ఏపీలో లడ్డు - తెలంగాణలో హైడ్రా
x

ఏపీలో లడ్డు - తెలంగాణలో హైడ్రా

ఇవి రెండూ అత్యధికశాతం ప్రజలపై నేరుగా ప్రభావం చూపే అంశాలు. ఏపీదయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇక తెలంగాణ అంశం కూడా తక్కువేమీ కాదు.


ఈ రెండు అంశాలకూ పోలిక బాగా ఉంది. రెండు రాష్ట్రాలలోనూ ఇవి ప్రస్తుతం నడస్తున్న బర్నింగ్ ఇష్యూలు. రెండూ అత్యంత సంచలన అంశాలే. అట్లా ఇట్లా కాదు. అత్యధికశాతం ప్రజలపై నేరుగా ప్రభావం చూపే అంశాలు. ఏపీదయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇక తెలంగాణ అంశం కూడా తక్కువేమీ కాదు. ఈ రెండు అంశాలనూ ఒకసారి పరిశీలిద్దాం.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికే అపచారమా?

తిరుమల లడ్డు వివాదం విషయంలో ఒకటి మాత్రం నిజం. చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా చేశారో లేక యథాలాపంగా చేశారో తెలియదుగానీ, వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ అంశం చేసిన డేమేజ్ అంతా ఇంతా కాదు. అదీకాక, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అవ్వటం, తిరుమలలో జరిగే ముఖ్యమైన పుణ్యకార్యాలకు అతను ఎన్నడూ సతీసమేతంగా హాజరు కాకపోవటం వంటి కారణాలరీత్యా ఈ ఆరోపణకు బలం చేకూరింది. వైసీపీకి ఇది ఎదురుచూడని అదురుదెబ్బ. కళ్ళు గింగరాలు తిరిగి నివ్వెరపోయేట్లు చేసింది. అయితే మెల్లగా తేరుకుని ఎదురుదాడి, డేమేజ్ కంట్రోల్ ప్రారంభించారు వైసీపీ నాయకులు. మరోవైపు సుప్రీమ్ కోర్ట్ కూడా స్పందించి, కేసును టేకప్ చేసింది. అత్యవసరంగా ఈనెల 30వ తేదీన విచారించనుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా తమ దర్యాప్తును వేగవంతం చేసింది. తిరుమలలో మకాం వేసి సంబంధిత వ్యక్తులను పిలిచి విచారిస్తున్నారు.

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా

హైదరాబాద్ నగరంలో అరాచకంగా ప్రభుత్వ భూములను, నాలాలను, చెరువులను, కుంటలను ఆక్రమించుకుని కట్టిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) మొదట్లో కూల్చివేతలు ప్రారంభించినప్పుడు ప్రజలనుంచి మద్దతు బాగా వచ్చింది. అందులోనూ నాగార్జునలాంటి సెలబ్రిటీకి చెందిన ఎన్ కన్వెన్షన్‌నే నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటంతో రేవంత్ రెడ్డి సర్కారుకు అందరూ జేజేలు పలికారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కూడా బాగా పేరు వచ్చింది. అయితే అదంతా మెల్లమెల్లగా తగ్గుతున్నట్లుగా అనిపిస్తోంది.

హైడ్రా కూల్చేది కేవలం బాడా బాబుల అక్రమ నిర్మాణాలేనని, పేదల ఇళ్ళు కూల్చబోమని రంగనాథ్ ప్రకటించినప్పటికీ, నష్టపోతున్నవారిలో సామాన్యులు చాలామందే ఉన్నారని తెలుస్తోంది. దీనితో మొదట జనం నుంచి వచ్చిన మద్దతు ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతున్నట్లుగా ఉంది. పైగా కూకట్ పల్లి నల్లచెరువు ప్రాంతానికి చెందిన బుచ్చెమ్మ అనే మహిళ హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకుందనే వార్తలు రావటంకూడా విమర్శలకు బలం చేకూర్చేవిధంగా ఉంది. దానికి నిదర్శనమే ఇవాళ దానం నాగేందర్ వంటి అధికార పార్టీ ఎమ్మెల్యేనే స్వయంగా మీడియాతో మాట్లాడుతూ, పేదల జోలికి వెళ్ళవద్దని హైడ్రాకు ముందే చెప్పామని, అధికారులు ముందుగా ఐమ్యాక్స్, జలవిహార్ వంటి అక్రమకట్టడాల పని పట్టాలంటూ చేసిన వ్యాఖ్యలు. మరోవైపు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు బిల్డర్‌లు పేదవారిని ముందుపెట్టి మీడియా ముందు డ్రామాలు ఆడిస్తున్నారని అన్నారు. భారీవర్షాలు కురిస్తే విజయవాడ మునిగిపోయినట్లు హైదరాబాద్ మునిగిపోకూడదనే హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పారు.

కూల్చివేతలపై విమర్శలు పెరిగిపోవటంతో హైడ్రా దూకుడు తగ్గించింది. ఇక లీగల్ టీమ్ సలహాలు తీసుకున్న తర్వాతే కూల్చివేతలు జరుగనున్నట్లు తెలుస్తోంది. అక్రమ కట్టడమని తేలినాకూడా, జీహెచ్ఎంసీ, హెచ్ఎమ్‌డీఏ అనుమతులు ఉంటే కూల్చగూడదని, అనుమతులు లేని నిర్మాణాలపై మాత్రమే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది. మరోవైపు, బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఇదే అదనుగా, ప్రతిపక్ష పార్టీలు వారిని అక్కున చేర్చుకుని సాంత్వన వచనాలు పలుకుతూ తాము అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేస్తామంటూ చెప్పుకొస్తున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు ఇదే అంశంపై స్పందిస్తూ, హైడ్రా విషయంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని అవకాశవాద శక్తులు కృషిచేస్తున్నాయని ఆరోపించారు.

Read More
Next Story