వీధుల్లో పశువులు.. పందులు.. కుక్కలు.. కనిపించాయనుకో..
x

వీధుల్లో పశువులు.. పందులు.. కుక్కలు.. కనిపించాయనుకో..

ఆంధ్రప్రదేశ్‌ పట్టణాలు, పల్లెల్లో పశువులు, పందులు, కుక్కలు కనిపించడం సాధారణమైన అంశం. ఇకపై ఇవి కనిపించాయనుకో... ఏమి జరుగుతుందో తెలుసా...


పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకు కాస్త కోపం వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ పశువులు, పందులు, కుక్కలు రోడ్లపై తిరుగుతూ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగ జేస్తున్నాయి. వీటిని రోడ్లపై లేకుండా చేయలేమా... ఎందుకు మౌనం... ఏమిటి చెప్పండి... అంటూ పురపాలక శాఖ అధికారులను కాస్త గట్టిగా ప్రశ్నించారు నారాయణ. ఐఎఎస్‌లు, గ్రూప్‌–1 అధికారులు ఉన్నారు. ఒక్కరి నుంచి కూడా సమాధానం రాలేదు. మంత్రిగారికి దిక్కు తోచలేదు. మాట వినకుండా పైపైకి చూస్తూ అరాచకాలు చేస్తున్న మనుషులను సైతం కట్టడి చేస్తున్నాం. గొడ్డు కో దెబ్బ... మనిషికో మాట.. అన్నారు పెద్దలు. అటువంటిది గొడ్లను కొంట్రోల్‌ చేయలేకపోతే మనుషులను ఎలా కంట్రోల్‌ చేస్తాం... అనుకున్నారు మంత్రి మనసులో...

