హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ, కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమిదే విజయం!
హర్యానాలో జవాన్, పహిల్వాన్, కిసాన్ వర్గాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత బాగాఉందని, అదే తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశించింది. తీరా చూస్తే, ఫలితాలు విరుద్ధంగా వచ్చాయి.
హర్యానా, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ హర్యానాలో బీజేపీ వరసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ స్పష్టమైన ఆధిక్యతతో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి లీడింగ్‌లో ఉంది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే బీజేపీ ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునేటట్లుగా ఉంది. పది సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీపై ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం బాగా ఉంటుందని అందరూ ఊహించారు. దానికితోడు జవాన్, పహిల్వాన్, కిసాన్ వర్గాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉందని, అదే తమకు లాభిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆశించింది. తీరా చూస్తే, ఫలితాలు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల తేడా తక్కువగానే ఉంటోంది. అందుకే, చివరి రౌండ్‌లలోనైనా తమకు అదృష్టం కలిసివస్తుందేమోనని భావిస్తూ కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ హుడా, కుమారి సెల్జా ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనని ధీమాగా చెప్పుకొస్తున్నారు. ప్రాథమిక అంచనాలను బట్టి చూస్తే ఆప్ పార్టీ వలన కాంగ్రెస్ ఓట్లకు గండి పడటం బాగా ప్రభావం చూపిందని అంటున్నారు.
ఇక కశ్మీర్‌లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి మొదటినుంచీ స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతోంది. ఇప్పటికే 6 స్థానాలలో గెలిచి మరో 46 స్థానాలలో లీడింగ్‌లో ఉంది. కూటమి అధికారంలోకి వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లాయే ముఖ్యమంత్రి అవుతారు.