపర్యంగా వచ్చిన 80 ఎకరాల భూమిలో అప్పుల బాధ ఎక్కువయి ఐదు ఎకరాలు అమ్మినాను. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్టర్లు, మా భూములు కొంటున్నారు. మంచి రేట్లు ఉన్నాయి. వ్యవసాయంలో నష్టాలు భరిస్తూ, గొడ్డు చాకిరీ చేసే దానికంటే, భూములు అమ్మి అనంతపురంలో ఇల్లు కట్టించి, బాడుగకు ఇద్దామని కుటుంబ సభ్యులు ఒత్తిడి పెడుతున్నారు,” అని చెప్పారు.

వేరుశెనగకు పేరు పడ్డ తమ గ్రామంలో వున్న ఏడు వేల ఎకరాలలో కేవలం రెండు వేల ఎకరాలే సాగుఅయ్యిందని ఆత్మకూరు మండలం, సనప గ్రామ రైతు రాజశేఖర్ రెడ్డి (22) అన్నారు. “నాలుగు సంవత్సరాల క్రితం నా తండ్రి అప్పుల బాధ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో రైతులందరం ఉపాధి పనులు ఆధారంగానే బతుకుతున్నాము, అని చెప్పారు.

పంట మార్పుకు కారణాలు:

“ప్రభుత్వం ఇన్పుట్సబ్సిడీ ఎకరాకు రూ.12,000లు ఇచ్చేది కాని, 2018 నుండి ఆపివేశారు. కౌలురైతులు గుత్తకట్టిన తర్వాత ఏమి మిగలక పోగా అప్పులు చేయాల్సి వస్తోంది. పంటలకు ప్రభుత్వాలు కనీస మద్దతు ధర ప్రకటించిన వ్యాపారస్థులు ఆ ధరకు కొనడానికి ముందుకు రావడంలేదు. అందువల్ల పంట మార్పుకు రైతులు భయపడుతున్నారు. నాశిరకం విత్తనాల సప్లయి నుండి మొదలుకొని వ్యాపారస్థులు, దళారులు, కమీషన్ ఏజెంట్ల మోసాలు, బ్యాంకు రుణాలు సులువుగా ఇచ్చే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమకు పరపతి కల్పించడం లేదని అంటున్నారు. 'ఈ'మార్కెట్ వచ్చిన తర్వాత పెద్ద మోసం జరుగుతుందని వ్యాపారులు సిండికెట్గా ఏర్పడి అన్ని డిసైడ్ చేస్తున్నారని చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధి పనుల ఆధారంగానే బ్రతకవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చదువుకున్న యువకులు వ్యవసాయంలోకి దిగిన తర్వాత నష్టాలతో విసిగిపోయి ఏ చిన్న పాటి పని, ఉద్యోగం చూసుకుంటున్నారు,” అని సోషియాలజి డిపార్ట్మెంట్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఆంధ్రప్రదేశ్, ప్రొఫెసర్. ఎన్. పురేంద్రప్రసాద్ అన్నారు.

అప్పులతో కూరుకపోయి పంటనష్టాలను భరించలేక రైతులు ఒకవైపు సతమతమవుతువుంటే మరోవైపు రియల్ ఎస్టెట్ గా మార్చేందుకు ప్రభుత్వ విధానాలు రైతులు తమ భూమిని అమ్మివేయడానికి సులువైన మార్గాలు ప్రతినిత్యం చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా రైతులు భూమి నుండి దూరం చేసే మార్గంగానే కనిపిస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పంటలు పండించే అనంత రైతులు భూమిని అమ్ముకోవడమా! లేక బీడు పెట్టడమా! అన్న సందిగ్ధంలోకి నెట్టబడుతున్నారు, అని ఆయన అన్నారు.

2021, జూలై మాసంలో జరిగిన జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో జిల్లాలో పర్యటించిన వ్యవసాయ శాస్త్రజ్ఞుల బృందం తమ నివేదికలో వేరుశనగ సంక్షోభానికి ఈ క్రింది విషయాలు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. (1) గడిచిన 18 సంవత్సరాలలో 15 సంవత్సరాలు కరువులు వచ్చినాయి (2) జిల్లాలో 90 శాతం సాగుభూమి వర్షాధారం మీదనే ఆధారపడుతున్నది (3) జిల్లాలో 70 శాతం జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు (4) అదునులో కురువని వర్షాలు (5) రైతులకు అవసరమైన పనిముట్లు అందుబాటులో లేకపోవడం (6) పెట్టుబడులు అధికం కావడం (7) చాలినన్ని భూగర్భజలాలు లేకపోవడం (8) నేలలో కర్బన సాంద్రత తగ్గిపోవడం.