అంతే... మునిసిపల్‌ కమిషనర్లకు ఓ మాట చెప్పారు. రోడ్లపై పశువులు, పందులు, కుక్కలు కనిపించకూడదు. సెప్టెంబరు 30 నాటికి పట్టణాలు, పల్లెల్లో రోడ్లపై ఇవి కనిపిస్తే నేనేమి చేస్తానో నాకే తెలియదు. పశువుల యజమానులకు చెప్పండి. ఇంట్లో కట్టేసుకోవాలి. లేదా పశువులను రోడ్లపై నుంచి తొలగించే కార్యక్రమానికి వెంటనే చర్యలు చేపట్టంyì . యజమానుల వివరాలు కనుక్కుని నోటీసులు ఇవ్వండంటూ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. పశువుల యజమానులు ఎక్కడుంటారో తెలియదు. వారిని గుర్తించడానికి మంత్రి గారు ఇచ్చిన సమయం సరిపోతుందో లేదో ఆలోచించాలి. అయినా అయ్యవారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అనే సామెత వారికి గుర్తుకు వచ్చింది. తలూపుతూ కూర్చున్నారు. పశువులు చాలా చోట్ల నగరాల్లో నడి రోడ్డుపై పండుకుంటున్నాయి. అక్కడే పేడ వేయడం, మూత్ర విసర్జన చేయడం చేస్తున్నాయి. అయినా అధికారులు పశువులకు కాపలా ఉండలేరు కదా... అందుకే రోడ్లపై ఆ పశువులది ఇష్టారాజ్యం అయింది.
ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తించాలి. చాలా పశువులకు యజమానులు లేరు. రోడ్లపై తిరిగే పశువులు తమవేనంటూ కొందరు ఆ పశువులను చూపించి ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారు. ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఆ పశువులకు ట్యాగులు వేస్తున్నాయి. పశువు వ్యాల్యూను బట్టి ఇన్స్‌రెన్స్‌ ఉంటుంది. ఇన్సూరెన్స్‌ పశువుకు తీసుకోగానే చెవులకు ట్యాగ్‌ వేస్తారు. ట్యాగ్‌ నెంబరుతో యజమాని పేరు, వివరాలు ఉంటాయి. పశువు చనిపోయిందంటే యజమాని ఇన్సూరెన్స్‌ క్లైమ్‌ చేస్తాడు. అంటే రోడ్లపై తిరిగే పశువులను దేవుడికి వదిలేశామని చెప్పుకునే యజమానులు ప్రమాదంలో చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్‌ క్లైం చేసుకోవడం ఇక్కడ గమనించాల్సి ఉంది. ఇదో పెద్ద మాపియాగా పలువురు చెప్పడం విశేషం. ఈ విషయం దాదాపు మునిసిపాలిటీ వారిలో కొందరికి తెలిసే ఉంటుందనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
వీధి కుక్కలు లెక్కలేనన్ని ఉన్నాయి. పిల్లను సైతం కరుస్తున్నాయి. ఒక్కో కుక్క కనీసం ఐదు నుంచి తొమ్మది పిల్లలను కంటుంది. వీధుల్లో ఏదో ఒక మూల వర్షం పడని ప్రదేశం చూసుకుని పిల్లను కని అక్కడ పాలు ఇస్తూ రోడ్డున నడిచే వారిని గమనిస్తూ ఉంటుంది. ఎవరైనా వాటివైపు చూశారంటే వారికి ఆరోజు మూడినట్లే... తరిమి తరిమి కరుస్తుంది. ఇలాంటి సంఘటనలు పట్టణాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. కొందరు యుక్తవయసు పిల్లలతో పాటు చిన్న పిల్లలు కూడా కుక్కపిల్లలతో ఆడుకోడానికి వెళుతుంటారు. ఎందుకంటే కుక్క పిల్లలు చిన్నవి కావడంతో ముద్దొస్తుంటాయి. ఆ కుక్క పిల్లలను పట్టుకోవడం తల్లి కుక్క చూసిందంటే పొర్లించి మరీ కరుస్తుంది. అది వారికి తెలియదు. అప్పుడు తల్లికుక్క బారిన పడి చావుబతుకుల్లో ఆస్పత్రి పాలవుతారు. ఆ కుక్క పిల్లలు కాస్త పెద్దవై బయటకు వచ్చాయంటే వీధిలో రచ్చ ఖాయం. ఎందుకంటే ప్రతి ఇంట్లోకి వెళతాయి. తలుపు తీశారంటే వెంటనే ఇంట్లోకి దూరుతాయి. వాటికి ఆహారం కావాలి. తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వెంపర్లాడుతుంటాయి. వాటిని కొట్టి బయటకు తరిమామో రోడ్డుపైనే ఉన్న తల్లి కుక్క ఊరుకుంటుందా... కొట్టిన వారిపై కక్ష పెంచుకుని ఏదో ఒక సమయంలో వారిని వెంటాడి కరుస్తుంది. అందుకే మంత్రి నారాయన పెంపుడు కుక్కలను కట్టి చేయాలని, వీధి కుక్కలకు ఆపరేషన్‌లు చేసి సంతతి లేకుండా చేయాలని, వెంటనే వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇది ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.
పందులు రోడ్డపైకి వచ్చాయంటే బైకులు, కార్లు బోల్తా పడాల్సిందే. ఎందుకంటే పందులు రోడ్డుకు రెండు వైపుల నుంచి ఎటంటే అటు పరుగెడుతుంటాయి. మురుగు కాలువల్లో పొర్లాడి నల్లటి మురుగునీరు కారుతుండగా జూలు విదిలించుకుంటూ రోడ్డుపైకి వస్తాయి. రోడ్డుకు అడ్డంగా పంది పరుగెడుతుంటే తప్పించే క్రమంలో వాహన యజమానులు దానికి తగిలి జారి కింద పడిపోయి తీవ్ర గాయాలు పాలు కావడం, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. పందులు మాత్రం తప్పించుకుని పారిపోతాయి. పందులు పెంచే వారు ఇంటి వద్ద నుంచి బయటకు వదిలేస్తారు. పట్టణాల్లో కాని, పల్లెల్లో కానీ రోడ్లపై తిరిగే పందులకు తప్పకుండా యజమానులు ఉంటారు. వాటిని ఒక కంట కనిపెడుతూ ఉంటారు కానీ పట్టించుకోరు. ఓపెన్‌ డ్రైజేజీ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పందులు తిరుగుతుంటాయి. స్లమ్‌ ఏరియాల్లో ఇక చెప్పాల్సిన పనిలేదు. విధులకు హాజరయ్యేందుకు ఇండ్లలో నుంచి బయటకు వచ్చే సమయంలో పందులు రోడ్డుపై ఉన్నాయా? లేవా? కాలువల్లో ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకున్న తరువాతనే మెట్లపై నుంచి కిందకు దిగుతుంటారు. అంటే ఎంతగా భయపడుతున్నారో ఆలోచించాలి. వీటెకు కూడా ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఫారాలు ఉన్నాయి. ఆఫారాల వారు పెంచి మాసం ప్రిజర్వు చేసి అమ్ముతుంటారు. అంతవరకు బాగానే ఉంటుంది. ఎటొచ్చీ రోడ్లపై తిరిగే పందులతోనే ప్రమాదం ఉంటుంది.
Read More
Next Story