వినాయక చవితి వ్యాపారం లక్ష కోట్లా!
భారతదేశంలో అత్యధికంగా జనం చూసే ఐపీఎల్ రెండు నెలలపాటు జరగటంవలన జరిగే టర్నోవర్ రు.15 వేల కోట్లు మాత్రమే అన్నది ఇక్కడ గమనార్హం.
ముంబాయి నగరంలో వినాయకచవితి పండుగ సందర్భంగా పదకొండు రోజులపాటు జరిగే వేడుగల సమయంలో లక్ష కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో అత్యధికంగా జనం చూసే ఐపీఎల్ రెండు నెలలపాటు జరగటంవలన జరిగే టర్నోవర్ రు.15 వేల కోట్లు మాత్రమే అన్నది ఇక్కడ గమనార్హం. మరి ముంబాయి జనాభాలో సగం ఉండే హైదరాబాద్ నగరంలో కనీసం 50వేల కోట్ల టర్నోవర్ జరగకుండా ఉంటుందా. ఈ టర్నోవర్‌లు ప్రతి సంవత్సరమూ 10 శాతం పెరుగుతూ ఉంటాయి. పూలు నుంచి రియల్ ఎస్టేట్ వరకూ అనేక వ్యాపారాలపై ప్రభావం చూపే గణేష్ చతుర్థి వలన ఆర్థిక వ్యవస్థకు ఎంత లాభం చేకూరుతుందో ఒకసారి పరిశీలిద్దాం.
ఒక మండపంతో ఎంతమందికి పని దొరుకుతుంది!
మీ అపార్ట్‌మెంట్‌లోనో, మీ గల్లీలోనో వినాయకుడి మండపం పెట్టాలని మీరు, మీ మిత్రులు నిర్ణయించుకున్నారనుకోండి. మొదట ఏం చేస్తారు? విగ్రహం కొంటారు - విగ్రహ తయారీదారుడికి పని ఇచ్చారు. విగ్రహాన్ని తీసుకొస్తారు - ట్రక్/ట్రాలీ వాళ్ళకు పని కల్పిస్తారు. టెంట్ హౌస్ నుంచి మండపానికి కావలసిన షామియానాలు, ఇతర సామాగ్ర తీసుకుంటారు - టెంట్ హౌస్ యజమానికి, వాటిని చేరవేయటానికి ట్రాలీవారికి పని కల్పించారు. తొమ్మిది రోజులకుగానూ పురోహితుడిని మాట్లాడతారు - వారికి పని ఇచ్చారు. మండప అలంకరణకు మనిషిని మాట్లాడతారు - వారికి పని కల్పిస్తారు. లైెటింగ్ కోసం ఎలక్ట్రీషియన్‌ను మాట్లాడతారు - వారికి పని ఇచ్చినవాళ్ళవుతారు. తొమ్మిదిరోజులూ అన్నప్రసాదాల వితరణకోసం వెచ్చాలు/కిరాణా సరుకులు తీసుకుంటారు, లేదంటే క్యాటరింగ్ వారిని మాట్లాడుకుంటారు - వారికి పని ఇచ్చారు. డప్పు/బ్యాండ్ వాళ్ళను మాట్లాడుకుంటారు - వారికి పని కల్పిస్తారు. రోజువారీ పూల అలంకరణకోసం పూలమ్మి దగ్గరకు వెళ్ళి బేరం మాట్లాడుకుంటారు - వారికి వ్యాపారం ఇస్తారు. మీ ఒక్క మండపంతో ఎంతమందికి పని కల్పిస్తున్నారో చూడండి.
ఎంత డబ్బు చేతులు మారుతుంది?
మండపాలకు డబ్బు ఎక్కడనుంచి వస్తోంది, ఎక్కడకు పోతోంది అనేది చూద్దాం. మండపాల ఖర్చుకోసం కాలనీవాసులు తలా కొంత వేసుకుంటారు, విరాళాలు సేకరిస్తారు. కొన్నిచోట్ల రాజకీయ నాయకులు భారీ మొత్తాలను విరాళంగా ఇస్తుంటారు. దేశ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మండపాలు పెడతారని ఒక అంచనా. మహారాష్ట్రలో అత్యధికంగా మండపాలు ఉంటాయి. అక్కడ ముంబై, పూణే, నాసిక్, పాల్ఘర్, రత్నగిరిలలో ఇది చాలా పెద్ద పండుగ. మహారాష్ట్ర తర్వాత గోవా, కర్ణాటక, తెలంగాణ, ఏపీలలోనూ గణేష్ చతుర్థిని వైభవంగా జరుపుతున్నారు. హైదరాబాద్‌లో సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి సందులోనూ, గల్లీలోనూ ఒక మంటపం ఉంటుంది.
