‘సీనియర్ లాయర్‌ను రాజ్యసభకు పంపాలని కేజ్రీవాల్ ప్లాన్ ’
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి ఘటన తర్వాత బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ను బీజేపీ అస్ర్తంగా వాడుకుంటోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీని తుడిచిపెట్టేందుకు కాషాయ పార్టీ 'ఆపరేషన్ ఝాడూ' ప్రారంభించిందని కేజ్రీవాల్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
కాగా, ఆప్ నేతల మాటలకు బిజెపి ఢిల్లీ విభాగం చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా కౌంటర్ ఇచ్చారు. మలివాల్‌పై దాడి ఘటన వెనక కాషాయ పార్టీ ప్రమేయం ఉందని ఆప్ ఎలా నిర్ధారణకు వచ్చారని బిజెపి ఢిల్లీ విభాగం చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్ సీనియర్ న్యాయవాదిని రాజ్యసభకు పంపాలనుకుంటున్నారని, అందుకే ఆయన తెరవెనక ఉండి ఈ నాటకం ఆడుతున్నారని సచ్‌దేవా పేర్కొన్నారు.
ఆప్ ఐడియాలజీ బోగస్..
‘మలివాల్ పై దాడి ఘటన ఆప్ ఐడియాలజీ ఎంటో చెబుతుంది. రెండు దశాబ్దాలుగా తనతో, తన పార్టీతో సన్నిహితంగా ఉన్న మలివాల్ కోసం కేజ్రీవాల్ ఒక మాటయినా మాట్లాడానా? తన సహాయకుడు కుమార్‌ను అరెస్టు చేస్తే గతంలో కేజ్రీవాల్ చేసిన తప్పులు, అవినీతి ఎక్కడ బయటపడు తోందేమోనన్న భయం ఢిల్లీ ముఖ్యమంత్రిని వెంటాడుతోంది’ అని సచ్‌దేవా పేర్కొన్నారు.
సచ్ దేవా వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆప్ నేతలు.. ‘కర్ణాటకలో మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణను ఎందుకు భారత్ నుంచి తప్పించుకునేలా చేశారో? మహిళా రెజ్లర్లను వేధించిన బీజేపీ బ్రిజ్ భూషణ్ సింగ్ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్ ఎందుకు ఇచ్చారో ముందుకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి.’ అని ప్రకటన జారీ చేశారు.
కుమార్ అరెస్టు..
ముఖ్యమంత్రి నివాసానికి మే 13న మలివాల్ వెళ్లారు. అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు కుమార్ తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెకు ఆసుపత్రికి తరలించారు. కుమార్‌పై ఢిల్లీ పోలీసులు వేధింపులు, నేరపూరిత హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించారు.
బీజేపీ కేంద్ర కార్యాయలం వద్ద నిరసన..
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేతలు దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆప్‌ని అణిచివేసేందుకు బిజెపి కుట్రలు ఫలించవని, ఒక కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తే వందలు, వేల కొద్దీ కేజ్రీవాల్ పుట్టుకొస్తారని ఆప్ చీఫ్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఆప్ నేతలందరిని జైలులో పెట్టాలని భావిస్తున్నారని, ఆయన కోరుకున్నట్లుగానే తమ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని గతంలో ప్రకటించారు.