
‘ప్రరవే’ జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత మృతి
సామాజిక ఉద్యమకారిణి, కవయిత్రి, జానపద గాయకురాలు, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజితవరంగల్లులో ఆగస్టు 11 వతేదీన గుండెపోటుతో మరణించారు.తన కలంతో, గళంతో స్త్రీల పక్షాన ఓ వైపు ,సామాజిక సమస్యల పక్షాన ఇంకో వైపు పోరాడిన యోధురాలు అనిసెట్టి రజిత. విద్యార్ధి దశ నుండే ఉద్యమజీవితం వైపు ఆకర్షితురాలిన రజిత,హైస్కూల్ లో చదువుతున్నప్పుడే 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రగతిశీల మహిళా సంఘం పిలుపుకు స్పందించారు. సమకాలపు సామాజికే సమస్యలకు స్పందిస్తూ ఇంకో పక్క కవిత్వం కూడా రాసారు.
1982 లో కాకతీయ అధ్యాపక బృందం విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన స్త్రీజనాభ్యుదయ అధ్యయన సంస్థలో భాగస్వామి అయ్యారు. 1984 లో ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ అనే చిన్న కవితా సంపుటిని ప్రచురించారు అందులో ఒకటి రెండు మినహాయిస్తే అన్నీ స్త్రీల సమస్య కేంద్రంగా వచ్చిన కవితలే. స్త్రీ సమస్యలపై అధ్యయనం, ఆచరణ కార్యక్రమాలు-ఇవే రజిత కవితా వస్తువులు. అంతేకాదు, ఆనాటి మహిళా ఉద్యమ అవసరాల నుండి రజిత జానపద గాయకురాలు అయింది. శబ్దలయను గురించిన స్పృహ ఆమె రచనలోనూ ధిక్కారం ఆమె గానంలోనూ స్వభావమై ఒదిగిపోయాయి. సారా వ్యతిరేక ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమం, మల్లన్న సాగర్ వ్యతిరేక ఉద్యమం, ముజఫర్ నగర్ మారణకాండ నిరసన ఉద్యమం,ఒక వైపు అక్షరంతో ;ఇంకో వైపు స్వరంతో సమస్యలతో పోరాడారు రజిత.
1997లో ‘నేనొకనల్ల మబ్బునవుతా’కవితా సంపుటిని, 1998 లో ‘చెమట చెట్టు’అనే ఇంకో సంపుటిని , 2002 లో ‘ఉసురు’ను ,2005 లో ‘ అనగా అనగా కాలం’ ను , ‘దస్తఖత్’ కవితా సంపుటులను వెలువరించారు. వీటితో పాటు ఓ లచ్చవ్వ ,మార్కెట్ స్మార్ట్ శ్రీమతి అనే దీర్ఘ కవితలు కూడా రాసారు.2016 లో ఉద్యమ కవితలను ’నిర్భయాకాశం కింద’ అనే శీర్షికతో కవితా సంపుటిగా ప్రచురించారు. అనేక కథలకు,సాహితీ సంపుటాలకు సంపాదకత్వం కూడా వహించారు.
రజిత తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ రచయితల వేదిక నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు. మహిళా ఉద్యమ అస్తిత్వ చైతన్యం మూలంగా ఏర్పడిన ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ పదహారేళ్ళుగా ‘ప్రరవే’ జాతీయ కార్యవర్గంలో బాధ్యతాయుతమైన స్థానాలలో ఉండి పనిచేసారు.
తన మరణం కూడా కొందరికి కొత్త జీవితాన్ని అందించాలన్న సదుద్దేశంతో రజిత అవయవదానం కూడా చేసారు. ఈ రోజు అంటే ఆగస్ట్ 12 వ తేదీ ఉదయం 11 గంటల వరకూ కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేటుకి ఎదురుగా ఉన్న ప్రొ. కాత్యాయనీ విద్మహే ఇంటివద్ద అనిశెట్టి రజిత పార్థివ దేహం ఉంటుందని ; ఆమె శరీరదానం చేసినందువల్ల తరువాత కాకతీయ వైద్య కళాశాలకి అప్పగిస్తామని; ‘ప్రరవే’ సంస్థ ప్రకటించింది.
* * *