కడప జిల్లా గండికోటలోయకు అరుదైన గుర్తింపు
x
గండికోట దగ్గిర పెన్నానది గండి ప్రాంతం. (ఫోటో: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ)

కడప జిల్లా గండికోటలోయకు అరుదైన గుర్తింపు

జియో హెరిటేజ్ (Geoheritage Site)గా గుర్లింపు ఇచ్చిన జిఎస్ ఐ


కడప జిల్లా జమ్మలమడుగు సమీపాన పెన్ననది గండి (Gandikota Gorge)కి అరుదైన గుర్తింపు లభించింది. దీనికి అరుదైన జియో హెరిటేజ్ సైట్ గా భారత ప్రభుత్వం గుర్తించింది.

ఈ గండి వల్లే ఇక్కడి కొండల మీద కట్టిన కోటకు గండి కోట అనే పేరు వచ్చింది. ఈ లోయ జియోలాజికల్ అద్భుతం. రెండు ఎత్తయిన కొండల మధ్య పాతాళంలో అన్నట్లు పెన్నానదీ మెలికలు తిరుగుతూ ముందుకు సాగుతుంది.నదికి ఇరువైపుల కొండలు, కొండల మీద ఎవరో మహారాతి శిల్పి అదే పనిగా పేర్చినట్లుండే బండరాళ్లు, దిగువన పాయలాగా కనిపించే ఏరు... ఎంత చూసినా తనివితీరని ప్రకృతి సౌందర్యం. కొండరాళ్ల మీద కూర్చుని గండిలో పారే నదిని చూసేందుకు వేలాది మంది రోజూ గండికోటను సందర్శిస్తుంటారు.

ఇపుడు ఈ గండికి అంటే గండికోట-పెన్నా లోయకు జియోలాజికల్ సర్వే ఆప్ ఇండియా (Geological Survey of India: GSI) అరుదైనా ‘జియో హెరిటేజ్ సైట్’ గుర్తింపు నిచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వుల మీద జిఎస్ ఐ డైరెక్టర్ జనరల్ అశిత్ సాహ సంతకం చేశారు.


దేశంలో ఆరు ప్రాంతాలను జియో హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తూ సంతకం చేస్తున్న జిఎస్ ఐ డైరెక్టర్ జనరల్ అశిత్ సాహ

గండికోట గండితో పాటు మరొక ఐదు జియోలాజికల్ విశేషాలకు కూడా ఈ జియో హెరిటేజ్ సైట్ గుర్తింపు వచ్చింది. వాటి పేర్లు:

1. మెరైన్ పాజిల్ ఖజానా, లాంగ్జా గ్రామం, హిమాచల్ ప్రదేశ్ (Marine Fossil Treasure, Langza Village, Lahaul & Spiti District, Himachal Pradesh)

2. కలింజార్ కోట, ఉత్తర ప్రదేశ్ (Eparchaean Unconformity, Kalinjar Fort, Banda District, Uttar Pradesh)

3. బాగ్ డైనోసార్ నేషనల్ పార్క్, మధ్య ప్రదేశ్ (Bagh Dinosaur Fossil National Park, Dhar District, Madhya Pradesh)

4. యానా రాక్ కేవ్ , కర్నాటక (Yana Rock Cave, Uttara Kannada District, Karnataka)

5.ఆర్వా-లుంష్యానా కేవల్, మేఘాలయ (Arwah–Lumshynna Cave, East Khasi Hills District, Meghalaya)

6. పెన్నానది గండి, గండికోట, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ (Penna River Gorge, Gandikota, YSR Kadapa District, Andhra Pradesh)

గండికోట ఎక్కడున్నది?

గండికోట కడప జిల్లా జమ్మలమడుగు పట్టాణానికి 11 కిలో మీటర్ల దూరాన ఉంటుంది. జమ్మలమడుగు చేరుకోవడం సులభం. హైదరాబాద్, విజయవాడ ల నుంచి బస్ సౌకర్యం ఉంది. జమ్మలమడుగులో రైల్వేస్టేషన్ ఉంది. జమ్మల మడుగులో బస చేసేందుకు ఏర్పాట్లు న్నాయి. గండికోటలో కూడా టూరిజం శాఖ వాళ్ల గెస్టు హౌస్ ఉంది. గండికి ఒక వైపు కోట ఉంటే మరొక వైపు కొండమీద ఆగస్తీశ్వర కోన ఉంటుంది. అది కూడా చూడదగ్గ ప్రదేశమే.


Read More
Next Story