'డ్రైవర్‌లెస్' కారును ఆవిష్కరించిన టెస్లా!
ఈ కార్ల వలన యజమానులకు బోలెడు ప్రయోజనాలు. సమయం ఆదా అవుతుంది, నడిపే రిస్క్ లేదు. కారు దూసుకుపోతుంటే పుస్తకాలు చదవటమో, సినిమాలు చూడటమో చేయవచ్చు.
పాక్షికంగా డ్రైవర్ అవసరంలేని కార్లు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న అత్యాధునిక హై ఎండ్ కార్లలో అందిస్తున్న “అడాస్” అనే ఫీచర్ ద్వారా నిర్దిష్ట పరిస్థితుల్లో డ్రైవర్ లేకుండానే వాహనాన్ని నడపవచ్చు. పూర్తిగా డ్రైవర్ అవసరం లేని కారు తయారీలో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, గూగుల్ సంస్థకు చెందిన వేమో, జనరల్ మోటార్స్‌కు చెందిన క్రూజ్ అనే సంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే ఈ కార్లతో వాస్తవిక పరిస్థితులలో ఎలాంటి ముప్పు ఉంటుందో అనే అనుమానంతో ప్రభుత్వాలు వీటి తయారీకి అనుమతులు ఇవ్వటంలేదు. ఈ తరుణంలో ఎలాన్ మస్క్ ఇవాళ స్టీరింగ్ వీల్, పెడల్స్ లేని, ఏ మాత్రం మనుషుల అవసరం లేని సైబర్ క్యాబ్ అనే పూర్తి ఆటోమేటిక్ కారును ఆవిష్కరించినట్లు ప్రకటించారు. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్‌లో జరిగిన “వియ్ రోబో” అనే ఒక కార్యక్రమంలో సైబర్ క్యాబ్‌తోపాటు, 20 మంది మనుషులు ప్రయాణించగలిగే “రోబో వ్యాన్”ను, ఆప్టిమస్ అనే ఒక హ్యూమనాయిడ్ రోబోను కూడా ఆవిష్కరించారు.
సైబర్ క్యాబ్
సైబర్ క్యాబ్ ధర సుమారు 30,000 డాలర్లు ఉంటుందని, దీనిని వైర్‌లెస్ టెక్నాలజీతో ఛార్జింగ్ చేయవచ్చని మస్క్ చెప్పారు. ఈ కారులో ప్రయాణం ప్రభుత్వ రవాణా కంటే చౌకగా ఉంటుందని, ప్రభుత్వ రవాణా వాహనాలలో ప్రయాణీకుడికి మైలుకు 1 డాలర్ ఖర్చుచేయవలసి ఉండగా, సైబర్ క్యాబ్‌లో కేవలం 20 సెంట్లు మాత్రమే ఖర్చవుతుందని అన్నారు. మనుషులు నడిపే కార్లకంటే ఈ కార్లు 10-20 రెట్లు సురక్షితమని చెప్పారు. ఇది చాలామంది జీవితాలను, కాపాడుతుందని, గాయాలను నివారిస్తుందని అన్నారు. మరోవైపు ఈ కార్ల వలన యజమానులకు బోలెడు సమయం ఆదా అవుతుందని, వారికి నడిపే అవసరం ఉండదు కాబట్టి, ఆ సమయంలో పని చేసుకోవటమో, పుస్తకాలు చదవటమో, సినిమాలు చూడటమో చేయవచ్చని చెప్పారు. బ్రేక్, యాక్సిలేటర్, క్లచ్ వంటి పెడల్స్ దీనిలో ఉండకపోవటంవలన సీట్లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు. కారుకు రెండు తలుపులు ఉంటాయని, అవి సీతాకోక చిలుక రెక్కలలాగా తెరుచుకుంటాయని చెప్పారు.
రోబో ట్యాక్సీగా సైబర్ క్యాబ్ - డబుల్ ఆదాయం
సాధారణంగా కార్లు అత్యధిక సమయం ఊరికే పడి ఉంటాయని, అయితే సైబర్ క్యాబ్‌లు అలా ఉండకుండా యజమానులకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయని మస్క్ అన్నారు. సైబర్ క్యాబ్‌లను ఊబర్, ఓలాల లాగా టెస్లా యాప్‌లలో రిజిస్టర్ చేసుకుంటే యజమానులు ఉపయోగించని సమయాలలో రోబో ట్యాక్సీగా మార్చి బాడుగకు తిప్పుకోవచ్చని తెలిపారు.
ఆప్టిమస్ రోబో ధర 20,000 నుంచి 30,000 డాలర్లు ఉండవచ్చని మస్క్ తెలిపారు. ఈ రోబోతో అనేక రకాలైన చిన్న చిన్న పనులను చేయించటంతోపాటు, దానితో స్నేహాన్ని కూడా చేయవచ్చు. మరోవైపు, రోబో వ్యాన్‌లో కూడా స్టీరింగ్ వీల్, పెడల్స్, డ్రైవర్ ఉండరు.
ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
సైబర్ క్యాబ్‌ల తయారీ 2026లో మొదలవుతుందని, అయితే అవి బయటకు వచ్చేటప్పటికి 2027 దాకా పట్టవచ్చని మస్క్ చెప్పారు. అయితే డ్రైవర్ పర్యవేక్షణ అవసరం లేని ఫుల్లీ ఆటోమేటిక్ సాంకేతిక పరిజ్ఞానం వచ్చే ఏడాది నుంచి టెక్సాస్, క్యాలిఫోర్నియా రాష్ట్రాలలో తమ టెస్లా మోడల్ 3, మోడల్ వై కార్లలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ టెక్నాలజీని మోడల్ ఎస్, సైబర్ ట్రక్‌లలోకి ఆ తర్వాత తెస్తామని చెప్పారు.
విమర్శలు
ఎలాన్ మస్క్ ఇవాళ ప్రకటించిన రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్, ఆప్టిమస్ వంటి ఉత్పాదనలు వేటికీ స్పష్టమైన టైమ్ లైన్ ఇవ్వకపోవటం విమర్శలకు దారి తీసింది. మస్క్ ఈ డ్రైవర్ లెస్ కారు గురించి 2016 నుంచి ప్రతి సంవత్సరమూ, వచ్చే ఏడు రాబోతోంది అంటూ చెబుతూనే వస్తున్నాడని పలువురు విమర్శిస్తున్నారు.
మరోవైపు, అసలు ప్రస్తుతం అమెరికాలో రోడ్లపై నడిచే పాక్షిక ఆటోమేటిక్ కార్లతోనే ప్రమాదాలు జరిగిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల ప్రాణాలు కూడా పోయాయి. ఆటో పైలట్ మోడ్‌లో కారు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్న టెస్లా కార్ల యజమానుల కుటుంబీకులు అమెరికా కోర్టులలో టెస్లాపై దావాలు వేశారు. అమెరికాలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెక్నాలజీపై అంత నమ్మకం కనబరచటంలేదు.
అటు ఎలాన్ మస్క్ వ్యవహారశైలి కూడా వివాదాస్పదంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్‌ను కొనుగోలు చేసి దానికి ఎక్స్ అని పేరు పెట్టి సిబ్బందిని గణనీయంగా తగ్గించటంతో చాలామంది వినియోగదారులు దానిని వదిలేసి వేరే ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నారు. ఇప్పుడేమో అమెరికా అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు మద్దతు ప్రకటించి, వలసదారులకు వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రచారసభలో డాన్స్ చేయటాన్ని చాలామంది వెక్కిరిస్తున్నారు.