గణేశ విగ్రహాల తయారీదారుల టర్నోవరే రు.500 కోట్లుగా చెబుతున్నారు. ఇక టెంట్ హౌస్‌లు, పూలు, క్యాటరింగ్ వంటి వ్యాపారాల మాటేమిటి! అన్నీ కలుపుకుంటే ఒక చిన్న కాలనీలో మండపానికే తొమ్మిది రోజులకుగానూ కనీసం రు.4-5 లక్షలు ఖర్చు అవుతుందని మియాపూర్ శ్రీల గార్డెన్స్ కాలనీలో మండప నిర్వాహక కమిటీ సభ్యులు గోపాల్ చెప్పారు.
ఒక్క మంటపానికి రు.4-5 లక్షల ఖర్చయితే, ఇన్ని మండపాలలో పెట్టే ఖర్చువలన చిన్న, మధ్యరకం వ్యాపారులకు ఎన్ని వేలమందికి ఉపాధి కలుగుతోందో, ఎంత డబ్బు చేతులు మారుతుందో చూడండి. వారికి ఈ పండుగ పుణ్యమా అని నాలుగు డబ్బులు వెనకేసుకోగలుగుతారు. పండుగకు రెండు వారాలముందునుంచే వ్యాపారాలు ఊపందుకుంటాయి. దాదాపు నెలరోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇంత డబ్బు చేతులు మారటంవలన ప్రభుత్వానికి పన్నుల రూపంలో బోలెడు ఆదాయం. ఇది అంతా ఒక సైకిల్.
ప్రజల ఖర్చు ఎన్నో రెట్లు పెరుగుతుందని, ముఖ్యంగా సీజనల్ వ్యాపారులు బాగా పుంజుకుంటారని సీఏఐటీ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్) సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు.
బడా వ్యాపరాలూ పుంజుకుంటాయి
వినాయక చవితితో హిందూ పండుగలు మొదలవుతాయి కనుక ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మెషిన్ వంటి గృహోపకరణాల కొనుగోళ్ళు బాగా ఉంటాయి. టూ వీలర్‌లు, కార్లు, బంగారం, వజ్రాల ఆభరణాలు, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్ళు బాగా జరుగుతాయి. సంప్రదాయ దుస్తుల కొనుగోళ్ళు విపరీతంగా పెరుగుతాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈకామర్స్ వ్యాపారాలలో 35-40 శాతం పెరుగుదల ఉంటుంది.
ముంబై మాతుంగలో అత్యంత ధనిక గణేశుడు
ముంబైలో ఈ ఏడాది మాతుంగ ప్రాంతంలో గౌడ్ సారస్వత్ బ్రాహ్మిణ్(జీఎస్‌బీ) అనే కమిటీవారు పెట్టిన మండపంలో వినాయకుడి విగ్రహాన్ని పంచధాతువులతో చేశారు. దీనిలో 66 కిలోల బంగారం, 295 కిలోల వెండి కూడా ఉపయోగించటం విశేషం. దీనికి రు.360 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించారు. పరేల్ ప్రాంతంలోని లాల్ బాగ్ గణేశ, ఖేత్‌వాడి ప్రాంతంలోని అతి ఎత్తయిన గణేశలు కూడా బాగా ప్రసిద్ధి చెందాయి. ప్రతిరోజూ లాల్ బాగ్ గణేశుడిని ఇరవై లక్షలమంది సందర్శిస్తారు.
ముంబై సిద్ది వినాయక ఆలయానికి వినాయక చవితి సమయంలో జరిపే 11 రోజుల వేడుక సమయంలో రోజుకు 1.5-2 లక్షలమంది దర్శనంకోసం వస్తారు. మామూలు రోజులలో 20-30 వేలమంది దర్శించుకుంటారు.
సామాజిక కోణం
ఈ పండుగ వలన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందటం ఒక కోణమైతే, ఇది జనాన్ని ఒక్కచోటుకు తీసుకురావటం ఈ పదిరోజులూ సర్వత్రా ఒక పండుగ వాతావరణం(ఇప్పటి భాషలో పాజిటివ్ వైబ్) నెలకొని ఉండటం మరో కోణం. ఒక మండపం పెట్టాలంటే, ఎన్నో చేతులు కలవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా సమష్టి కృషి. మామూలు రోజుల్లో హడావుడిగా క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వారు పరిగెత్తే జనం మండపం నిర్వహణ పుణ్యమా అని నలుగురితో కలవటం, ఏదో ఒక బాధ్యతను తీసుకోవటం, సమన్వయ పరుచుకోవటం జరుగుతుంటుంది. దీనితో మనుషుల్లో ఆర్గనైజేషనల్ స్కిల్స్, లీడర్‌షిప్ స్కిల్స్ పెరగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక పిల్లల హడావుడి, ఆనందం చెప్పనవసరం లేదు. పండగ అంతా వాళ్ళ మీదగానే వెళుతుంది.
రక్షా బంధన్‌తో మొదలయ్యి వినాయక చవితి, నవరాత్రులు, దసరా, కర్వా చౌత్, దీపావళి, ఛాత్ పూజలతో పండుగలు ముగుస్తాయి. ఈ పాజిటివ్ వైబ్ అలా కొనసాగుతూనే ఉంటుంది.