జిల్లాలో వర్షపాతం:

1995 నుండి 2020 వరకు 26 సంవత్సరాల గణాంకాలను విశ్లేషిస్తే 6 సంవత్సరాలు 700+మి.మీటర్ల వర్షపాతం, 5 సంవత్సరాలు 600+ మి.మీటర్ల వర్షపాతం, 5 సంవత్సరాలు 500+ మి.మీటర్ల వర్షపాతం, 4 సంవత్సరాలు 400 +మి.మీటర్ల వర్షపాతం, 6 సంవత్సరాలు 300+ మి.మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సాధారణంగా వర్షాధారం కింద పంటలు పండడానికి 750 మి.మీ. వర్షపాతం కావాల్సి ఉంటుందని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. 6 సంవత్సరాలు మాత్రమే 700 మి.మీ. మించిన వర్షపాతం నమోదు అయ్యింది. ఈ వర్షపాతం కూడా 25 రోజుల విరామానికి మించకుండా 5 - 6 వర్షాలు కురవాలి. 15-18 వారాలు బెట్ట లేకుండా వర్షాలు రావాలి.

నిపుణులు, కార్యకర్తలు ఏమంటున్నారు:

వర్షాధారం కిందట సాగయ్యే వాణిజ్య పంటలలో వేరుశనగకు బెట్టకు తట్టుకొనే సామర్థ్యం ఎక్కువ. మిగతా పంటలకు ఈ స్వభావం తక్కువ. వేరుశనగ కట్ట కూడా పశువులకు పుష్టికరమైనది. పాలిచ్చే పశువులకు వేరుశెనగ కట్టే ప్రధాన మేతగా ఉపయోగపడుతుంది. వర్షాధారంతో ఒక్క ఖరీఫ్ లో మాత్రమే పంటలు పండుతాయి. మారిన సామాజిక, జీవన అవసరాలు, కుటుంబ ఖర్చులు, వంట పెట్టుబడులు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, వైద్య ఖర్చులు, ఇతరత్రా కుటుంబ ఆచారాలు అన్నింటి మీద రైతు అవసరాలు పెరిగినాయి. వీటన్నింటికీ అవసరమైన ఆదాయం కోసం రైతు వాణిజ్య పంటలు వేసి తారాలి. అనంతపురం జిల్లా వాతావరణానికి తగిన విధంగా ఇంతవరకూ ఒక్క వేరుశనగ మాత్రమే రైతుకు తోడ్పడుతూ వచ్చింది. వర్షాధారంతో పండే చిరుధాన్యాలు పంటలతో మాత్రమే రైతుల అవసరాలు తీరవు. పండిన వాటికి మార్కెట్ సమస్యతో తక్షణం రైతుకు డబ్బులు వచ్చే సౌలభ్యం ఉండదు., అని సిపిఎం జిల్లా రైతాంగ నాయకులు వి. రాంభూపాల్ అన్నారు.

వ్యవసాయం నుండి తగినంత ఆదాయం రావటంలేదు అని చెప్తూ, “కుటుంబ సభ్యులలో చదువుకొని ఉద్యోగాలు చేసేవారు. చేతి వృత్తుల మీద జీవనాధారం ఏర్పరుచుకున్నవారు, ఉపాధిహామీ పథకం కింద పని చేస్తూ వచ్చిన ఆదాయాలను వ్యవసాయంలో పెట్టుబడులుగా ఉపయోగిస్తున్నారు. గ్రామాలలో భూమి కలిగి ఉండటం, వ్యవసాయం చేయడం కుటుంబ మర్యాదలుగా భావించడం వల్లనే ఈ జిల్లాలో వ్యవసాయం ఇంకా నిలబడి ఉంది,” అన్నారు.

“ఇంధన ధరల కారణంగా పెరిగిన పెట్టుబడులు పెట్టుబడులకు అదనంగా 50 శాతం జోడించాలన్న స్వామినాథన్ సిఫార్సు ప్రకారం హెక్టారుకు 1200 కేజీలు వేరుశనగ దిగుబడి వస్తే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. జిల్లాలో వేరుశనగ దిగుబడి పరిశీలిస్తే 26 సంవత్సరాల గణాంకాలలో కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే మంచి దిగుబడి వచ్చింది. మిగతా 21 సంవత్సరాలు సగటున 75 కేజీల నుంచి 711 కేజీల వరకు నమోదయింది. 21 సంవత్సరాలు రైతుకు రావాల్సిన ఆదాయంతో పాటుగా పెట్టుబడులు కూడా నష్టపోతూనే ఉన్నాడు, అని జిల్లాలో కరువు, రైతు ఆత్మహత్యల పైన పనిచేసిన సామాజిక కార్యకర్త ఎస్. ఎం. భాష అన్నారు.

