ఆరో రోజుకూ ఆగని బుడమేరు వరద
ఆరో రోజూ వరద విజయవాడను విడవలేదు. శుక్రవారం ఉదయం బుడమేరు వరద నీరు పొంగుతోంది. ఆరు రోజులుగా ప్రజలు బుడమేరు వరదకు విలవిల్లాడారు.
గత ఆదివారం మధ్యాహ్నం 11 గంటల సమయం బుడమేరు నుంచి వరదనీరు ఒక్కసారిగా అజిత్ సింగ్ నగర్ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. వరద నీరు వస్తుందని ముందస్తు సమాచారం అధికారులు ఇవ్వలేకపోయారు. ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే ఇళ్లల్లో ఉన్న ప్రజలు తమ విలువైన సామాన్లు సేఫ్టీ ప్లేస్ లోకి మార్చుకునేవారు. కానీ ఆ అవకాశం అధికారులు కల్పించలేదు. దీంతో ఆరు రోజుల క్రితం ప్రారంభమైన వరద నీరు ముంచెత్తడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితులకు వెళ్ళిపోయాయి. ఈ వరదకి సంపన్నులేమి సపరేట్ కాదు వాళ్లు కూడా నరకం అనుభవించారు.
వరదనీరు పెరుగుతున్నప్పుడు..
ఆరు రోజుల క్రితం వరద నీరు పెరుగుతున్నప్పుడు అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, సుబ్బరాజు నగర్, న్యూ రాజరాజేశ్వరి పేట, అమరావతి కాలనీ, ప్రకాష్ నగర్, శాంతినగర్, వాంబే కాలనీ, ప్రగతి నగర్, పాతపాయకాపురం, ప్రశాంతి నగర్ కాలనీ, సుందరయ్య నగర్, కండ్రిక, ప్రజాశక్తి నగర్, జర్నలిస్ట్ కాలనీ ప్రాంతాల్లోని ప్రజలు ఒకసారిగా షాక్ కు గురయ్యారు. వరద నీరు వస్తుంటే ఇంట్లోంచి బయటికి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలా? ఇంట్లో విలువైన సామాన్లను భద్రపరుచుకోవాలా? లేదంటే బయటకు వెళ్లి ఇంట్లో ఉండడానికి కావలసిన సరుకులు తెచ్చుకోవాలా? ఇలా అనేక ప్రశ్నలతో తలడిల్లిపోయారు. చివరికి చేసేది లేక మొదటి రోజు ఇళ్లలోనే ఉండిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న వరద నీటి తాకిటికి పక్కనే ఉన్న భవన యజమానులను బ్రతిమిలాడుకొని కొంతమంది మొదటి అంతస్తు రెండో అంతస్తులో తలదాచుకునే ప్రయత్నం చేశారు. కొందరికి ఆ అవకాశం దొరికింది. ఆ అవకాశం కూడా లేని వాళ్ళు కట్టుబట్టలతో అజిత్ సింగ్ నగర్ ఫై ఓవర్ వరకు వరద నీటిలో నడిచారు. సేపెస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. వరద నీటి భయంతో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. కనీసం సాయం కూడా అందలేదు.
రెండవ రోజు...
