భారీసంఖ్యలో 15 లక్షలమంది రావటంతోనే ప్రమాదం: తమిళనాడు ప్రభుత్వం!
తొక్కిసలాట, నిర్వహణలోపంవల్ల ఈ పరిస్థితి తలెత్తలేదని, బీచ్ రోడ్‌లో మంచినీటి వసతి లేకపోవటం, ఎండ తీవ్రత పెరగటంతో ఇది జరిగిందని డీఎంకే నేతలు చెప్పారు.
నిన్న చెన్నైలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం తీవ్ర రూపు దాల్చింది. ఊహించినదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా 15 లక్షలమంది ప్రజలు రావటంతోనే ఈ దుర్ఘటన జరిగిందని స్టాలిన్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి 92వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న చెన్నైలోని మెరీనా బీచ్‌లో జరిగిన ఎయిర్ షో చూడటానికి పెద్దసంఖ్యలో జనం రావటంతో ఏర్పడిన అల్లకల్లోలంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 90మంది ఆసుపత్రిపాలయ్యారు. దీనికి కారణం స్టాలిన్ ప్రభుత్వం అక్కడ కనీస స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవటమేనని ప్రతిపక్షాలు అన్నీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పళనిసామి తప్పంతా ప్రభుత్వానిదేనని అన్నారు. తగినంతగా భద్రతా ఏర్పాట్లు చేయకపోవటం, ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఈ ప్రమాదం జరిగిందని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. మరోవైపు పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. తప్పిదాలనుంచి గుణపాఠం నేర్చుకోవాలని చెప్పారు. జనం పెద్దసంఖ్యలో వస్తారని తెలిసినా, ఏర్పాట్లు తగినట్లుగా చేయలేదని అన్నారు. నిన్న 10 గం. దాటినా కూడా బస్ స్టాపులు, మెట్రో స్టేషన్‌లు, ఎమ్ఆర్‌టీఎస్ స్టేషన్లలో ఎయిర్ షో ప్రేక్షకులు తండోపతండాలుగా ఉండటం తాను చూశానని చెప్పారు.
మరోవైపు డీఎంకే ప్రభుత్వం దీనిపై తమను తాము సమర్థించుకోవటానికి ప్రయత్నించింది. తొక్కిసలాట, నిర్వహణలోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తలేదని డీఎంకే నేతలు చెప్పారు. బీచ్ రోడ్‌లో మంచినీటి వసతి లేకపోవటం, ఎండ తీవ్రత పెరగటంతో ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఈ ఎయిర్ షోకు పదిలక్షలమంది వస్తారని అంచనా వేయగా, పదిహేను లక్షలమంది రావటంతో అల్లకల్లోలం ఏర్పడిందని డీఎంకే నాయకుడు టీకేఎస్ ఇళాంగోవన్ అన్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు ఆలయాలలో జరిగే ఉత్సవాల సమయంలో చోటు చేసుకుంటాయని చెప్పారు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, ఈ ఘటన తనను కలచివేసిందని అన్నారు. ఆరోగ్యశాఖమంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ, 102 మంది ఆసుపత్రులలో చేరారని, వారిలో 40 మంది డిశ్ఛార్జ్ అయ్యారని చెప్పారు.