ఖరీఫ్ లో వేరుశెనగ దిగుబడి అనిశ్చితంగా ఉంటుంది. రబీ లో దిగుబడి బాగున్న పెరిగిన ఖర్చుల వలన రైతులు హర్టీకల్చర్ వైపు మళ్ళారు. కనోలా, సోయా లాంటి నూనెలు తక్కువ ధరకు వస్తున్నాయి. తక్కువ ధరలకు నూనెలు దిగుమతి అవుతున్నంత వరకు మన నూనె గింజలకు తగిన రేటు రాదు మన పంట విస్తీర్ణం పెరగదు, అని ఎ. అమరేందర్ రెడ్డి, ఐసిఎఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ (ICAR-National Institute Of Biotic Stress Management) వివరించారు.

పెరుగుతున్న నూనె దిగుమతులు:

వంట నూనెల దిగుమతులు పెరుగుతున్న విషయాన్ని కేంద్రం ఆగస్టులో జరిగిన పార్లమెంటు సమావేశాలలో స్పష్టం గా ఒప్పుకుంది. స్థానిక పంట ఉత్పత్తి పెరుగుతున్న జనాభా, మెరుగవుతున్న వారి జీవన పరిస్థితుల వలన వీటి దిగుమతులు పెరుగుతున్నట్టు అది చెప్పింది. మన అవసరాలకు 56 శాతం దిగుమతుల మీదే ఆధార పడినట్టు అది చెప్పింది. ఇండోనేషియా, మలేషియా నుండి పామ్ ఆయిల్ దిగుమతి అవుతుండగా, సోయాబీన్ ఆయిల్ అర్జెంటీనా, బ్రెజిల్ లనుండి వస్తున్నట్టు చెప్పింది. ప్రొద్దుతిరుగుడు నూనె మాత్రం ఉక్రైన్, రష్యా, అర్జెంటీనాలలో నుండి వస్తోంది.

పరిస్థితి యిలా వుండగా స్థానిక నూనె గింజల ఉత్పత్తికి ఊతం యివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం పామ్ ఆయిల్, సోయాబీన్, ప్రొద్దుతిరుగుడు నూనెల పైన దిగుమతి సుంకాలను 20 శాతం మేర తగ్గించినట్టు చెప్పింది. ప్రతి ఏటా వాటి దిగుమతులు పెరుతున్నాయి.

సంవత్సరం (ఆర్థిక సంవత్సరం) దిగుమతి అయిన సరుకు (లక్షల టన్నులలో)

2020-21 137.96

2021-22 146.66

2022-23 159.63

2023 -24 157.09

2024-25 166.63

2025-26 (ఏప్రిల్ నుండి జూన్ 2025 నాటికి) 37.74

మూలం: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్

బిజెపి కోరుకుంటున్న కార్పోరేటు వ్యవసాయం జరగాలంటే రైతులు భూములనుండి ఖాళీ చేయాలి. అది జరగాలంటే వ్యవసాయం వరుస నష్టాల్లో కూరకపోవాలి. కుటుంబజీవనానికి, కనీస అవసరాలకు అప్పులపై ఆధారపడే పరిస్థితి పెరగాలి. రైతు సాగు చేయడం నిలిపివేయాలి. అప్పుడే వ్యవసాయ భూములు తక్కువధరకు లభ్యం కావడం, అత్యధిక జనాభా కూలీలుగా మారడం జరుగుతుంది. ఇందుకోసం జరుగుతున్న కుట్రలో భాగమే నేడు తగ్గుతున్న వ్యవసాయ సాగు. "వ్యవసాయం వుంటుంది. కాని రైతులు చేసే వ్యవసాయం కాదు, కార్పోరేట్లు చేసే వ్యవసాయం వుంటుంది. దేశం వుంటుంది కాని ఆ దేశానికి వెన్నముక అయిన రైతు మాయమైపోతున్నాడు." రైతు వ్యతిరేక, కార్పోరేటు అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుండా వ్యవసాయ సాగును పెంచలేము, అని వి.రాంభూపాల్, అనంతపురం జిల్లా రైతు నాయకులు తన ఆవేదన వ్యక్తం చేశారు.

Read More
Next Story