అన్న అనే పదానికే జగన్ కళంకం: వైఎస్ షర్మిల ధ్వజం
x

అన్న అనే పదానికే జగన్ కళంకం: వైఎస్ షర్మిల ధ్వజం

బాబాయి హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ వివాదం వల్లే జరిగిందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉన్న రాజకీయ కోణాన్ని కుండబద్దలు కొట్టినట్లు వివరించారు. ఈ హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ వివాదం వల్లే జరిగిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

టికెట్ వివాదమే ప్రాణం తీసింది..
కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి ఏమాత్రం సరిపోడని వివేకా బాబాయ్ నాతో స్వయంగా చెప్పారు. అదే మాటను జగన్‌కు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా, మొండిగా అవినాష్‌కే టికెట్ ఇచ్చారు అని షర్మిల గుర్తుచేశారు. వివేకా బతికుంటే రాజకీయంగా తమకు అడ్డుతగులుతారని భావించే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ హత్యను కేవలం గుండెపోటుగా చిత్రీకరించేందుకు సాక్షి మీడియా ప్రయత్నించిందని, చివరికి సునీత భర్తపైనే నిందలు వేయాలని చూశారని ఆమె మండిపడ్డారు.
అధికారం కోసం హత్యను వాడుకున్నారు..
వివేకా హత్య కేసును అడ్డుపెట్టుకునే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని షర్మిల ఘాటుగా విమర్శించారు. నాడు ప్రతిపక్ష నేతగా సీబీఐ విచారణ కావాలని కోరిన జగన్, సీఎం పీఠం ఎక్కాక మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. సొంత చెల్లెలు సునీత ఎంతగా ప్రాధేయపడినా విచారణకు అంగీకరించలేదు. ఇప్పుడు జరుగుతున్న సీబీఐ విచారణ కేవలం కోర్టు ఆదేశాల వల్ల సాగుతున్నదే తప్ప, జగన్ చొరవ వల్ల కాదు అని ఆమె స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలనలో ఈ కేసును ఎందుకు కొలిక్కి తేలేకపోయారని ఆమె నిలదీశారు.
అన్న అనే పదానికే కళంకం..
జగన్ తీరుపై అత్యంత కటువైన వ్యాఖ్యలు చేస్తూ.. సొంత చెల్లెళ్లకు అన్యాయం చేసే ఇలాంటి అన్న ఉంటే, ఇక శత్రువులు కూడా అవసరం లేదు. నిజానికి జగన్ అన్న అనే పదానికే కళంకం అని షర్మిల ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యుల పట్ల జగన్ అనుసరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
విశాఖలో రచ్చబండ .. ఉపాధి హామీపై పోరు
మరోవైపు, ఉపాధి హామీ చట్టం (MGNREGA) పరిరక్షణ కోసం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని కోరాడ గ్రామంలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అక్రమ చట్టాల వల్ల కూలీలు ఎంతగా నష్టపోతున్నారో ఆమె వివరించారు. అదే సమయంలో, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, కరువు పనుల విషయంలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. మన్రేగా చట్టాన్ని పాత పద్ధతిలోనే పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు.
Read More
Next Story