బుచ్చెమ్మకు హైడ్రా నోటీసే ఇవ్వలేదు: అసత్య ప్రచారంపై రంగనాథ్ సీరియస్
x

బుచ్చెమ్మకు హైడ్రా నోటీసే ఇవ్వలేదు: అసత్య ప్రచారంపై రంగనాథ్ సీరియస్

ఎలా చనిపోయినా, హైడ్రా వలనే చనిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆమె ఆత్మహత్యకు, హైడ్రాకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు.


‘హైడ్రా భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య’ అని గత రెండు రోజులుగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొట్టిపారేశారు. ఇది కావాలని కొందరు చేసే అసత్య ప్రచారమని, దీనిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎలా చనిపోయినా, హైడ్రా వలనే చనిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆమె ఆత్మహత్యకు, హైడ్రాకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు.

బుచ్చమ్మకు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారని, వారి ముగ్గురికీ ఆమె కట్నంగా రెండు జి+1 ఇళ్ళు, ఓపెన్ ప్లాట్‌లు ఇచ్చిందని రంగనాథ్ తెలిపారు. ఆ నిర్మాణాలన్నీ బఫర్ జోన్ కిందకే వస్తాయని, తాము ఆ నిర్మాణాలను తాకటంలేదని స్పష్టం చేశారు. కొందరు స్థానికులు హైడ్రాను భూతంగా చూపించి ఆమెను భయపెట్టారని చెప్పారు. బుచ్చెమ్మ ఇల్లు కూకట్‌పల్లి ప్రధాన రహదారిపై బీజేపీ కార్యాలయానికి సమీపంలో ఉందని, అక్కడ కూల్చివేతకు మార్కింగ్ లేదని కూకట్‌పల్లి సీఐ తెలిపారు.

మరోవైపు హైడ్రా భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందన్న వార్తలపై జాతీయ మానవహక్కుల సంఘం సుమోటోగా స్పందించి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కేసు ఫైల్ చేసింది. ఎన్‌హెచ్ఆర్‌సీ 16063/ఐఎన్/2024 నంబర్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది.

మరోవైపు సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో కూల్చివేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా రంగనాథ్ స్పందించారు. ఆ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డువరకే పరిమితమని చెప్పారు. ఆ కూల్చివేతలకు హైడ్రాకు ముడిపెడుతూ వార్తలు రావటం విచారకరమని అన్నారు. హైడ్రాపై అసత్యవార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంగారెడ్డి ఘటనలో హోమ్ గార్డ్ గాయపడితే హైడ్రా బలి తీసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావటం దురదృష్టకరమని అన్నారు.

Read More
Next Story