కిర్గిజ్‌స్థాన్‌లోని ఛత్తీస్‌ఘడ్ విద్యార్థులకు సీఎం విష్ణు దేవ్ అభయం
x

కిర్గిజ్‌స్థాన్‌లోని ఛత్తీస్‌ఘడ్ విద్యార్థులకు సీఎం విష్ణు దేవ్ అభయం

కిర్గిజ్‌స్థాన్‌లో భారతీయ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? వైద్యవిద్యను అభ్యసించేందుకు ఆ దేశాన్ని ఎన్నుకోడానికి కారణమేంటి? ఛత్తీస్‌ఘడ్ సీఎం సాయి ఏం అభయమిచ్చారు?


కిర్గిజ్‌స్థాన్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ సీఎం విష్ణు దేవ్ సాయి అక్కడ చదువుకుంటున్న తమ రాష్ట్ర విద్యార్థులతో మాట్లాడారు. వారికి సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

ఇండియా నుంచి 15 వేల మంది..

భారతదేశం నుంచి వెళ్లిన సుమారు 15వేల మంది విద్యార్థులు కిర్గిజ్‌స్థాన్‌లో మెడిసిన్, ఇతర కోర్సులు అభ్యసిస్తున్నారు. వీరిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన విద్యార్థులు 70 దాకా ఉన్నారు.

ఇటీవల కొందరు ఆకతాయిలు విదేశీయులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుండడంతో కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్‌కెక్‌లోని భారత విద్యార్థులు గదుల నుంచి బయటకు రావద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన విజయ్, జంజ్‌గిర్-చంపా జిల్లాకు చెందిన శివాని అనే విద్యార్థులతో సీఎం సాయి ఫోన్‌లో మాట్లాడారు.వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కిర్గిస్థాన్ అధికారులతో భారత ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం వారికి భరోసా ఇచ్చారు.

విద్యార్థులకు ఎలాంటి సహాయం కావాలన్నా చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.

అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను విద్యార్థులు సీఎంకు వివరించారు. హాస్టల్ గదులను దాటి బయటకు వెళ్లవద్దని చెప్పారని, తమకు ఆహారం, నీరు అందిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఇండియాకు తిరిగి రావడానికి రిటర్న్‌ టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు విద్యార్థులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వ సహకారంతో విద్యార్థులందరూ సురక్షితంగా తిరిగి వచ్చేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.

రాయ్ ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా-పెండ్రా-మార్వాహి జిల్లాకు చెందిన అయేషా షెరెన్ రాయ్ బిష్‌కెక్‌లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. తన మేనకోడలు బిష్‌కెక్‌లో చిక్కుకుపోయిందని ఆయేషా మేనమామ ఒలివర్ రాయ్ విలేకరులతో అన్నారు. ఆమెను సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు గురువారం అధికారులకు విజ్ఞప్తి చేశారు.

" నా మేనకోడలు అక్కడ MBBS కోర్సు చదువుతోంది. ఆమెను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని మా సిఎం, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్ (మాజీ సిఎం రమణ్ సింగ్)ని అభ్యర్థించాను’’ అని ఒలివర్ రాయ్ చెప్పారు.

తన కుటుంబ సభ్యులకు పంపిన వీడియో సందేశంలో రాయ్ "నేను కిర్గిస్థాన్‌లో MBBS మూడో సంవత్సరం చదువుతున్నా. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నేను ఇండియాకు తిరిగి రావాలనుకుంటున్నాను. భారత ప్రభుత్వం మమ్మల్ని రక్షించాలి’’ అని వేడుకోంది.

టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..

కిర్గిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కేశ్‌లో వివిధ కోర్సులు అభ్యసించడానికి వెళ్లిన విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. దాడుల్లో ఇప్పటికే పాకిస్థాన్‌కి చెందిన నలుగురు విద్యార్థులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర చర్యలు తీసుకుంది. ఇప్పటికే 24 గంట‌లు అందుబాటులో ఉండే 0555710041 ఫోన్ నంబ‌ర్ కూడా ఇచ్చింది.

భారతీయ విద్యార్థులు కిర్గిజ్‌స్థాన్‌ను ఎందుకు ఎంచుకుంటున్నారు?

దాదాపు 15,000 మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం కిర్గిజ్‌స్థాన్‌లో చదువుతున్నారు. రష్యా, ఉక్రెయిన్‌తో పాటు, కిర్గిజ్‌స్థాన్ కూడా వైద్య విద్యనందిస్తోంది. మిగతా దేశాలతో పోలిస్తే.. మెడిసిన్ చేసేందుకు అయ్యే ఖర్చు తక్కువ. MBBS డిగ్రీ, క్లినికల్ ట్రైనింగ్‌తో కలిపి సుమారు రూ. 22 లక్షలు ఖర్చవుతుంది. కిర్గిజ్‌స్థాన్‌లోని చాలా వైద్య కళాశాలలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)చే గుర్తింపు పొందిన వైద్య కోర్సులను అందిస్తుండడంతో భారతీయ విద్యార్థులు కిర్జిజ్‌స్థాన్‌కు క్యూ కడుతున్నారు.

Read More
Next Story