రోజుకు ఎన్ని క్యూసెక్స్‌ కృష్ణా నీరు సముద్రంలో కలుస్తుందో తెలుసా?
x

రోజుకు ఎన్ని క్యూసెక్స్‌ కృష్ణా నీరు సముద్రంలో కలుస్తుందో తెలుసా?

కృష్ణా నదీ జలాలు రోజుకు ఎన్ని లక్షల క్యూసెక్స్‌ సముద్రంలో కలుస్తున్నాయి. అవకాశాలు ఉన్నా నీటిని ఉపయోగించుకోవడం పాలకులకు ఎందుకు చేత కావడం లేదు.


వరదలు వచ్చినప్పుడల్లా్ల ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ జలాలు లక్షల క్యూసెక్స్‌ సముద్రం పాలవుతున్నాయి. ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నా పాలకులకు చేతకావడం లేదు. ఉచిత పథకాల పేరుతో కోటాను కోట్లు అప్పులు తెచ్చి పంచిపెడుతున్న పాలకులు ప్రజలకు శాశ్వత తాగు, సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. అధికారమే పరమావధిగా పాలన సాగిస్తున్నారే తప్ప భవిష్యత్‌ తరాలపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు ఐదేళ్లు మాత్రమే ప్రజలు అవకాశం ఇచ్చారని, ఈ ఐదేళ్లలో తాము వారి సంక్షేమం చూడగలిగితే చాలంటున్న పాలకులు ఉన్నంత కాలం భవిష్యత్‌ అంధకారంగానే ఉంటుందనేది రాష్ట్రంలోని మేధావుల మాట.

