కేటీఆర్ కొంపముంచిన బావమరిది!
x

కేటీఆర్ కొంపముంచిన బావమరిది!

బావమరిది ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ దొరకటంతో కేటీఆర్ డిఫెన్స్‌లో పడ్డారు. మరోవైపు, మూడు పార్టీలూ తిట్టుకోవటానికి మరో మంచివిషయం దొరికినట్లయింది.


తెలంగాణలో మరో పెద్ద రాజకీయ వివాదానికి తెర లేచింది. బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్య దూషణ భూషణలకు మరో అంశం దొరికింది. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందినదిగా చెబుతున్న ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ దొరకటంతో మూడు ప్రధాన పార్టీలూ తిట్టుకోవటానికి మంచి విషయం దొరికినట్లయింది. మరోవైపు, తాజా పరిణామంతో కేటీఆర్ డిఫెన్స్‌లో పడిపోయారు. కేటీఆర్, కేటీఆర్ భార్య కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని, ఆఖరి క్షణంలో తప్పించుకున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్ కల్చర్‌కు తాము వ్యతిరేకమని చెబుతూ వచ్చే కేటీఆర్ ఇప్పుడేమంటారని కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నారు. ప్రతి చిన్న విషయంపైనా ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్, ఇంత గొడవ జరుగుతున్నా మౌనంగా ఉండటంతో ఇది అర్థాంగీకరామని కూడా కాంగ్రెస్ నేతలు భాష్యం చెబుతున్నారు. ఇక కేంద్రమంత్రి బండి సంజయ్‌‌కయితే, ఇది మంచి అస్త్రం దొరికినట్లయింది.

హైదరాబాద్ నగర శివార్లలోని జన్వాడలో ఉన్న రాజ్ పాకాల ఫామ్ హౌస్‌పై నిన్న రాత్రి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. రిజర్వ్ కాలనీలో ఉన్న ఈ ఫామ్ హౌస్‌లో పెద్ద పెద్ద శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్నట్లు బయటపడింది. పోలీసుల తనిఖీలలో విదేశీ మద్యం సీసాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కాయిన్స్, క్యాసినో పరికరాలు దొరికాయి. దీనితో ఇక్కడ క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీలో 14 మంది మహిళలతో సహా 35 మంది ఉన్నట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్నవారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఒక వ్యక్తి కొకైన్ అనే మత్తుమందు తీసుకున్నట్లు నిర్ధారణ కావటంతో కేసు నమోదు చేశారు. ఏ1 గా కార్తీక్, ఏ2 గా రాజ్ పాకాల పేర్లను కేసులో చేర్చారు. ఫామ్ హౌస్ 30 ఎకరాలలో విస్తరించి ఉంది.

ఘటనాస్థలంనుంచి విదేశీ మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీపై డ్రగ్స్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా, రాజ్ పాకాల ఫామ్ హౌస్ కేటీఆర్ బావమరిదిదిగా చెబుతున్నారు.

మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ వార్తలపై బండి సంజయ్ ఇవాళ స్పందించారు. సుద్దపూస కబుర్లు చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఏమంటాడని అన్నారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమోనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ సిగ్గు చేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బడానేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్నవాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని సంజయ్ అన్నారు.

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని గతంలో బండి సంజయ్ ఆరోపించగా, కేటీఆర్ ఆ ఆరోపణలపై ఇటీవల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో పలు అంశాలపై మూడు ప్రధాన పార్టీలలోని పలువురు నాయకులు ఒకరినొకరు విశృంఖలమైన భాషతో తిట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వారికి తాజాగా మరో అంశం దొరికినట్లయింది.

Read More
Next Story