జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో పోలీసులు ఓవర్‌యాక్షన్ చేశారా?
x

జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో పోలీసులు ఓవర్‌యాక్షన్ చేశారా?

ఫామ్ హౌస్‌లో అనుమతులు లేని 7 లీటర్ల విదేశీ మద్యం సీసాలు దొరికాయని చెప్పారు. శనివారం రాత్రి జరిగినది రేవ్ పార్టీ అని అధికారులు ఎక్కడా చెప్పకపోవటం ఇక్కడ గమనార్హం.


జన్వాడ ఫామ్‌హౌస్‌లో అసలు శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగిందా, లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నిన్న ఉదయం నుంచి మీడియాలో, అదీ ముఖ్యంగా బిగ్ టీవీ(ఇది రేవంత్‌దని అంటారు)లో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని, డ్రగ్స్ పట్టుబడ్డాయని, కేటీఆర్, ఆయన భార్య చివరి నిమిషంలో జంప్ అయ్యి తప్పించుకున్నారని పెద్ద హడావుడి చేశారు. తీరా సాయంత్రానికి చూస్తే డ్రగ్స్ దొరకలేదని, ఒక వ్యక్తి మాత్రం డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని ఎక్సైజ్ పోలీసులు తేల్చారు.

తెలంగాణ రాజకీయాలు ఇటీవలి కాలంలో చాలా హాట్ హాట్‌గా నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడు ప్రధాన పార్టీల నాయకులూ చాలా దారుణంగా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, పరువునష్టం దావాలు వేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో నిన్న ఉదయం జన్వాడలో కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని వార్తలు రావటం మొదలయింది. బిగ్ టీవీవాళ్ళయితే ఉదయంనుంచి సాయంత్రందాకా ఆ వార్త తప్పితే ఇంకేమీ చూపించలేదు. దానికితోడు ప్రతి చిన్న విషయంపై ట్వీట్ చేసే కేటీఆర్ దీనిపై సాయంత్రందాకా మౌనంగా ఉండటంతో ఏదో జరిగిందేమో అని అనుమానానికి తావిచ్చినట్లయింది. ఇదే అదనుగా కాంగ్రెస్ నాయకులు కేటీఆర్‌పై చెలరేగిపోయారు. డ్రగ్ కల్చర్‌కు తాను వ్యతిరేకమన్న కేటీఆర్ ఇప్పుడు ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని గతంలో ఆరోపణలు చేసిన బండి సంజయ్ కూడా ఉత్సాహంగా రంగంలోకి దిగి వీడియో బైట్ రిలీజ్ చేశారు. సుద్దపూసనన్న కేటీఆర్ ఇప్పుడేమంటారని అడిగారు. సాక్షాత్తూ డ్రగ్ తీసుకుంటుండగా దొరికినా, లేదని బుకాయిస్తాడేమోని అన్నారు. ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావేమో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ కుమ్మక్కయ్యారేమోనని అనుమానంగా ఉందని, పోలీసులు తక్షణమే సీసీ టీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

సాయంత్రానికి ఈ వ్యవహారంపై ఒక స్పష్టత వచ్చింది. ఎక్సైజ్ పోలీసులు అధికారికంగా దీనిపై స్పందించారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో అనుమతులు లేని 7 లీటర్ల విదేశీ మద్యం సీసాలు దొరికాయని, ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నిర్వహించారని చెప్పారు. రాజ్ పాకాల అందుబాటులో లేరుకాబట్టి పరారీలో ఉన్నట్లుగా భావిస్తున్నామని తెలిపారు. శనివారం రాత్రి జరిగినది రేవ్ పార్టీ అని అధికారులు ఎక్కడా చెప్పకపోవటం ఇక్కడ గమనార్హం.

ఉదయం మల్లారెడ్డి మనవరాలి వివాహానికి హాజరైన కేటీఆర్ సాయంత్రం ఈ వ్యవహారంపై స్పందించారు. తన బావమరిది రాజ్ పాకాల ఇటీవల కొత్త ఇల్లు గృహప్రవేశం చేశారని, ఈ సందర్భంగా దావత్ ఇస్తే దానిని రేవ్ పార్టీ అంటూ పోలీసులు పథకం ప్రకారం దాడి చేసి శనివారం రాత్రి హంగామా సృష్టించారని ఆరోపించారు. అది అసలు ఫామ్ హౌస్ కాదని, ఇల్లని చెప్పారు. పార్టీలో ఉన్న ఆడవాళ్ళు, చిన్న పిల్లలకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలని పట్టుబట్టారని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో నెదర్లాండ్స్ నుంచి వచ్చిన విజయ్ మద్దుకూరి అనే అతను అక్కడి రూల్స్ ప్రకారం కొంత కొకైన్ తీసుకున్నాడని, అతనికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మరోవైపు విజయ్ మద్దుకూరి తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తాను చెప్పని మాటలను ఎఫ్ఐఆర్‌లో పోలీసులు నమోదు చేశారని ఆరోపించారు. అక్కడ అక్రమ కార్యకలాపాలు ఏమీ జరగలేదని అన్నారు. తాము కొద్ది రోజుల క్రితమే ప్రపంచ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చామని, వాటి ఆధారాలను కూడా పోలీసులకు చూపామని తెలిపారు. తాను అమెరికన్ సిటిజన్‌ను అని, 30 ఏళ్ళకు పైగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నానని చెప్పారు.

రాష్ట్రంలో త్వరలో రాజకీయ బాంబు పేలబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తే జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం రాజకీయ కుట్రేమో అన్న అనుమానం కలగకుండా పోదు. ఇటీవలి కాలంలో ఈ రాజకీయ కుట్రలు రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పెరిగాయి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా హయాంలో ఇలాంటి రాజకీయ కుట్రలు చాలా జరిగాయి. నిజంగా అక్కడ నేరం జరిగిఉండి పోలీసులు కేసు నమోదు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందిగానీ, నేరం జరగకపోయినా కక్ష సాధింపుకోసం తప్పుడు కేసులు బనాయిస్తే అవి ప్రతికూల ప్రభావం చూపుతాయని ఏపీలో నిరూపించబడిన సంగతి తెలిసందే. రేవంత్ ప్రభుత్వం దీనిని గమనించాలి.

Read More
Next Story