ఒకప్పుడు నాగార్జున సాగర్, దవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏపీలో నీటి కొరత కొంత వరకు తీరి ప్రజలు కరువు కాటకాల నుంచి బయట పడ్డారు. రాయలసీమ నేటికీ కరువు సీమగానే ఉంది. వందల ప్రాజెక్టులు రాయలసీమలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి నీటిని నింపుకోవడం పాలకులకు చేత కావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం పాలకుల్లో చిత్తశుద్ధిలోపం. గత ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మరమ్మతులు లేవు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా శ్రీశైలం ఎగువ నుంచి వరద నీటిని నిబంధనల ప్రకారం తీసుకొని రాయలసీమకు అందించడం కూడా ప్రభుత్వానికి చేతకాలేదు. ఎత్తిపోతల ద్వారా నీరు తీసుకుంటే అక్కడి రిజర్వాయర్లు ఉంటాయో తెగిపోతాయో తెలియదు. కాలువల మరమ్మతులు లేక నీరు ముందుకు సాగే అవకాశం లేకుండా పోయింది. శ్రీశైలం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ (ఎస్‌ఆర్‌ఎంసీ) మరమ్మతుల్లోనే ఉంది. బనకచర్ల క్రాస్‌ వద్ద వెలుగోడు నుంచి మద్రాస్‌కు తాగునీరు అందించే తెలుగు గంగ కాలువ కూడా పూడిపోతోంది. శ్రీశైలం రైట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఈ కాలువకు కూడా నీరు వదిలితే ఎటు చేరుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. గోరుకల్లు రిజర్వాయర్‌ పూర్తి కాలేదు.
శ్రీశైలం డ్యామ్‌ నిండితే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ద్వారా 44 వేల క్యూసెక్స్‌ నీరు రాయలసీమకు తీసుకోవచ్చు. మల్యాల ఎత్తిపోత పథకం ద్వారా హంద్రీ నీవాకు నీరు ఇవ్వొచ్చు. కానీ కాలువలు మరమ్మతుల్లో ఉన్నాయని ఏళ్ల తరబడి చెబుతూ పాలకులు కాలం గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండా ఎడమ గట్టులో తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించింది. 31,784 క్యూసెక్స్‌ నీరు ఇందుకు తరలిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటి మళ్లింపు జరుగుతోంది. అయినా ఏపీ అధికారులు కానీ, పాలకులు కానీ పట్టించుకోవడం లేదు.
శ్రీశైలం రిజర్వాయర్‌ ద్వారా ఈనెల 2వ తేదీ నుంచి ప్రతి రోజూ సుమారు మూడు లక్షల క్యూసెక్స్‌ పైన నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు నీరు విడుదలవుతోంది. ఈ వారంలో సుమారు 25 లక్షల క్యూసెక్స్‌ వరద నీరు శ్రీశైలం నుంచి కిందకు విడుదలైంది. అలాగే విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు రోజూ ఇన్‌ఫ్లో సుమారు రెండున్నర లక్షల క్యూసెక్స్‌ వస్తుండగా అంతే మొత్తం బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి గేట్లు ఎత్తి అధికారులు వదిలేస్తున్నారు. ఉన్న నీటిని ఉపయోగించుకోవడం చేతకాని పాలకులు నదులను అనుసంధానం చేస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారు.
2024 ఆగస్ట్‌ 10 రాత్రి 6.30 గంటల సమయంలో శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 2,36,898 క్యూసెక్స్‌ నీరు వస్తుండగా, అవుట్‌ ఫ్లో 3,64,207 క్యూసెక్స్‌ ఉంది.
ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 2,70,199 క్యూసెక్స్‌ ఇన్‌ఫ్లో ఉండగా అవుట్‌ ఫ్లో కూడా 2,70,199గా ఉంది. ఈనెల మూడో తేదీ నుంచి బ్యారేజ్‌ నుంచి వరద నీరు సముద్రం పాలవుతోంది. మూడు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యారేజ్‌పై కలియ తిరిగారు. సముద్రం పాలవుతున్న నీటిని పరిశీలించారు. భారీ స్థాయిలో నది ప్రవహించడం సంతోషంగా ఉందన్నారు. సముద్రం పాలవుతున్న నీటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
సీఎంలు రాయలసీమ వారే.. అయినా..
రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు రాయలసీమ వారు. అయినా రాయలసీమ ప్రాజెక్టులను నిధుల కొరత వెంటాడుతోంది. చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయడం లేదని రాయలసీమ తాగునీటి సాధన సమితీ అధ్యక్షులు బొజ్జా దశరధ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మతులు చేస్తే ప్రధానమైన రిజర్వాయర్లన్నీ బాగవుతాయన్నారు. పోతిరెడ్డిపాడు, మల్యాల ఎత్తిపోతల పథకాలు పనిచేయాలంటే కాలువలు, రిజర్వాయర్లు బాగుపడాలన్నారు. శ్రీశైలంలో పూర్తి స్థాయిలో నీరు ఉన్నా ఉపయోగించుకోవడం పాలకులకు చేతకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీశైలం నీరు తీసుకు రావడానికి మల్యాల పనులు అడ్డొస్తున్నాయా?
మల్యాల ఎత్తిపోతల పథకం కాలువ కర్నూలు–గుంటూరు రోడ్డు పనుల వల్ల పూడ్చారని, ఈ కారణంగా శ్రీశైలం నీరు ఉపయోగించుకోలేక పోతున్నామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వ పనితీరును దుయ్యబట్టారు. రాయలసీమలోని సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులను బాగు చేయాలనే ఆలోచన పాలకుల్లో ఏ ఒక్కరికీ లేదన్నారు. ఉన్న నీటిని ఉపయోగించుకోవడం చేతకాని పాలకులు ప్రాజెక్టులపై మాట్లాడే హక్కును కోల్పోయారన్నారు.
కృష్ణా జలాల అంశంపై సీఎంకు లేఖ రాసిన లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్‌ టి లక్ష్మీనారాయణ కృష్ణా జలాల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లేఖ రాసినట్లు తెలిపారు.
బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో ఈనెల 28, 29 తేదీలలో విచారణకు రానున్న కృష్ణానదీ జలాల అంశంపై మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావుతో పాటు రైతు సంఘాల నేతలు అక్కినేని భవానీ ప్రసాద్, వై కేశవరావు, కెవివి ప్రసాద్, బొజ్జా దశరథరామిరెడ్డి, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణలతో కూడిన ప్రతినిధి బృందం సీఎంకు వినతిపత్రం అందజేయాలని అపాయింట్మెంట్‌ కోసం జూలై 30న ప్రయత్నిస్తే సాధ్యం కాలేదన్నారు. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ లేవనెత్తిన వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ వైఖరిని తెలియజేయడానికి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన గడువు మరో వారం రోజుల్లో ముగియనున్నది. జల వనరుల శాఖకు సంబంధించిన అంశాలపైన ఆగస్టు 6న ముఖ్యమంత్రి సమీక్ష చేసినట్లు దినపత్రికల్లో చదివాను. ఈ సమస్య ప్రస్తావన వార్తల్లో ఎక్కడా కనపడలేదు.
కృష్ణా్ణ జలాలపై బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిన హక్కుల పరిరక్షణ జీవన్మరణ సమస్యగా పరిణమించింది. ప్రత్యేకించి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, హంధ్రీ నీవా, సుజల స్రవంతి, గాలేరు – నగరి, శ్రీ పూల సుబ్బయయ వెలిగొండ ప్రాజెక్టుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలని 2015 జూన్‌ 18న జరిగిన అధికారుల సంయుక్త సమావేశం నిర్థారించిన, మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ చేసిన నిర్ణయమే రెండు రాష్ట్రాలకు శిరోధార్యం. అంటూ గతం నుంచి ఇప్పటి వరకు ఏమి జరిగిందనే వివరాలతో లేఖను సీఎం చంద్రబాబుకు పంపించినట్లు తెలిపారు.


Read More
Next Story