‘యూపీలో 27 స్థానాల్లో విజయం కూటమిదే’
x

‘యూపీలో 27 స్థానాల్లో విజయం కూటమిదే’

ఇప్పటి దాకా జరిగిన ఐదు దశల ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని, యూపీ పూర్వాంచల్‌లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ పేర్కొన్నారు.


ఉత్తరప్రదేశ్‌లో జరిగే ఆరు, ఏడో దశ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 27 స్థానాలను ప్రతిపక్ష భారత కూటమి గెలుచుకోబోతోందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీలో ఈ సారి బీజేపీకి వీడ్కోలు పలకడం ఖాయమన్నారు.

సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫూల్‌పూర్, అలహాబాద్, అంబేద్కర్‌నగర్, శ్రావస్తి, దోమరియాగంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లాల్‌గంజ్ (SC), అజంగఢ్, జౌన్‌పూర్, మచ్లిషహర్ భదోహి - ఈ 14 స్థానాలకు నేడు (మే 25) పోలింగ్ జరుగుతోంది.

ఆరో దశ పోలింగ్ సందర్భంగా ఆయన లక్నోలో ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఇప్పటి దాకా జరిగిన ఐదు దశల ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని, యూపీలోని తూర్పు ప్రాంతం పూర్వాంచల్‌లోఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొన్నారు.

ఏడో దఫా ఎన్నికల్లో..

ఏడో, చివరి దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ స్థానాలు ఇందులో ఉన్నాయి. మహారాజ్‌గంజ్, ఖుషీనగర్, డియోరియా, బన్స్‌గావ్ (ఎస్సీ), ఘోసీ, సలేంపూర్, బల్లియా, ఘాజీపూర్, చందౌలీ, మీర్జాపూర్ మరియు రాబర్ట్స్‌గంజ్ (ఎస్సీ) కూడా ఏడో దశలో పోలింగ్ జరగనుంది.

ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పుకే కాదు..

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అవినీతి, అన్యాయం, దౌర్జన్యాలతో ఓటర్లు విసిగెత్తిపోయారని, బీజేపీని తుడిచిపెట్టేందుకే ఓటర్లు నిర్ణయించుకున్నారని అఖిలేష్ చెప్పారు. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని మార్చేందుకే కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కూడా అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 స్థానాల్లో కూటమి బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందన్నారు. దాదాపు 30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాకూడా, కాషాయ పార్టీ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టడం లేదన్నారు. బిజెపి ప్రభుత్వ హయాంలో పేదలు మరింత పేదలుగా మారారని, బడా పారిశ్రామికవేత్తలకు రూ.25 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసి మళ్లీ లోన్లు ఇచ్చారని పేర్కొన్నారు.

Read More
Next Story