సాల్వెంట్‌ ఆయిల్‌ లీక్‌ వల్లే ఎసెన్షియా కంపెనీలో పేలుడు
x

సాల్వెంట్‌ ఆయిల్‌ లీక్‌ వల్లే ఎసెన్షియా కంపెనీలో పేలుడు

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం మానవ తప్పిదమేనని అధికారులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిర్థారించారు.


అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన ఘోర ప్రమాదం మానవ తప్పిదం. సాల్వెంట్‌ ఆయిల్‌ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్‌ చేసే క్రమంలో లీకై మంటలు చెలరేగాయని అనంతరం పెద్ద పేలుడుతో ప్రమాదం సంభవించి కార్మికుల మరణాలకు దారితీసిందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తయారు చేసిన ప్రథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇంకా బయటకు రాలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాన్‌కు నివేదిక చేరినట్లు విశ్వసనీయ సమాచారం. రియాక్టర్‌ పేలి ఈ ప్రమాదం సంభవించిందని బయటకి ప్రచారం ఇప్పటి వరకు తెలిసిన సమాచారం. ఏవైనా రసాయనాలతో నిండిన వాటిని పంపింగ్‌ చేసేటప్పుడు ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పైప్స్‌ బాగున్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. టెక్నీషియన్స్‌ ఎప్పటికప్పుడు ఇటువంటి పైప్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశీలించిన తరువాతనే పంపింగ్‌ వంటివి చేపట్టాలి. అటువంటివేమీ లేకుండా ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు పంపింగ్‌ చేయడంలో జరిగిన లోపం వల్లనే ఇంతమంది కార్మికులు బలయ్యారు. ఇందుకు యాజమాన్యంలో ఉన్న లోపాలే కారణమని ప్రభుత్వం భావిస్తోంది.

