ప్రత్యేకహోదాకు నో ఛాన్స్: ఏపీ ప్రజల ఆశలపై మళ్ళీ నీళ్ళు జల్లిన మోది!
x

ప్రత్యేకహోదాకు నో ఛాన్స్: ఏపీ ప్రజల ఆశలపై మళ్ళీ నీళ్ళు జల్లిన మోది!

ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని నిలబెడుతున్నది ఏపీలోని తెలుగుదేశం-జనసేన, బీహార్‌లోని జేడీయూనే కావటంతో ఏపీ ప్రజలలో ప్రత్యేక హోదా ఆశలు చిగురించాయి. ఆ ఆశలు అడియాశలే అయ్యాయి.


ప్రత్యేకహోదాపై ఏపీ ప్రజల ఆశలపై మోది మళ్ళీ చెంబుడు నీళ్ళు గుమ్మరించారు. ఇటీవలి ఎన్నికల తర్వాత కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని నిలబెడుతున్నది ఏపీలోని తెలుగుదేశం-జనసేన, బీహార్‌లోని జేడీయూనే కావటంతో ఏపీ ప్రజలలో మళ్ళీ ప్రత్యేక హోదా ఆశలు చిగురించాయి. అయితే ఆ ఆశలను అడియాసలు చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టంగా ఒక ప్రకటన చేసింది.

కూటమికి మద్దతిస్తున్న జేడీయూ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రామ్‌ప్రీత్ మండల్ ఇవాళ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చారు. గతంలో కొన్ని రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదాను మంజూరు చేసిందని, అయితే దానికోసం ఆ రాష్ట్రాలు కొన్ని ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాలని తెలిపారు. 2012 మార్చి 30న మంత్రుల మండలి బీహార్‌కు ప్రత్యేకహోదాపై నివేదిక సమర్పించిందని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వటానికి అనుసరించే నిబంధనావళికి బీహార్ సరిపోలేదని మంత్రుల మండలి తన నివేదికలో పేర్కొందని తెలిపారు. ఆ కారణాలచేత బీహార్‌కు ప్రత్యేకహోదా ఇవ్వబడదు అని కుండ బద్దలు కొట్టారు.

ఏపీకి ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే బీహార్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉండేది అన్నది ఎవరూ చెప్పనక్కరలేదు.

మరి 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీతో వంతపాడినప్పుడుగానీ, 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో మోది స్వయంగా ఆ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పినప్పుడుగానీ ఈ మంత్రుల మండలి నివేదిక గురించి బీజేపీకి తెలియదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

మరోవైపు తెలుగుదేశం అధినేత ప్రత్యేకహోదాకోసమో, దేనికోసమో గానీ, మంత్రివర్గ కూర్పు సమయంలో కూడా మంత్రుల సంఖ్య గురించిగానీ, కీలక పోర్ట్‌ఫోలియోల గురించిగానీ మోదిపై ఒత్తిడి తీసుకురాలేదు. పైగా, ఫలితాలు వెలువడగానే ప్రధాని పదవితోసహా దేనికైనా టీడీపీకి అవకాశమిస్తామని కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినా, చంద్రబాబు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. మరి ప్రత్యేకహోదాపై మోది ప్రభుత్వ స్పందన చంద్రబాబు ఇచ్చిన ఆ గౌరవానికి సముచితమైన ప్రతిస్పందనగా కనిపించటంలేదు, ఎందుకనో!

Read More
Next Story