ఇక రెండో రోజు వరద నీరు పీకల లోతుకు వచ్చేసింది. దీంతో ప్రజలు ప్రాణ భయంతో వణికి పోయారు. ఇంట్లో ఉండాలా లేదా ఎక్కడికైనా వెళ్లిపోవాలా తెలియక నరకం అనుభవించారు. అప్పటికే సరైన ప్లానింగ్ లేకపోవడంతో తాగడానికి నీరు, వాడుకో వడానికి నీరు లేకుండా పోయాయి. అప్పుడు ప్రారంభమైంది తాగునీటి సమస్య. ఉన్న నీటిని గుక్క గుక్కగా తాగడం స్టార్ట్ చేశారు. తాగు నీటిని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో కనీసం అధికారుల నుంచి సూచనలు లేవు. ఎటువంటి సాయం అందలేదు. పీకల్లో నీళ్లలో నుంచి బయటి రాలేక పోతున్నారు. దీంతో కొంతమంది పీకల్లోతు నీళ్లలోనే తమ పిల్లలను చేతబట్టుకొని ఎలాగైతే ఒడ్డుకు చేరుకొని తమకు తెలిసిన వారి ఇళ్లకు వెళ్లిపోయారు. మరి కొంతమంది ఫ్లైఓవర్ మీదే కాలం గడిపారు. మరి కొంతమంది విజయవాడలోని లాడ్జిల్లో రూములు తీసుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రెండో రోజు ఇండ్లలోని సామాన్లు నీళ్లలో తేలాడాయి. తమ ఇళ్లల్లో సామాన్లన్నీ నీళ్లలో మునిగిపోవడంతో భవిష్యత్తు మీద ఆశ లేకుండా పోయింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇక అపార్ట్మెంట్లో ఉన్నవారి పరిస్థితి మరింత దయనీయం. వాళ్ళ కార్లు, ద్విచక్ర వాహనాలు, జనరేటర్లు, వాటర్ మోటర్లు, వాచ్మెన్ రూములు, అన్ని పాడైపోయాయి. అపార్ట్మెంట్లో ఉన్న వారి పరిస్థితి మరింత దయనీయమైంది. తాగడానికి నీరు లేక వాడుకోవడానికి కూడా నీరు లేక ఏం చేయాలో తెలియక టెరాస్ పైన వర్షపు నీటిని పట్టుకొని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బయటికి వెళ్దామంటే పీకల లోతు నీరు ఇంట్లో ఉందామంటే కటిక చీకటి. దోమల బాధ ప్రతి ఒక్కరికీ నరకం గుర్తుకొచ్చింది.
మూడవ రోజు...
ఇక మూడో రోజు అధికారులందరూ అప్రమత్తమయ్యారు. అన్ని ప్రాంతాలకు సాయం అందించాలని ప్రయత్నాలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రాకతో ఒక్కసారిగా అధికారుల్లో చలనం వచ్చింది. భారీగా పోలీసులు ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వచ్చిన ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్లు, ఆహార పొట్లాలు అందించడం స్టార్ట్ చేశారు. రెండు రోజుల పాటు తిండికి దూరమైన ప్రజలు తమ అంతస్తులను కూడా మరిచి పొట్ట నింపుకునేందుకు ఎగబడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికే ఫ్లైఓవర్ మీదకు చేరుకున్నపడవలు లోపలికి వచ్చి సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ క్రమంలో కొంతమంది పడవ యజమానులు ప్రజల నుంచి భారీగా డబ్బులు కూడా వసూలు చేశారు. మీ ప్రాణాలు కాపాడాలంటే రూ. 5,000 నుంచి 35 వేల రూపాయల వరకు ఇవ్వాల్సిందేనని పట్టు బట్టారు ప్రాణాలు నింపుకునేందుకు కొంతమంది డబ్బులు ఇచ్చి మరి ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఇక హెలికాప్టర్ ద్వారా, డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు అందజేయడం, మంచినీరు అందజేయడం లాంటి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ప్రధాన రహదారుల్లో మాత్రమే ఇచ్చారని, చిన్నచిన్నరహదారులు ఉన్నవారికి సాయం అందలేదని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వచ్చిన పోలీసులంతా లోపల ఉన్న ప్రజలను కాపాడాలా లేక ఫ్లై ఓవర్ మీదే ఉం అచాలా అన్నట్టుగా వ్యవహరించారు. చాలామంది పోలీసులు ఫ్లైఓవర్ మీద కనిపించారు .ఇక ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది విషయానికొస్తే వాళ్లు ఎందుకు తిరుగుతున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది. కొంతమంది ప్రాణాలకు తెగించి కొంతమందిని కాపాడారు. మరి కొంతమంది పడవల్లో వీర విహారం చేశారు. ఇక్కడ హైలెట్ ఏంటంటే హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాలు అందించిన వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అదేవిధంగా డ్రోన్లు ద్వారా కూడా ఆహార పొట్లాలు అందించిన వారికి ధన్యవాదాలు చెప్పాల్సిందే.
నాలుగవ రోజు...
