ఢిల్లీనుంచి నరుక్కురావాలని చూస్తున్న కేసీఆర్: ప్లాన్ ఫలిస్తుందా?
x

ఢిల్లీనుంచి నరుక్కురావాలని చూస్తున్న కేసీఆర్: ప్లాన్ ఫలిస్తుందా?

బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని యాగీ చేసే కాంగ్రెస్, అదేపని చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని జాతీయస్థాయిలో అందరికీ తెలిసేలా చేయటమే ఆ ప్లాన్.


కాంగ్రెస్‌లోకి ప్రవాహంలా వలస పోతున్న ఎమ్మెల్యేలకు అడ్డుకట్ట వేయటానికి ఏ మార్గమూ తోచక బీఆర్ఎస్ తేలుకుట్టిన దొంగలా ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఏమైనా అంటే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష… అన్నట్లుగా, నువ్వు చేర్చుకున్నప్పుడు ఏమయింది ఈ బుద్ధి అంటూ కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. చేసిన పాపం శాపమై కరుస్తున్నట్లుగా ఉంది కేసీఆర్ పరిస్థితి.

అయితే మొత్తానికి ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి కేసీఆర్ ఇవాళ కొత్త ప్లాన్ అమలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఆర్మ్ ట్విస్ట్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని యాగీ చేసే కాంగ్రెస్ పార్టీ, తాము అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో ప్రత్యర్థిపార్టీనుంచి ఎమ్మెల్యేలను ఎడా పెడా లాక్కుంటూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది అని జాతీయస్థాయిలో అందరికీ తెలిసేలా చేయటం, తెలంగాణలో కాంగ్రెస్ ఆకర్ష్ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడేలా చేయటమే ఆ ప్లాన్. ప్లాన్ పేపర్‌మీద బాగానే ఉంది. అది వర్కవుట్ అయితే రాహుల్ ఈ కార్యక్రమాన్ని నిలపవచ్చు. ఎందుకంటే రాహుల్ ఇటీవల తరచూ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తిరుగుతున్నారు, ఇదే అంశంపై బీజేపీని దుమ్మెత్తిపోస్తున్నారు.

హరీష్ రావు, ఎంపీలు సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులతో కలసి కేటీఆర్ ఢిల్లీలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఆకర్ష్‌పై మాట్లాడారు. కేటీఆర్ రాహుల్‌పై చెలరేగిపోయారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని నీతులు చెప్పే రాహుల్, తమ సీఎమ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో ఫిరాయింపులు చేయటాన్ని గమనించటంలేదా అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపిస్తున్న రాహుల్ గాంధి తెలంగాణలో మాత్రం తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ రక్షకుడిలా రాహుల్ గాంధి ఆస్కార్ స్థాయిలో నటిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్‌కు సవరణలు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి, తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్, తెలంగాణలో దానిని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని విమర్శించారు. అయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పదవికి రాజీనామా చేయకుండా మూడు నెలల్లోనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని, లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు.

కొసమెరుపు: అంతా బాగానే ఉందిగానీ, గతంలో మీరు కూడా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారుకదా అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా, మేము ఎమ్మెల్యేలను చేర్చుకోలేదు, విలీనం చేసుకున్నామంటూ కేటీఆర్ కవరింగ్ చేసుకోవటానికి ప్రయత్నించారు. వాస్తవానికి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ మీద గెలిచిన తలసానికి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు.

Read More
Next Story