తెలుగునాట డిప్యూటీ సీఎం పదవికి ఎన్నడూ లేనంత గుర్తింపు, గౌరవం!
x

తెలుగునాట డిప్యూటీ సీఎం పదవికి ఎన్నడూ లేనంత గుర్తింపు, గౌరవం!

ప్రభుత్వ కార్యాలయాలలో తన ఫోటో పక్కన పవన్ ఫోటో కూడా పెట్టాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఒక ఉపముఖ్యమంత్రికి ఇంతకు మించిన గౌరవం ఎక్కడ దొరుకుతుంది.


సాధారణంగా ఉపముఖ్యమంత్రి పదవి అంటే ఆరో వేలు అనే ఒక భావం ఉండేది గతంలో. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సింగిల్ పార్టీ అధికారంలోకి వస్తే అంతర్గతంగా ఉండే అసమ్మతులను చల్లార్చటంకోసం, సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వివిధ పార్టీలలోని అసమ్మతులను చల్లార్చటంకోసం ప్రస్తుతం ఈ ఉప ముఖ్యమంత్రి పదవిని ఉపయోగిస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే దేశంలోనే మరెక్కడా లేనంతగా ఉపముఖ్యమంత్రులు కీలకపాత్ర పోషిస్తున్నారు, సీఎమ్‌లు కూడా వారికి అధిక ప్రాధాన్యత, గౌరవాన్ని ఇస్తున్నారు. ఇది ఒక కొత్త పరిణామం.

ఉపముఖ్యమంత్రి పదవి రాజ్యాంగబద్ధం కాదు అంటూ ఆ మధ్య దాఖలైన పిటిషన్‌పై సుప్రీమ్ కోర్ట్ స్పందిస్తూ, ఆ పదవుల నియామకాలలో తప్పేమీ లేదని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దేశంలోని 28 రాష్ట్రాలలో 14 రాష్ట్రాలలో ఉపముఖ్యమంత్రులు ఉన్నారు. బీజేపీ అయితే ఈ మధ్య… తాము అధికారంలోకి వచ్చిన ప్రతిరాష్ట్రంలోనూ ‘ఒక సీఎమ్, ఇద్దరు డిప్యూటీ సీఎమ్‌లు’ అనే ఫార్ములాను అనుసరిస్తోంది. యూపీలో మొదలైన ఈ సంప్రదాయాన్ని రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, ఒదిషాలలో కూడా కొనసాగిస్తోంది. మహారాష్ట్ర, బీహార్, నాగాల్యాండ్, మేఘాలయ రాష్ట్రాలలో కూడా ఇద్దరు డిప్యూటీలు ఉన్నారు. త్వరలో తమిళనాడులో కూడా ఉపముఖ్యమంత్రి రాబోతున్నారని, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ఆ పదవిలో నియమించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ 14 రాష్ట్రాలలో కర్ణాటకలోని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు తప్పిస్తే, మిగిలినవారికి ఎవరికీ లేని ప్రత్యేక గుర్తింపు, గౌరవం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డిప్యూటీ సీఎమ్‌లుగా ఉన్న పవన్ కళ్యాణ్, మల్లు భట్టి విక్రమార్కలకు ఉన్నాయి. దీనికి మారిన రాజకీయ, సామాజిక సమీకరణాలు కారణమని చెప్పుకోవచ్చు. 2014లో విభజన తర్వాత ఏపీలో గెలిచిన చంద్రబాబునాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పను, గౌడ సామాజికవర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తిని డిప్యూటీ సీఎంలుగా నియమించుకోగా, కేసీఆర్ ముగ్గురిని నియమించుకున్నారు… ఒక ముస్లిమ్, ఇద్దరు ఎస్‌సీ మాదిగ. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ ఉపముఖ్యమంత్రుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ఒక రికార్డ్ సృష్టించింది… ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎమ్‌లతో. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఐదు ప్రధానవర్గాలైన ముస్లిమ్, కాపు, ఎస్‌సీ, ఎస్‌టీ, శెట్టిబలిజ(బీసీ)లకు ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టి సోషల్ ఇంజనీరింగ్ చేయటానికి ప్రయత్నించారు. అయితే ఆ సోషల్ ఇంజనీరింగ్ ఇటీవలి ఎన్నికల్లో ఏమీ ఫలితాలు ఇవ్వకపోవటం వేరే విషయం అనుకోండి.

ప్రస్తుతం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్కరే ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ ఉపముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నవారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉండేవారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విమర్శలు కూడా గుప్పించేది... ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ వంటి పెద్దలను కలవటానికి వెళ్ళేటప్పుడు ఉపముఖ్యమంత్రులను తీసుకెళ్ళలేదు అంటూ. కేవలం ఆయా వర్గాలకు పెద్దపీట వేశామని డప్పులు కొట్టుకోవటమేగానీ, ఆ ఉపముఖ్యమంత్రులను కీలక సమావేశాలకు తీసుకెళ్ళకపోవటం వారిని అవమానించటమేనని ఆరోపించేవారు. అక్కడ కేసీఆర్ కూడా అంతే. ఉపముఖ్యమంత్రులకు ఇసుమంతైనా ప్రత్యేక గౌరవం ఉండేది కాదు.

అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలలోనూ పరిస్థితి పూర్తిగా తల్లకిందులయింది. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు తమ డిప్యూటీ సీఎంలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కీలక సమావేశాలలో పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు వారిని సంప్రదిస్తున్నారు.

ఏపీలో తాను ముఖ్యమంత్రి పదవిని తిరిగి అలంకరించటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని తెలుసు కనుక ఆయనకు చంద్రబాబు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజమండ్రి జైలుకు వచ్చి తనను పరామర్శించి జావకారిపోయిఉన్న తెలుగుదేశం శ్రేణులలో స్థైర్యం నింపటంవలనో, ఏమో… నాటినుంచి చంద్రబాబు పవన్‌కు ప్రత్యేక గౌరవం ఇస్తూ వచ్చారు. అయితే, ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపు సందర్భంగా జనసేనకు టీడీపీ అత్యంత తక్కువ సీట్లు కేటాయించటంతో కాపులలో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైనా కూడా, చంద్రబాబు పవన్‌కు ఇస్తున్న గౌరవం, వారిద్దరిమధ్య సహృద్భావ బంధాన్ని చూసి కాపులు కూడా చల్లబడ్డారు. అందుకే కాపులనుంచి కూటమికి ఓట్ ట్రాన్సఫర్ పూర్తిస్థాయిలో జరిగి, కూటమి భారీ విజయాన్ని చేజిక్కించుకోగలిగింది. ఆ ఎన్నికల్లో జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ కంటే కూడా కూటమి అనుసరించిన కాపు+కమ్మ ఫార్ములాయే బలంగా నిలిచినందున దానిని అలాగే కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా కనబడుతోంది. అందుకే పవన్‌కు అన్నిచోట్లా పెద్దపీట వేయటమే కాదు, ప్రభుత్వ కార్యాలయాలలో తన ఫోటో పక్కన పవన్ ఫోటో కూడా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక ఉపముఖ్యమంత్రికి ఇంతకు మించిన గౌరవం ఎక్కడ దొరుకుతుంది.

తెలంగాణలో ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మల్లు భట్టి విక్రమార్కకు కూడా సీఎమ్ రేవంత్ రెడ్డి మొదటినుంచీ చాలా గౌరవం ఇస్తూ వస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత భట్టి కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉండటం, ఆయనకు పార్టీలో, బయట క్లీన్ ఇమేజ్ ఉండటం, తెలంగాణలోని బలమైన దళితవర్గానికి చెందిన నేత కావటం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రిని కలవటానికి ఢిల్లీ వెళ్ళేటప్పుడు భట్టిని కూడా వెంటబెట్టుకుని వెళుతున్నారు. ఇటీవలి తెలంగాణ బడ్జెట్ సమయంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టిని ఆయన సీటువద్దకు వెళ్ళిమరీ రేవంత్ కౌగలించుకుని అభినందించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టినా, ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తూ, గ్యారెంటీలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. రైతు రుణమాఫీ విజయవంతంగా చేసినందుకు కూడా భట్టిని రేవంత్ అభినందించారు. మొత్తంమీద వీరిద్దరి మధ్య ఉన్న సహృద్భావ సంబంధం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

తెలుగు రాష్ట్రాలలో ఉపముఖ్యమంత్రులకు ఇంత గౌరవం, గుర్తింపు దక్కటం వెనక వారికున్న క్లీన్ ఇమేజ్‌తో పాటు, వారి సామాజికవర్గ బలం కూడా కారణం అని చెప్పుకోక తప్పదు. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ సూరావజ్జల రాము మాట్లాడుతూ, గతంలో రెండు రాష్ట్రాలలో ఉపముఖ్యమంత్రులు కేవలం డమ్మీలుగా మాత్రమే ఉండేవారని, ఇప్పుడు రెండు చోట్లా ఇద్దరు బలమైన నేతలు ఆ పదవులను అలంకరించటం ఆహ్వానించదగ్గ పరిణామంటూ సంతోషం వ్యక్తం చేశారు. దీనివలన ఏకపక్షమైన పాలన కాకుండా, సీఎమ్, డిప్యూటీ కలిసి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం ఏర్పడుతుందని, తప్పులు తక్కువ జరుగుతాయని అన్నారు. భట్టి విక్రమార్క ఉన్నత చదువులు చదివిన విద్యావంతుడు అని, ఆయన బాగా పని చేస్తున్నారని ప్రశంశించారు. అయితే, ప్రస్తుతం రెండు రాష్ట్రాలలోనూ హనీమూన్ పీరియడ్ నడుస్తున్నందున ఆల్ ఈజ్ వెల్‌లాగా ఉందని, మున్ముందు రెండు అధికార కేంద్రాలు తయారయ్యే ప్రమాదం ఉందని అన్నారు.

Read More
Next Story