నాలుగో రోజు వరద నీరు ప్రవాహం తగ్గడం మొదలైంది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా ఇచ్చారు. దీంతో చాలామంది మంచినీటి ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఇక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందరికీ అందరికీ అందేలా సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు చాలా వరకు ప్రజలకు ఊరట కలిగించాయి. ప్రజల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి వరద నీరు తగ్గటం మొదలవడంతో దిగువన ఉన్న ఇంటి యజమానులు, అద్దెలకు ఉన్న వారు తమ ఇళ్లల్లో సామాన్లు ఏమేమి పోయాయో వెతుక్కోవడం ప్రారంభించారు. చాలా ఇండ్లలోని సామాన్లు రోడ్లపై వరద నీటిలో తేలాడుతూ కనిపించాయి. ఇంట్లో బురద పోవడానికి వరద నీటితోనే శుభ్రం చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే కింద ఫ్లోర్ లో ఉన్న వారి సామాన్లన్నీ నీట మునిగాయి ఇంట్లో ఏ వస్తువు ఉపయోగపడే పరిస్థితి లేదు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మళ్ళీ వాళ్ళు కోలుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. చేతిలో డబ్బులు లేవు. ఉండడానికి ఇల్లు లేదు. ఎవరైనా ఆశ్రయం ఇస్తారు అనుకుంటే ఆశ్రయం ఇచ్చే వాళ్ళు కూడా కష్టాల్లో ఉండటం చూశారు. ప్రభుత్వ సహాయం మాత్రమే వారికి దిక్కు. ఆహారం మంచి నీరు అందుతుంది చాలు అనుకునే పరిస్థితికి వచ్చేశారు. ఇక అపార్ట్మెంట్లో ఉన్నవారు సెల్లార్లో ఉన్న తమ వాహనాలు చూసి కన్నీరు పెట్టుకున్నారు. లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం, వాహన నష్టం జరిగిందంటూ ఆవేదన చెందుతున్నారు. వాహనాలకు ఇన్సూరెన్స్ వస్తుందో రాదోననే ఆవేదనలో ఉన్నారు.
ఐదవ రోజు...
ఐదో రోజు అంటే గురువారం మళ్లీ వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. కనీసం సమాచారం ఇచ్చే అధికారులు కనిపించడం లేదు. బయటికి రావాలా లేక ఇళ్లల్లో ఉండి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఇలాంటి అంశాల మీద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాహనాలు మరమ్మతులకు గురైన నేపథ్యంలో వాటిని మెకానికల్ వద్దకు చేర్చే పనిలో ప్రజల నిమగ్నమయ్యారు. నీళ్లలో ఐదు రోజులు పాటు మునిగి నానిన వాహనాల వారు ఓపిక నశించి దిక్కుతోచని పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారు. కరెంటు, మంచినీరు, పాలు, ఆహార సాయం అందుతున్నప్పటికీ మళ్లీ వరద వస్తుందనే భయం మాత్రం వెంటాడుతోంది.
ఆరో రోజు ఎలా ఉంది...
ఆరో రోజు కూడా రోడ్ల నుంచి వరద నీరు బయటకు పోలేదు. ఇండ్లలో బురద పేరుకు పోయింది. ఫైర్ ఇంజన్స్ వారు వచ్చి క్లీన్ చేస్తారని చెప్పినా రోడ్ల పైనుంచి లోపలి వీధుల్లోకి అగ్నిమాపక యంత్రాలు రాలేని పరిస్థితి ఉంది. మంచి నీటి ట్యాంకుల కోసం అన్ని ప్రాంతాల వారు ఎదురు చూస్తున్నారు. మురుగు నీటితోనే వస్తువులు కడగటం వల్ల నీచు వాసన వస్తోంది. మురుగు వాసనతో చాలా మంది వ్రుద్ధులు మంచాన పడ్డారు. వైద్య శిబిరాలు సచివాలయాల వద్ద తప్ప చిన్న వీధుల్లోకి రాలేదు.
సీఎం చంద్రబాబు పనితీరు చాలా బాగుంది...
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వయసులో కూడా వరద నీటి ప్రవాహం వద్దకు నాలుగు సార్లు రావడం విశేషం. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయటం మరొక విశేషం. ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేయడంలోనూ సక్సెస్ అయ్యారు. ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని స్వచ్ఛంద సంస్థల ద్వారా, ప్రభుత్వం ద్వారా సాయం అందించడంలో విశేష కృషి చేశారు. లక్షలాది మంది వరద నీటిలో ఉండటాన్ని చూసి ఆయన చేస్తున్న పని సమయం కూడా మర్చిపోయారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజల కష్టాలను తీర్చేందుకు స్వయంగా నీళ్లలో దిగటం, పడవ ప్రయాణం చేయటం అందరిని ఆకట్టుకుంది. అయితే అధికారులు సీఎం చుట్టూ ఉన్నారని, ప్రజల వద్దకు నేరుగా ఎవ్వరూ పెద్దగా రాలేదనే విమర్శలు ఉన్నాయి.