వానలనుంచి రక్షణకు చెన్నై కారు యజమానుల తెలివైన ఎత్తు!
x

వానలనుంచి రక్షణకు చెన్నై కారు యజమానుల తెలివైన ఎత్తు!

గతంలో చెన్నైలో 2015, 2021, 2023 సంవత్సరాలలో భారీవానల కారణంగా వాహనాలలోకి నీళ్ళు వెళ్ళిపోయి పాడయిపోవటంతో ఆ పరిస్థితిని నివారించటానికి ఈ ఉపాయం పన్నారు.


ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీని మాత్రమే కాకుండా తమిళనాడును కూడా వానలు దంచికొడుతున్నాయి. తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో అత్యధికంగా 13 సెం.మీ.ల వర్షపాతం నమోదయింది. చెన్నైలో గత 24 గం.ల వ్యవధిలో అత్యధికంగా 10 సెం.మీ. వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా కోలత్తూర్, వ్యాసర‌పాడి, పులియాంతోప్, ఓల్డ్ మహాబలిపురం రోడ్(ఓఎమ్ఆర్) ప్రాంతాలలో నీళ్ళు బాగా నిలిచిపోయాయి. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మోటార్ పంపుల సాయంతో నీటిని తోడిపోస్తున్నారు. 16 దాకా వానలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిఉంది.

వేలచ్చేరి ప్రాంతంలోని కారు యజమానులు తమ వాహనాలను వానలనుంచి కాపాడుకోవటానికి ఒక కొత్త ఎత్తు వేశారు. గతంలో 2015, 2021, 2023 సంవత్సరాలలో ఇలా భారీవానల కారణంగా నేలపైగానీ, సెల్లార్‌లో గానీ ఎక్కడ పార్క్ చేసినా వాహనాలలోకి నీళ్ళు వెళ్ళిపోయి పాడయిపోవటంతో ఆ పరిస్థితిని నివారించటానికి ఒక ఉపాయం పన్నారు. తమ ప్రాంతంలో ఉన్న వేలచ్చేరి ఫ్లై ఓవర్‌పైకి కార్లను తీసుకువెళ్ళి ఒక వారగా పార్క్ చేశారు. పోలీసులు ఫైన్ వేసినా, అది వాహనాలు పాడయితే అయ్యే ఖర్చుకంటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎత్తు వేశారని అంటున్నారు. నిన్న ఉదయంనుంచి వందలమంది కారు యజమానులు తమ వాహనాలు ఫ్లై ఓవర్ పైన రెండు వైపులా పార్క్ చేసిపెట్టారు. పార్క్ చేసిన కార్లలో నానో నుంచి ఔడి, బీఎమ్‌డబ్ల్యూ దాకా వేర్వేరు రేంజ్ వాహనాలు ఉన్నాయి పోలీసులు బ్రిడ్జిపైకి చేరుకుని ఈ కార్లు అన్నింటికీ ఫైన్‌లు విధించారని మొదట వార్తలు వచ్చినప్పటికీ, ఇవాళ చెన్నై పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు దీనిపై ఒక వివరణ ఇచ్చారు. ఫ్లై ఓవర్‌పై పార్క్ చేసిన కార్లకు తాము ఎలాంటి జరిమానా విధించలేదని, పుకార్లను నమ్మవద్దని తెలిపారు.

మరోవైపు కొన్ని గేటెడ్ కమ్యూనిటీలలోని కారు యజమానులు మరో మార్గాన్ని అనుసరించారు. తమ కార్లను సెల్లార్ నుంచి తీసుకొచ్చి గ్రౌండ్ ఫ్లోర్‌‍లోని ప్యాసేజ్‌లో ఒక వారగా పార్క్ చేశారు. ఇక అపార్ట్‌మెంట్‌లలో ఉండే టూ వీలర్ యజమానులైతే మరో ఎత్తు వేశారు. తమ వాహనాలను లిఫ్టులో తీసుకెళ్ళి తమ ఫ్లోర్‌లోని కారిడార్‌లలో పార్క్ చేసుకున్నారు. అందుకే అంటారు శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు అని!





ఇది ఇలా ఉంటే, వరుసగా నాలుగు రోజులు భారీ వర్షాలు ఉంటాయని చెప్పటంతో జనం “ప్యానిక్ బయ్యింగ్‌” బాట పట్టారు. పాలు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. దీనితో సూపర్ మార్కెట్‌లలో కూరగాయల స్టాక్ తుడిచిపెట్టినట్లు ఖాళీ అయిపోయింది.

Read More
Next Story