తెలుగు చలన చిత్ర రంగానికి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా స్థానం లేకుండా పోయింది. ఒకప్పుడు చెన్నైలో ఉన్న పరిశ్రమ అడుగులు వేసుకుంటూ హైదరాబాద్‌కు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలన చిత్రాలన నిర్మాణానికి అనువైన ప్రదేశం లేకుండా పోయింది. స్టుడియోలు నిర్మిద్దామనే నిర్మాతలు కానీ, ఆ దిశగా ఆలోచించే చిత్రరంగానికి సంబంధించిన వారు కానీ లేకుండా పోయారు. సినిమా నిర్మాణ స్పాట్స్ ఏపీలో ఎక్కువగానే ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సినిమా అవుట్‌డోర్ షూటింగ్‌లు నేటికీ జరుగుతూనే ఉన్నాయి. గోదావరి ప్రాంతంలో ఎన్నో నిసిమాలు తీశారు. విశాఖపట్నం కేంద్రంగా కూడా సినిమాలు రూపు దిద్దుకున్నాయి. టి కృష్ణ దర్శకత్వంలో ఒంగోలులోనూ చాలా సినిమాలకు ఊపిరిపోశారు. ఎక్కువగా అవుట్ డోర్ షూటింగ్‌లు ఇక్కడ నిర్వహించేవారు. ఇన్‌డోర్ షూటింగ్స్ అనగానే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేంది.
విజయవాడ కేంద్రంగా డిస్టిబ్యూటర్లు కూడా గతంలో చాలా మంది ఉన్నారు. సినిమా రంగానికి విజయవాడ కళాకారులు ఊపిరులు పోస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమైన న టుల్లో ఎక్కువ మంది ఏపీ ప్రాంతానికి చెందిన వారు. హైదరాబాద్ మహా నగరంగా ఆవిర్భావం చెందటం, రామోజీరావు ఫిలిమ్ సిటీ నిర్మించడంతో సినిమా షూటింగ్‌లకు వేదికైంది. ఎంతో మంది ముంబై నుంచి కూడా ఫిలిమ్ సిటీకి వచ్చి సినిమాలు తీస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం రాజధాని ఏరియాలో అమరావతి నగరం భారీ స్థాయిలో నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచన సినిమా రంగంపై కూడా పడింది. సినిమా రంగం అభివృద్ధి చెందితే భారీగా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
అవుట్ డోర్ షూటింగ్‌లకు కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాలతో పాటు సముద్ర తీర ప్రాంతాలు కూడా ఏపీలో అనువుగా ఉంటాయి. తీర ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్లాన్ రూపొందిస్తోంది. అందువల్ల ఏ జిల్లాలో అయినా అవుట్ డోర్ సూటింగ్‌లు అవలీలగా.. అనుకూల వాతావరణంలో తీయొచ్చనే ఆలోచనలో సినిమా రంగానికి చెందిన వారే కాకుండా కళా రంగానికి చెందిన వారు కూడా భావిస్తున్నారు. సినిమాలను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుందనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయువు పట్టు ఆంధ్రా ప్రాంతం. సినిమా పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎందరో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులు, కళాకారులు ఈ ప్రాంతం నుంచి వెళ్లినవారే. ఇక్కడి నుంచి వెళ్లిన ఎంతో మంది చిత్ర ప్రముఖులుగా ఎదిగారు. కానీ ఇక్కడ మాత్రం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నోచుకోలేదు.
కొన్నాళ్ల క్రితం విశాఖ సినీ పరిశ్రమకు అనువైన ప్రాంతమని భావించి రామానాయుడు స్టుడియో నిర్మాణానికి ప్రయత్నించారు. అయితే రకరకాల కారణాల వల్ల అది పూర్తిస్థాయిలో రూపుదాల్చలేదు. తాజాగా ఏపీలోనూ చిత్ర పరిశ్రమను ఎలాగైనా అభివృద్ధి చేయాలనే ఆలోచన సినీ ప్రముఖుల్లో ఉంది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనే వారి సంఖ్య పెరిగింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ స్టూడియో నిర్మాణం చేపట్టాలనే ఆలోచనలో ఉంది. ఇటీవలే పవన్ కళ్యాణ్‌ను సినిమా పెద్దలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఆర్ జిల్లా్ల నందిగామ–కంచికచర్ల ప్రాంతంలో సుమారు 100 ఎకరాలకు పైన ప్రభుత్వ భూమిని వుందని, దానితో పాటు అటవీ భూమి కూడా వేల ఎకరాలు ఉన్నందున భూ కేటాయింపుకు ఎటువంటి ఇబ్బంది లేదనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు మూడు గంటల ప్రయాణం ఉంటుంది. 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్‌పోర్టు, విజయవాడ రైల్వే జంక్షన్, అమరావతికి అతి సమీప ప్రాంతం కావటంతో ఈ ఎంపిక జరిగినట్లుగా సమాచారం. త్వరలో సినీ పరిశ్రమ పెద్దలతో పవన్‌కళ్యాణ్ మరో దఫా చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.