అర్ధరాత్రి కృష్ణలంక మునిగింది
ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర రాజధానిగా చెబుతున్న విజయవాడలోని కృష్ణలంక మునిగింది. కృష్ణలంక వరద ఉధృతికి మునగక తప్పలేదు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో గల కృష్ణా నదీ తీరం వెంబడి ఉన్న కృష్ణలంక ప్రాంతం వరద నీటిలో ఆదివారం అర్ధరాత్రి తరువాత మునిగింది. ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మించినా ఆ గోడ మధ్యలో ఉండే లీకుల్లో నుంచి నీరు నగరంలోని వీధుల్లోకి ప్రవేశించి రాత్రంతా కృష్ణలంక వాసులకు నిద్రలేకుండా చేసింది. సుమారు మూడు లక్షల కుటుంబాలు ఆదివారం రాత్రి నిద్రలేకుండా గడిపాయి. అధికారులు కూడా నిద్రలేకుండా గడపడం విశేషం.
అర్ధరాత్రి పర్యటించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అర్ధరాత్రి 12 గంటల తరువాత కూడా నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన వయసుకు మించిన పనిచేశారని పలువురు అభినందిస్తున్నారు. పైగా వరద నీటిలో పడవల్లో ప్రయాణించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.అజిత్ సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల్లో ఆత్మ స్థైర్యం నింపి వారికి అందిస్తుంన్న సహాయక చర్యలు పరిశీలించేందుకు అర్ధరాత్రి ముఖ్యమంత్రి పర్యటించారు. స్వయంగా బాధితులతో మాట్లాడారు. అక్కడ నుంచి బయలుదేరి విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
అర్ధరాత్రి ఎన్‌టీఆర్ కలెక్టరేట్‌లో ప్రెస్‌మీట్
ఎన్‌టీర్ విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి దాటినా వరద ప్రాంతాల్లో ఉన్న బాగోగులు తెలుసుకోవడం తన బాధ్యతగా భావించానని, అందుకే వరద ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టాలను చూసి బాధితులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నానన్నారు. సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించ వద్దని అధికారులు చెప్పినా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారి దగ్గరికి వెళ్లకుండా ఎలా ఉండమంటారన్నారు. వరద ప్రాంతాల్లో తిరిగి బాధితులకు భరోసా, ధైర్యం కల్పించిన ముఖ్యమంత్రి నేరుగా వరద బాధితులకు ఆహారాన్ని అందజేసారు.
బాధితులకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి పర్యటన
బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా వెళ్ళానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని. కొంత మంది రోగులు, వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుని ఉండటం చూశానని అన్నారు. నేను ఈ సంఘటనలు చూసిన తరువాత ఎంతో బాధ పడ్డానన్నారు. సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతీ ఒక్కరినీ రక్షించి తీరుతాం అని తెలిపారు. సోమవారం ఉదయానికల్లా బోట్లు, హెలికాప్టర్ అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
సీఎం అర్ధరాత్రి పర్యటించడం ఇదే మొదటిసారి
రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరూ బాధల్లో ఉన్న బాధితుల కోసం అర్ధరాత్రి పడవల్లో పర్యటించలేదని పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఎంతో కాలంగా చూస్తున్నాం. పాలకులు ఎవరైనా.. ఎంతటి విపత్తు సంభవించినా మరుసటిరోజో.. తరువాతి రోజో.. వస్తున్నారు తప్ప అప్పటికప్పుడు అర్ధరాత్రి రావడం లేదన్నారు. అయితే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో పడవల్లో బుడమేరులో మునిగిపోయిన బాధితులను ఆదుకునేందుకు నేరుగా రంగంలోకి దిగటం ఇదే మొదటి సారి. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న కృష్ణలంక ప్రాంతాన్ని వరదనీరు అర్ధరాత్రి తరువాత ముంచెత్తింది. సీఎం అవసరమైతే సోమవారం కృష్ణలంక ప్రాంతాన్ని కూడా పర్యటిస్తారని ముఖ్య అధికారులు కొందరు చెప్పటం విశేషం.
రిటైనింగ్ వాల్ ఉండబట్టే...
రిటైనింగ్ వాల్ నిర్మించాలనే నిర్ణయానికి నాటి తెలుగుదేశం ప్రభుత్వం రాకపోయి ఉంటే నేడు కృష్ణలం ప్రజలంతా వరద నీటిలో మునిగిపోయే వారని చెప్పారు. కృష్ణలంకకు చెందిన గెడ్డం జయశ్రీ మాట్లాడుతూ తాము సుమారు పది సంవత్సరాలుగా కృష్ణలంకలోని బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్నాము. ఈ రోజు అర్ధరాత్రి ఇంట్లోని మెట్ల వరకు వరదనీరు వచ్చింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని కొందరు ఇండ్లలోకి కూడా వరద నీరు వచ్చింది. రాత్రంతా నిద్రలేకుండా గడిపాము. పోలీసులు మాత్రం మా వీధిలోకి వచ్చి అప్రమత్తంగా ఉండండి. ఇండ్లు ఖాళీచేసి రోడ్డుపైకి వచ్చేయండి అన్నారే తప్ప, పునరావాస కేందం ఎక్కడ ఉంది. ఎక్కడికి తాము రావాలనేది చెప్పకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రే అర్ధరాత్రి వరకు బుడమేరు కాలువ వరద బాధితుల పక్షాన వారికి కావాల్సిన సౌకర్యాలు అందజేసే కార్యక్రమంలో ఉంటే కృష్ణలంకలో అధికారులు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచంద్ర నగర్‌కు చెందిన వడ్లాని కృష్ణ మాట్లాడుతూ కృష్ణలంకలోని పూర్ణచంద్రనగర్‌లో రిటైనింగ్ వాల్ బొక్కల్లో నుంచి వరదనీరు రోడ్లపైకి వచ్చి తమను భయభ్రాంతులకు గురిచేంసిందన్నారు. రాత్రి 12 గంటల నుంచి రెండు గంటల ప్రాంతం వరకు వరదనీరు రోడ్లపైకి వచ్చిందని, కొన్ని ఇళ్లు మునకకు గురయ్యాయన్నారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇళ్లు తప్ప, నది గోడను ఆనుకుని ఇళ్లు నీటిలో మునిగిపోయినట్లు తెలిపారు.
వరద బాధితులను ఆదుకోవడంలో ఆదర్శ సీఎం
అర్ధరాత్రి కూడా విజయవాడ నగరంలోని బుడమేరు వాగు ప్రాంతంలో పర్యటించి కలెక్టరేట్‌లో అర్ధరాత్రి మీడియా వారితో మాట్లాడి ప్రజలకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పలువురు నగర ప్రముఖులు, ప్రజలు అభినందించారు. భవిష్యత్‌లో కూడా ఇటువంటి ముఖ్యమంత్రే కావాలని ప్రజలు కోరుకుంటారన్నారు. 74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబునాయుడు ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయడం ఆయన ఆదర్శ పాలనకు అద్ధం పడుతోందన్నారు.
Next Story