యాజమాన్యంలో విభేదాల వల్లే...
ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్స్‌ ప్రై. లిమిటెడ్‌ పేరిట కొనసాగుతున్న ఈ రసాయనిక కర్మాగారానికి ఇద్దరు యజమానులు ఉన్నారు. ఈ యజమానులు ఇద్దరి మధ్యన విబేధాలు కొనసాగుతున్నట్టు అధికారులకు సమాచారం ఉంది. విబేదాల వల్ల కంపెనీపై వారు సరిగా దృష్టిపెట్టలేదు. వీరు అమెరికాలో ఉంటారు. ఇండియా వారైనప్పటికీ అమెరికాలో స్థిరపడ్డారు. వీరి విభేదాల వల్ల కంపెనీని పెద్దగా పట్టించుకోకపోవడంతో మెయింటెనెన్స్‌ లోపాలు ఏర్పడ్డాయి. ఈ లోపాలే ఇంతమంది దుర్మరణానికి కారణమైంది.
సేఫ్టీ ఆడిట్‌ ఎందుకు జరగటం లేదు?
ముఖ్యంగా ఇటువంటి కర్మాగారాల్లో భద్రతను డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్, లేబర్, ఫైర్, కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో ఉండే పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ పర్యవేక్షిస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి మాత్రం నిబంధనల అతిక్రమణ జరిగిందా? అంతా సక్రమంగానే ఉన్నాయా అనే విషయాన్ని పర్యవేక్షిస్తుంది. ఇటువంటి సెజ్‌లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నివేదికలు ప్రభుత్వానికి వీరు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు కూడా ఈ కంపెనీలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్‌ అన్నారు.
ఒకే ప్రాంతంలో తరచూ ఇటువంటి ప్రమాద ఘటనలు జరుగుతుండటంతో సేఫ్టీ ఆడిట్‌ ఎంత అవసరమో అధికారులు గుర్తించాల్సి ఉంది. ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ, కార్మిక శాఖలు సమన్వయ సమావేశం నిర్వహించి సేఫ్టీ ఆడిట్‌ చేపట్టాలి. భద్రత ప్రమాణాలు, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఈ విషయాన్ని ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావిస్తూ నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయనే విషయాన్ని స్పష్టం చేశారు.
ఆఫ్‌ సైట్‌ ఎమర్జెన్సీ ప్లాన్‌ ఏమైంది?
ప్రమాద తీవ్రత పరిశ్రమ దాటి బయటకు వస్తే ‘ఆఫ్‌ సైట్‌ ఎమర్జెన్సీ ప్లాన్‌’ అమలు చేస్తారు. విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఈ ప్లాన్‌ చేయాలి. పదిహేనేళ్ల కిందట ఉన్న ఈ ప్లాన్‌ను అప్పటి నుంచీ అప్‌డేట్‌ చేయలేదు. ఈ వ్యవధిలో ఎన్నో కొత్త పరిశ్రమలొచ్చాయి. ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిల్లాల విభజనతో నైసర్గిక స్వరూపం మారిపోయింది. అందుకు తగ్గ ఆఫ్‌ సైట్‌ ఎమర్జెన్సీ ప్లాన్‌పై దృష్టి పెట్టలేదు.
యూనియన్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ వర్తించదు
స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌లలో యూనియన్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం వర్తించకుండా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీని వల్ల ఇటువంటి కంపెనీల్లో ప్రశ్నించే వారు లేకుండా పోయారు. దీంతో యాజమాన్యం వారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి దొరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన 2.30 గంటల సమయంలో జరిగితే సాయంత్రం నాలుగున్నర గంటల వరకు లోపల ఏమి జరిగిందో బయటకు తెలియకుండా యాజమాన్యం చేసిందని, అప్పటికే పేలుడు సంభవించి భవనంలోని ఒక అంతస్తు పైకప్పు కూలి కూలీల్లో చాలా మంది దుర్మరణం పాలయ్యారన్నారు. పేలుడు వల్ల పలువురి శరీరాలు చెల్లా చెదురుగా పడిపోయి కొందరి శరీర భాగాలు బయటకు వచ్చి చెట్ల కొమ్మలకు వేలాడాయని ఆయన తెలిపారు. తాము విషయం తెలుసుకునేందుకు కంపెనీ వద్దకు వస్తే గేటు వద్దే అందరినీ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత మంది చనిపోయారో, రోదిస్తున్న వారి పరిస్థితి ఏమిటనేది కనీసం బంధువులు కూడా తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు షోషల్‌ ఆడిట్‌ జరగక పోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. తమతో పాటు సీఐటీయూ వారు బాధితుల బంధువులతో వచ్చి యాజమాన్య నిర్లక్ష్యాన్ని ప్రశిస్తున్నట్లు చెప్పారు.
పెరుగుతున్న మరణాలు
సంఘటనలో ఇప్పటి వరకు 20 మంది పైనే మృతి చెందారు. అధికారికంగా ప్రభుత్వం 17 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. వైద్యశాలల్లో ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అక్కడే ఉన్న అధికారులు వైద్యులతో మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఈ కంపెనీలో మొత్తం 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మధ్యహ్నాం షిఫ్ట్‌ మారే సమయంలో ఈ సంఘటన జరిగింది. అప్పటి వరకు పనిచేసిన కార్మికులతో పాటు అప్పుడే డ్యూటీలోకి వచ్చిన వారు మృత్యువాత పడ్డారు. సంఘటన జరిగిన సమయంలో మూడో ఫ్లోర్‌లో సుమారు 100 మంది పైన ఉన్నట్లు సమాచారం. కంపెనీ యాజమాన్యం మాత్రం ఎంత మంది ఆఫ్లోర్‌లో ఉన్నారనేది స్పష్టం చేయలేదు. పేలుడు వల్ల మూడో ఫ్లోర్‌ పైకప్పు కూలడంతో పైఫ్లోర్‌లో ఉన్న వారు కిందకు పడిపోవడం, కింద ఫ్లోర్‌లో ఉన్న వారు కప్పు కింద పడిపోవడంతో చాలా మందికి కాళ్లు, చేతులు విరిగిపోవడం, శరీర భాగాలు చాలా వరకు దెబ్బతినడం వంటి సంఘటనలు జరిగాయి. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతూనే ఉంది. డిజీపీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా అధికారులు ఫ్యాక్టరీ వద్ద సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Read More
Next Story