ఇంకుతున్న గోదావరి నీళ్లు
గోదావరి నదిలో పోలవరం పైభాగాన కోయిదా ప్రాంతంలో నదీ జలాలు భూమిలోకి ఇంకిపోతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేయడం లేదు. ఏ ప్రాంతంలో ఇంకుతున్నాయో తెలియదు.
గోదావరి నదిలో జలాలు ఇంకిపోతున్నాయి. భారీ స్థాయిలో నీరు ఇంకిపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు అనుకున్న స్థాయిలో నీరు చేరే అవకాశం లేకుండా పోతోందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకిపోతున్న నీటిని అరికట్టేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. 29 ఏళ్ల అధ్యయనం తరువాత అదృశ్యమవుతున్న గోదావరి జలాలపై ఇప్పుడు పెద్ద మొత్తంలో చర్చ జరుగుతోంది. 1977 నుండి 2006వ వరకు అంటే 29 ఏళ్ల పాటు గోదావరి నీటి ప్రవాహాన్ని అధ్యయనం చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్యుసి) ఈ నిర్ధారణకు వచ్చింది. పోలవరానికి 52 కిలోమీటర్ల ఎగువన ఉన్న కొయిదా నుంచి ఈ పరిశీలన సాగింది. ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో నీళ్లు ఈ ప్రాంతంలో మాయం అవుతున్నట్లు నిర్ధారించింది.
1983 ఆగస్టు 15న కోయిదా వద్ద గోదావరి నదిలో 58,616 క్యూసెక్కుల ప్రవాహం వుంటే అది పోలవరం వద్దకు వచ్చే సరికి 40,176 క్యూసెక్కులకు తగ్గిందని గుర్తించారు. 1986లో కోయిదా వద్ద 1,552 టిఎంసిల నీరు వెళ్లగా, పోలవరం వద్దకు వచ్చే సరికి అది 1,345 టిఎంసిలకు తగ్గిపోయింది. అంటే 207 టిఎంసిల నీరు తేడా వచ్చింది. అదే సమయంలో ఇంకా ఎగువన ఉన్న పేరూర్ గేజ్ నుంచి నీటి ప్రవాహంలో ఎటువంటి తగ్గుదల కనపడకపోగా వాగులు, వంకల నుండి వచ్చి కలిసే నీటితో పెరగడాన్ని గుర్తించారు. పేరూర్ గేజ్ వద్ద 2,369 టిఎంసిల నీరు ప్రవహించగా, అది కోయిదాకు వచ్చేసరికి 3,218 టిఎంసిలు వుంది. అంటే సమస్య అంతా కోయిదా నుండి పోలవరం వరకు ఉన్న ప్రవాహంలోనే ఉంది.
వరద తీవ్రతతో సంబంధం లేకుండానే గోదావరిలోని ఈ ప్రాంతంలో ప్రతి ఏటా భారీ మొత్తంలో నీళ్లు అదృశ్యమవుతున్నాయి. అని రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సంవత్సరాల క్రితం నిపుణులు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. కోయిడా నుంచి పోలవరం వరకు మధ్యన ఎలాంటి డ్యామ్‌లు కాని, ఎత్తిపోతల పథకాలు కాని లేవు. ఈ రెండింటి మధ్య కొన్ని వాగులు, వంకల నుండి అదనంగా నీరు చేరుతోంది. ఈ లెక్కన పోలవరానికి వచ్చేలోపు నీటి ప్రవాహం పెరగాలి తప్ప తగ్గకూడదు. అందుకు భిన్నంగా రోజుకు సుమారు 30 టిఎంసిలకు పైగా నీరు మాయమవుతోంది. సగటున 28.25 టిఎంసిలుగా మాయమవుతున్ననీరు ఉందని వివరించారు.
అదృశ్యమవుతున్ననీరు ఏమవుతోంది...
గోదావరి నీళ్లు పెద్ద మొత్తంలో భూమి లోపలి పొరల్లోకి (బిగ్ డీప్ బెడ్ ప్రొఫైల్) ఇంకి పోతున్నాయని సిడబ్య్లుసి పేర్కొంది. 52 కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా ఎక్కడ ఈ ప్రక్రియ జరుగుతోందన్నది నిర్దిష్టంగా గుర్తించాలని, అక్కడ లీకేజీని అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలవరానికి 200 కిలోమీటర్ల ఎగువన ఉన్న ఖమ్మం జిల్లాలోని గుండ్లవాగు ప్రాజెక్టు వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితి ఉన్న విషయాన్ని సిడబ్ల్యుసి ప్రస్తావించింది. అయితే పోలవరం ప్రాజెక్టుతో పోలిస్తే గుండ్లవాగు వద్ద భూమిలోకి ఇంకుతున్ననీటి పరిమాణం చాలా తక్కువ! ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని పూర్తిస్థాయిలో ఆపలేకపోయిన విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వానికి అందచేసిన నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. పైగా ఈ రెండు ప్రాంతాల్లోనూ భూమి లోపల నిర్మాణం సుమారు ఒకే మాదిరి ఉందని పేర్కొనడం గమనార్హం.
పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల (150 అడుగులు) ఎత్తుతో వుంటే రోజుకు 32.5 టిఎంసిలు, 41.15 మీటర్లు (135 అడుగులు) వుంటే రోజుకు 24 టిఎంసిల నీళ్లు గోదావరి నుంచి మాయమవుతాయని సిడబ్ల్యుసి నివేదిక చెబుతోంది. ఈ అంశాలను పోలవరం డిపిఆర్‌లో ప్రస్తావించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
పోలవరం ఎత్తు పెంచితే ముంపు పెరుగుతుంది..
ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు కడితే రాష్ట్రంలో ముంపు ప్రాంతం విపరీతంగా పెరిగిపోవడంతో పాటు పొరుగు రాష్ట్రాలతో సమస్యలు వస్తున్నాయి. అదే 41.15 మీటర్లు అయితే పొరుగు రాష్ట్రాలతో సమస్యలు రాకపోగా, రాష్ట్రంలో ముంపు ప్రాంతం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే, నదీ గర్భంలోనే భూమిలోకి నీరు ఇంకిపోవడం మాత్రం కొనసాగుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని మరింత పెంచి గోదావరిలో వరదలు వున్నప్పుడు ఎక్కువ నీటిని తీసుకోవడం వంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు. 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మిస్తే భూగర్భంలో పెద్ద మార్పులు జరిగి దిగువన వున్న ధవళేశ్వరం ప్రాజెక్టుతో పాటు జనావాసాలకు ముప్పు ఏర్పడే అవకాశం వుందన్న ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.