అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట
x

"అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట"

నా అక్క చెల్లెళ్ళు… అని దీర్ఘాలు తీసుకుంటూ జగన్ చెప్పేదంతా పైపై మాటలేనని, సొంత తల్లి, చెల్లినే కోర్టుకు లాగాడని విమర్శలు గుప్పించటానికి మంచి అవకాశం కల్పించారు.


వైఎస్ ఆస్తుల వ్యవహారాలు బజారున పడ్డాయని స్పష్టమైపోయింది. ప్రత్యర్థులకు జగన్మోహన్ రెడ్డి మరో అస్త్రం స్వయంగా బంగారుపళ్ళెంలో పెట్టి ఇచ్చారు. నా అక్క చెల్లెళ్ళు… అంటూ జగన్ చెప్పేదంతా పైపై మాటలేనని, సొంత తల్లి, చెల్లినే కోర్టుకు లాగాడని విమర్శలు గుప్పించటానికి ప్రత్యర్థులకు మంచి అవకాశం కల్పించారు. షర్మిల రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్ఠలను దెబ్బతీశారని, ఆమెకు తనపై ప్రేమలేదని తేలిందని, అందువల్ల చెల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసుకుంటున్నానని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల చెల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటున్నానని తెలిపారు. షర్మిల మోసగత్తె అని, దుర్మార్గురాలు అని, కపటప్రేమ నటించిందని ఆరోపణలు చేశారు. మరోవైపు ఆస్తులపై ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే, ఏమీ జరగనట్టుగా… ఇదంతా కూటమి ప్రభుత్వం చేసే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగం అని జనాన్ని నమ్మించటానికి జగన్ ప్రయత్నించటం విచిత్రంగా ఉంది.

మొన్నటి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో షర్మిల, విజయలక్ష్మి చేసిన వ్యతిరేక ప్రచారం ఒకటి అని అందరికీ తెలిసిందే. కొందరు వైసీపీ సీనియర్ నాయకులే ఆ విషయాన్ని తమ ఫలితాల విశ్లేషణలలో చెప్పారు. అలాంటి పరిస్థితిలో తల్లి, చెల్లితో రాజీ చేసుకోవాల్సిందిపోయి గొడవను ఇంకా పెద్దది చేసుకోవటం చూస్తుంటే జగన్ ఏదైనా పెద్ద వ్యూహంతో ఇదంతా చేస్తున్నాడా లేక మూర్ఖంగా పోతున్నాడా అనేది ఎవరికీ అర్థం కావటంలేదు.

ఆస్తుల విషయంలో జగన్ చేసే బలమైన వాదన ఏమిటంటే, ఆస్తులన్నీ తన స్వార్జితం, తన శక్తిసామర్థ్యాలతో సొంతంగా సంపాదించుకున్నవి అని. 2004కు ముందు వైఎస్ కుటుంబానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, 2009 ఎన్నికల నాటికి ఎన్ని ఉన్నాయి అనేది రాజకీయాలలో కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలిసిన విషయమే. ఆ ఆస్తులన్నీ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాకుండా, ఏ పారిశ్రామిక వేత్తలతో క్విడ్ ప్రోకో పెట్టుకోకుండా సంపాదించుకున్నానని నిర్మొహమాటంగా జగన్ చెప్పుకుంటే చెప్పుకోవచ్చునేమోగానీ, ప్రజలు ఆ మాటలను ఎంతవరకు నమ్ముతారన్నదే ప్రశ్నార్థకం.

పైగా, షర్మిలను తన మరో కూతురిగా చూసుకుంటానని చెప్పాడని, ఆస్తులను మనవడు, మనవరాళ్ళు నలుగురికీ సమానంగా పంచుతానని రాజశేఖరరెడ్డికి మాట ఇచ్చినట్లు వైఎస్ విజయలక్ష్మి తన జీవిత చరిత్రలో రాసిన వాక్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, చెల్లెలికి ఆస్తిలో వాటా ఎగ్గొట్టాడన్న అపవాదు నెత్తికి ఎత్తుకోవటం అవసరమా?

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి దీనిపై మాట్లాడుతూ, రాయలసీమలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న… "అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట" సామెత జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందని అన్నారు. అక్కడ సామెతలో అమ్మ - పిన్నమ్మ, ఇక్కడ అమ్మ - ప్రజలు అని చెప్పారు. అతనిది క్రూర మనస్తత్వం అని మరోసారి బయటపడిందన్నారు. తల్లి, చెల్లి, ప్రజలు… ఎవరూ కాదు, అతనికి కేవలం డబ్బు, అధికారమే ముఖ్యం అని చెప్పారు. ఇది తప్పనిసరిగా జగన్‌కు రాజకీయంగా నష్టం కలుగజేస్తుందన్నారు.

ఇలా కేసువేయటానికి మరో కారణం కూడా ఉండవచ్చని, ఇలా చేస్తే షర్మిలను ఆర్థికంగా దెబ్బ తీసినట్లవుతుందని, ఆర్థిక వనరులు లేకుండా చేస్తే ఆమెను రాజకీయంగా నిర్వీర్యం చేయవచ్చని ఆయన ఉద్దేశ్యం అయిఉండొచ్చని తులసిరెడ్డి చెప్పారు. ప్రజలు దేనినీ ఎక్కువగా గుర్తుంచుకోరని అతని ధీమా కూడా అయిఉండవచ్చని అన్నారు. అయితే దీని ప్రభావం వెంటనే ఏమీ ఉండకపోవచ్చుగానీ, జనం మనసులో ఒక అభిప్రాయం ఏర్పడుతుందని, ఇలాంటివన్నీ పోగుపడతాయని తులసిరెడ్డి చెప్పారు.

మరోవైపు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఈ అంశంపై ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ, 2004కు ముందు మీ ఆస్తులు ఎంత, తండ్రిని అడ్డు పెట్టుకుని నువ్వు సంపాదించిన ఆస్తులు ఎంత అని జగన్‌ను ప్రశ్నించారు. యావత్ భారతదేశంలో నీలాగా బూటకపు కంపెనీలు పెట్టి సంపాదించినవాడు ఎవరూ లేరని అన్నారు. నా తండ్రిని రిలయెన్స్ వాళ్ళు చంపారని ఆరోపించి, తర్వాత వాళ్ళ మనిషికి రాజ్యసభ టికెట్ ఇచ్చావు అని విమర్శించారు.

Read More
Next Story