కశ్మీర్‌: స్వల్పమెజారిటీతో కాంగ్రెస్ కూటమి విజయం, సీఎం కానున్న ఒమర్
x

కశ్మీర్‌: స్వల్పమెజారిటీతో కాంగ్రెస్ కూటమి విజయం, సీఎం కానున్న ఒమర్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నిక ఇదే కావటంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.


కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 90 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్ కూటమి ఇప్పటికే 47 స్థానాలు(41ఎన్‌సీ+6 కాంగ్రెస్) గెలుచుకుని, మరొక స్థానంలో లీడింగ్‌లో ఉంది. మరోవైపు, బీజేపీ 27 సీట్లు గెలుచుకుని మరో రెండింటిలో ఆధిక్యతలో ఉండగా, మహబూబా ముఫ్తికి చెందిన పీడీపీ పార్టీకి రెండు సీట్లు లభించాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 46.

పది సంవత్సరాల వ్యవధి తర్వాత కశ్మీర్‌లో జరిగిన ఈ ఎన్నికలలో మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలు. 2014లో ఇక్కడ జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవటంతో బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఆ సంకీర్ణ ప్రభుత్వం 2018లో కుప్పకూలిపోయింది. మరోవైపు కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నిక ఇదే కావటంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.

తమ పార్టీ అధినేత ఒమర్ అబ్దుల్లాయే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. ఒమర్ ఈ ఎన్నికలలో రెండు స్థానాలలో పోటీ చేశారు, రెండింటిలో విజయం సాధించారు. ఆయన గతంలో 2009 నుంచి 2015 దాకా కశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు, ఒకసారి వాజ్‌పేయి క్యాబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు.

ఆర్టికల్ 370 రద్దుకు కశ్మీర్ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఈ ఎన్నికలద్వారా రుజువయిందని ఫరూక్ అన్నారు. ప్రస్తుతం కశ్మీర్ అసెంబ్లీకి ఐదు రిజర్వ్ సీట్లలో ఎమ్మెల్యేలుగా నామినేట్ చేసే అధికారం ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉండటంతో ఆ విషయం ఇప్పుడు చర్చనీయాంశమయింది. లెఫ్టినెంట్ గవర్నర్ అలా నామినేట్ చేస్తే తాము సుప్రీమ్ కోర్టుకు వెళతామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ అలా ఐదుగురిని నామినేట్ చేస్తే మ్యాజిక్ ఫిగర్ 48కు చేరుతుంది.

Read More
Next Story