రేవంత్‌ను ఎదుర్కోవటానికి బీసీ అస్త్రం తీసిన కేసీఆర్!
రేవంత్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టటానికి ఏ మార్గమూ దొరకక బీసీ నినాదాన్ని పట్టుకోవాలని చూస్తున్నట్లుందనే వాదన వినబడుతోంది
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కొత్త కొత్త వ్యూహాలను పరిశీలిస్తోన్న బీఆర్ఎస్ బీసీ నినాదాన్ని ఎత్తుకోవాలని నిర్ణయించినట్లు కనబడుతోంది. బీసీలకు న్యాయంగా, ధర్మంగా రావలసిన హక్కులను, వాటాను దక్కించుకునేందుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మేమెంతో మాకంత, మా వాటా మాకే అనే నినాదాలతో పోరాటాన్ని జరపాలని ఆ పార్టీ బీసీ నాయకుల సమావేశంలో ఇవాళ నిర్ణయించారు.
బీఆర్ఎస్ బీసీ నాయకుల సమావేశం ఇవాళ హైదరాబాద్‌లో జరిగింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీమంత్రి శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్సీ రమణ తదితర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమం, సముద్ధరణ, ఆయా రంగాలలో రిజర్వేషన్స్ అమలు తదితర అంశాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాలలో పర్యటించాలని నిర్ణయించారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రివర్గంలో కేవలం ఇద్దరికే అవకాశమివ్వటం, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయాన బీసీ హక్కులకోసం పోరుబాట పట్టటానికి ఇది సరైన సమయమని అభిప్రాయపడ్డారు. చట్టసభలలో 33%, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
మరోవైపు, పది సంవత్సరాలు అధికారంలో ఉండి, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి కూడా, ఆ సమయంలో బీసీలను పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకోవటం వెనక ఆంతర్యమేమిటని ఇప్పుడు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం 2014 ఆగస్ట్ 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 51 శాతం ఉందని నమోదయింది. ఆ నేపథ్యంలో వారికి రిజర్వేషన్‌లు పెంచాలని అప్పటినుంచి డిమాండ్ బలంగా వినబడుతోంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం తాము అధికారంలో ఉన్న పది ఏళ్ళలో ఎన్నడూ ఆ నివేదిక వివరాలను బయటపెట్టలేదు. కాంగ్రెస్‌తో సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆ నివేదిక వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేసినప్పటికీ నాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఒకవైపు ఆ నివేదికలోని గణాంకాలను తాను మాత్రం ఉపయోగించుకుంటూ పథకాలను రూపకల్పన చేయటం, ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా చర్యలు చేపట్టటం, కొందరికి ఓటింగ్ అవకాశం లేకుండా చేయటం వంటి పనులకు పాల్పడింది.
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుండి ఈ బీసీ నినాదాన్ని ఎత్తుకోవటానికి కారణం - రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటానికి ఏ అస్త్రమూ కనిపించకపోవటమేనని అనిపిస్తోంది. ఒకవైపు హైడ్రాకు మంచి మద్దతు లభించటం, మరోవైపు ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పనులు శరవేగంగా జరగటం, ఇంకోవైపు స్కిల్ యూనివర్సిటీని దసరానుంచి ప్రారంభించనుండటం లాంటి పరిణామాలతో రేవంత్ ప్రభుత్వం మంచి ఊపుతో దూసుకుపోతుండటంతో బీఆర్ఎస్‌కు ఊపిరిసలపటంలేదు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టటానికి ఏ మార్గమూ దొరకక బీసీ నినాదాన్ని పట్టుకోవాలని చూస్తున్నట్లుందని అంటున్నారు.