ఆందోళనకారులకు వెస్ట్ బెంగాల్ సీఎం మమత అభయం
x

ఆందోళనకారులకు వెస్ట్ బెంగాల్ సీఎం మమత అభయం

మీ ఉద్యోగాలకు ఢోకా లేదు..దయచేసి మీ స్కూళ్లకు తిరిగి వెళ్లండని ఆందోళనకారులకు విజ్ఞప్తి


పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులకు అభయమిచ్చారు. ఆందోళన వీడి తిరిగి విధుల్లో చేరాలని ఆమె కోరారు. మిడ్నాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ.. బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు సకాలంలో అందుతాయని హామీ ఇచ్చారు.

మమత హామీ..

"ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో అన్న దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఉద్యోగం ఉందా? జీతాలు సకాలంలో అందుతున్నాయా? అనే దాని గురించి మాత్రమే మీరు ఆలోచించాలి. దయచేసి మీ స్కూళ్లకు తిరిగి వెళ్లండి. ఉద్యోగాలు కోల్పోయిన గ్రూప్ సి, గ్రూప్ డి సిబ్బంది కోసం సుప్రీంకోర్టు(Supreme Court)లో రివ్యూ పిటిషన్ వేస్తాం. అప్పటివరకు మాపై నమ్మకం ఉంచండి, " అని మమత కోరారు.

విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసు(Bratya Basu) కూడా ఆందోళన వీడాలని నిరసనకారులను కోరారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసే రివ్యూ పిటిషన్‌ను బలహీనపరిచే చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. అర్హులు ఉద్యోగాల్లో కొనసాగిలా విద్యా శాఖ చర్యలు తీసుకుంటుందని మీడియాకు చెప్పారు.

అసలు ఏం జరిగింది ?

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ నియామకాలను చేపట్టింది. నియామకాల్లో అవినీతి చోటుచేసుకుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ‘స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కాం’ కుంభకోణంపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు 2024 ఏప్రిల్‌లో తీర్పు వెల్లడించింది. నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత ఉద్యోగం పొందిన వారు.. అలానే బ్లాంక్ ఓఎమ్మార్ షీట్స్ సబ్మిట్ చేసి.. ఉద్యోగాలు పొందిన వారి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. మోసపూరితంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఇన్నాళ్ల పాటు పొందిన వేతనాన్ని 12 శాతం వడ్డీరేటుతో కలిపి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మమతా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. నియామక ప్రక్రియ, ఉద్యోగాల కేటాయింపులో మోసపూరిత విధానాలు అవలంబించారని అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. 25 వేల మంది నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది.

కోల్‌కతా నిరసన..

సుప్రీంకోర్టు (Supreme Court) ఉత్తర్వుల తరువాత ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది ఉపాధ్యాయులు మంగళవారం (ఏప్రిల్ 22) పశ్చిమ బెంగాల్(West Bengal) ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సోమవారం సాయంత్రం సాల్ట్ లేక్‌లోని సర్వీస్ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులు.. తమకు "న్యాయం" జరిగే వరకు కదలమని హెచ్చరించారు.

'అర్హులు, అనర్హుల జాబితా ప్రచురించాలి'

కమిషన్ చైర్మన్ సిద్ధార్థ మజుందార్ సహా అధికారులను లోపలికి వెళ్లనివ్వకుండా, బయటకు రానివ్వకుండా అడ్డుకున్న ఆందోళనకారులు.. మెరిట్ ఆధారంగా నియామకాలు పొందిన అభ్యర్థుల జాబితా, లంచాలు చెల్లించి నియామకాలు పొందిన అభ్యర్థుల జాబితాను ప్రచురించాలని డిమాండ్ చేశారు.

Read More
Next Story