హైదరాబాద్‌లో తగ్గనున్న కాలుష్యం: ఆర్టీసీ బస్సులన్నీ ఇక ఎలక్ట్రిక్‌వే!
నగరంకోసం మొత్తం 2,500 ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నామని, ఇప్పటికే 500 బస్సులు నగరంలో తిరుగుతున్నాయని తెలిపారు. త్వరలో మిగిలినవి దశలవారీగా ప్రవేశపెడతామని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో అత్యధికంగా కాలుష్యానికి కారణమైనవాటిలో ఆర్టీసీ బస్సులు అన్న సంగతి తెలిసిందే. అయితే అదంతా గతం. ఇకనుంచి ఈ పరిస్థితి మారబోతోంది. నగరవ్యాప్తంగా ఇక మొత్తం ఎలక్ట్రిక్ బస్సులనే నడపబోతున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ సజ్జనార్ వెల్లడించారు. దీనికోసం మొత్తం 2,500 ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నామని, ఇప్పటికే 500 బస్సులు నగరంలో తిరుగుతున్నాయని తెలిపారు. త్వరలో మిగిలినవి కూడా దశలవారీగా ప్రవేశపెడతామని చెప్పారు. దీనిద్వారా వాయుకాలుష్యం, శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గి నగరవాసులకు మేలు చేకూరుతుందని సజ్జనార్ అన్నారు.
తెలంగాణలో వివిధ జిల్లాలనుంచి హైదరాబాద్‌కు ఇంటర్ సిటీ సర్వీసులకోసం నడపటానికి కేటాయించిన 500 బస్సులలో కరీంనగర్‌కు తొలివిడతగా మంజూరైన 35 బస్సులను రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ప్రారంభించారు. కరీంనగర్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఆర్టీసీ ఛైర్మన్ సజ్జనార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సజ్జనార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 325 కి.మీ. ప్రయాణిస్తాయని, 2-3 గంటల్లో వందశాతం ఛార్జ్ అవుతాయని తెలిపారు. ఈ బస్సుల్లో 41 సీట్ల సామర్థ్యం ఉంటుందని, క్యాబిన్, సెలూన్‌లలో రెండు చోట్ల సీసీ కెమేరాలు పెట్టామని చెప్పారు. కరీంనగర్ నుంచి మూడే గంటల్లో హైదరాబాద్ జేబీఎస్ బస్ స్టేషన్ చేరుకుంటామని తెలిపారు. బస్సులో ప్రయాణీకులకు చాలా అధునాతన సౌకర్యాలు కల్పించామని చెప్పారు.
తెలంగాణ జిల్లాలలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను మొదటిసారిగా కరీంనగర్‌లో ప్రారంభించటం గర్వకారణమని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఉచిత బస్ ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలని ఆదేశిస్తే తెలంగాణ ఆర్టీసీ కేవలం 48 గంటల వ్యవధిలోనే ఆ పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ బస్సులను మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్‌జెండర్‌లు విరివిగా వినియోగించుకుంటున్నారని, తమకున్న మొత్తం బస్సుల్లో 85 శాతం బస్సులను ఈ పథకంకోసం వాడుతున్నామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, త్వరలో ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని తెలిపారు.